సినిమా, టీవీ ఇండస్ట్రీ అంటేనే వెయ్యి శాతం హిపోక్రసీ… అవకాశవాదం… డబ్బు తప్ప మరేమీ అక్కడ కనిపించదు… కరెన్సీ నోటు ఎన్ని దుష్కృత్యాలైనా చేయిస్తుంది… బయట సమాజం గొప్పగా ఉందని కాదు… కానీ ఫిలిమ్, టీవీ ఫీల్డుల్లో… ఆ రంగుల ప్రపంచాలు విసిరే ట్రాపులు, కరిగే కలలు, కారే కన్నీళ్లు, మోసాలు, కుట్రలు, అబద్దాలు, ఆత్మవంచనలు, వెన్నుపోట్లు, నయవంచనలు, లైంగిక దోపిడీలు, తార్పుడు బాగోతాలు… వాట్ నాట్… అదొక అధోప్రపంచం…
కొందరు ఉంటారు… సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా కుంగిపోరు, పొంగిపోరు… ఆత్మాభిమానం చంపుకోరు… చంపుకునే సందర్భాల్లో లోలోపల కుమిలిపోతారు… అలాంటోళ్లు ఏదైనా రాస్తే అది సమాజానికి తెలియాలి… ఎందుకంటే..? అవి అత్యంత అరుదు… ఎంఎస్‌రెడ్డి అలియాస్ మల్లెమాల అలా కడుపులో ఉన్నది కక్కేసేరకం… ఓ ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు… ఆ పుస్తకం పేరు ‘ఇదీ నా కథ’… జనంలోకి రాకమునుపే ఆయన కొడుకు శ్యాంప్రసాద్‌రెడ్డి అవన్నీ మార్కెట్ నుంచి వాపస్ తెప్పించి, ఓ రూంలో పడేసి, తాళాలు వేసి, ఆ అక్షరాల్ని బంధించేశాడని అప్పట్లో చదివినట్టు గుర్తు…
కానీ వాట్సప్ గ్రూపుల్లో అక్కడక్కడా ఆ పీడీఎఫ్ కనిపిస్తూనే ఉంది… నిజానికి శ్యాంప్రసాద్ ఎందుకంత ఉలిక్కిపడ్డాడో అర్థం కాలేదు… అంతగా వణికిపోవాల్సిన అధ్యాయాలు ఏమీ లేవు అందులో… మరోసారి చదివితే అక్కడక్కడా జూనియర్ ఎన్టీయార్, చిరంజీవి, రాజశేఖర్‌లపై కొన్ని విసుర్లు… ఎన్టీయార్ డబ్బు కక్కుర్తి, ఏదో వివాదంలో శోభన్‌బాబుతో ఘర్షణ వంటి కొన్ని పేరాలు మాత్రమే కాస్త పరుషంగా ఉన్నాయి… అవి కూడా ఎంఎస్‌రెడ్డి ఆవేదన నుంచి జాలువారిన కన్నీళ్లే… అంతేతప్ప కోపంతోనో, ద్వేషంతోనో రాసినట్టుగా లేవు… నిజానికి జనానికి తెలియాల్సినవే అనిపించింది…
Ads
ఒకవేళ అంతగా వణికిపోయే పక్షంలో… మరీ పరుషంగా అనిపించిన చోట్ల ఎడిట్ చేసి, మిగతా పుస్తకాన్ని మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తే బాగుండు… నిజానికి యథాతథంగా రిలీజ్ చేయాలి… ఏమవుతుంది..? శ్యాంప్రసాద్‌రెడ్డిని మీద కక్షకట్టి, ఒక చిరంజీవో, ఒక జూనియరో ప్రతీకారం తీర్చుకుంటారా..? ఈటీవీ రామోజీరావు మీద ఒత్తిడి తీసుకొచ్చి మల్లెమాల ప్రొడక్షన్స్ ఆపేయించి, కడుపు కొడతారా..? ఎలాగూ అరుంధతి తర్వాత సినిమాలే తీయడం లేదుగా..! నిజానికి ఈ పుస్తకంలో ఎంఎస్‌రెడ్డి స్వాతిశయం ఏమీ కనిపించలేదు… నిజాయితీగానే రాసుకొచ్చాడు…
ఓ మాజీ ముఖ్యమంత్రి అల్లుడు, ఓ ప్రఖ్యాత నిర్మాత కొడుకు కూడా అంతగా భయపడిపోతే ఎలా..? ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ‘నువ్వు నన్ను గోకు, నేను నిన్ను గోకుతా” అనే యవ్వారం… బయటికి ఎవడూ ఎవడినీ ఏమీ అనడు… లోలోపల భీకరమైన కుట్రలు… అరశాతం జనానికి తెలిస్తే తప్పేమిటి..? నిజానికి మల్లెమాల తన జీవితాన్ని, తన పద్యాల్ని, తన విదేశీపర్యటనల్ని, తన పదవుల్ని రాసుకున్నాడు… అధికశాతం బోర్… అక్కడక్కడా కాస్త ఇంట్రస్టింగు… దీన్ని ఆపేయడం శుద్ధ దండుగ… ఇప్పటికైనా శ్యాంప్రసాద్‌రెడ్డి పునరాలోచించవచ్చు… తండ్రి మరణించి దశాబ్దం గడిచింది ఎలాగూ…
అంజి దెబ్బకు (ఆ భీకరమైన ఫెయిల్యూర్‌కు చిరంజీవి ఇమేజీ పాకులాటే ప్రధాన కారణం) పాతాళంలోకి కుంగిపోయి, ఎలాగోలా అరుంధతితో కోలుకున్న శ్యాంప్రసాద్ తరువాత సినిమాలే తీయలేదు… 13 ఏళ్లుగా ఈటీవీయే వేదిక తనకు… ప్రత్యేకించి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, క్యాష్ ఎట్సెట్రా రియాలిటీ షోలతో కథ నడుస్తోంది… తండ్రి రాసుకున్న బయోగ్రఫీ చదివి ఉక్రోషపడి, ఆగ్రహపడి, ఆవేశపడి ఎవరూ మల్లెమాలను ఏమీ చేయలేరు… నిజానికి శ్యాంప్రసాద్‌కు కూడా తెలుసు… ఇండస్ట్రీలో కుట్రలెన్ని ఉంటాయో, పిరికితనం కూడా అంతే… మరెందుకు ఈ పుస్తకాన్ని చీకటి గదిలో అలా దుమ్ముకు అంకితం చేసినట్టు…
ఒక విషయం చెప్పాలి… ఎంఎస్‌రెడ్డి మరణించిన ఏడాదికి కావచ్చు బహుశా… నిర్మాత కాట్రగడ్డ మురారి ‘‘నవ్విపోదురుగాక’’ అని ఓ పుస్తకం రాశాడు… అదీ తన జీవితం గురించే… అందులో కూడా కొందరు సినిమా పర్సనాలిటీలపై దడదడ తను అనుకున్నట్టు రాసేశాడు… ఎవరేం అనుకుంటారో జానేదేవ్… ఏమయింది..? ఏమీ కాదు..! 300 లేదా 400 రేటు పెట్టి మరీ అమ్మాడు… ఎస్… ఉంటయ్, కొన్ని కంట్రవర్సీ పాయింట్లు ఉంటయ్… బయోగ్రఫీ అంటే భజన కాదు కదా… కొన్ని రాస్తే తప్పేమిటి..? నష్టమేమిటి..? సో వాట్..? సో వాట్..?!
జమునను లైట్ తీసుకుని, చీదరించిన జయలలిత ఉదంతం… పౌండ్రక వాసుదేవుడి కథ తెలియని ఎన్టీయార్… పారితోషికం లేకుండా డాన్స్ బిట్ చేసిన హేమమాలిని… దర్శకుడు గుణశేఖర్ ప్రదర్శించిన పైత్యం… ఆస్తులు అమ్మివేయించిన అంజి… ఎన్టీయార్ పార్టీ పెట్టడానికి అంకురార్పణ చేసిన నేదురుమల్లి గెస్ట్‌హౌజ్ ఎపిసోడ్… ఇలాంటివన్నీ పాఠకులకు తెలిస్తే తప్పేముంది..? ఈ బుక్కు ఇప్పటికైనా రిలీజ్ చేస్తే బెటర్… బెటర్…!!
Share this Article