.
కరణ్ థాపర్… దేశంలోని ప్రఖ్యాత జర్నలిస్టుల జాబితాలో తనూ ఉంటాడు… అప్పుడప్పుడూ తన వ్యాసాల ద్వారా కొత్త డిబేట్లను తెరపైకి తీసుకొస్తుంటాడు… సరే, కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు…
తాజాగా భారతరత్న పురస్కారాలను తెరపైకి తీసుకొచ్చాడు… ముందుగా తనేమంటున్నాడో చూద్దాం… పద్మ పురస్కారాలు 1954లో స్టార్ట్ చేస్తే ఇప్పటికి 53 మందికి భారతరత్న ప్రకటించారు… అందులో 31 మంది రాజకీయ నాయకులే… మొత్తం భారతరత్న పురస్కారాల్లో 18 వాళ్ల మరణానంతరం ప్రకటించినవే…
Ads
పటేల్‌కు మరణానంతరం 41 ఏళ్లకు, అంబేడ్కర్‌కు మౌలానా ఆజాద్‌లకు 31 ఏళ్ల తరువాత, కర్పూరీ ఠాకూర్‌కు 36 ఏళ్ల తరువాత, మదన్ మోహన్ మాలవీయకు 69 ఏళ్ల తరువాత ప్రకటించారు.., వై నాట్ మహాత్మాగాంధీ..?
అసలు మొత్తం భారతరత్నాల్లో 14 మంది ఈ పురస్కారానికి అర్హులు కారు… వాళ్లెవరంటే..? జాకీర్ హుస్సేన్, గోవింద్ వల్లభ్ పంత్, రాజీవ్ గాంధీ, వివి గిరి, కే కామరాజ్, ఎంజీఆర్, మొరార్జీ దేశాయ్, ప్రణబ్ ముఖర్జీ, గుల్జారీ లాల్ నందా, బోర్డోలాయి గోపీనాథ్, ఎల్‌కే అడ్వాణీ, చౌదరి చరణ్ సింగ్, కర్పూరీ ఠాకూర్, నానాజీ దేశ్‌ముఖ్…
వీరిలో భారతరత్న పురస్కారాలు ప్రారంభించకముందే, మనకు స్వాతంత్ర్యం రాకముందే మరణించినవాళ్లూ ఉన్నారు… అసలు అర్హులు లేరా..? మన ఫీల్డ్ మార్షల్ మానెక్ షా లేడా..? తనకు ఎందుకు భారతరత్న దక్కకూడదు..? ఈ దేశం గర్వించదగిన మిలిటరీ హీరో…
మరొకరు దలై లామా… 90 ఏళ్లు నిండిన సందర్భంగా తప్పకుండా భారతరత్న ప్రకటించి ఉండాల్సింది… 1989లోనే తనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది… చైనాకు నచ్చదనే భావనతో ప్రభుత్వం వెనుకాడుతోందా..?
ఇక అమితాబ్ బచ్చన్ ఈ దేశం గర్వించదగిన నటశిఖరం… 1992లో సత్యజిత్ రాయ్, 2001లో లతా మంగేష్కర్… మరి ఇప్పటికీ మనమధ్యే ఉన్న అమితాబ్ ఏం తక్కువ..? ఇలాంటి వాళ్లకు భారతరత్న పురస్కారాలు ఇస్తే వాటి ఔన్నత్యం పెంచినట్టు కాదా..?
……. ఇలా రాస్తూ పోయాడు… అనర్హుల జాబితాలో మరీ రాజీవ్ గాంధీ పేరు, ఎల్‌కే అడ్వాణీ పేరు ప్రస్తావించడం రెండు ప్రధాన జాతీయ పార్టీలకూ రుచించదు… కొన్ని పేర్లు ఈతరం విని, చదివి ఉండదు కూడా… ఏ విషయమైనా సరే, జర్నలిస్టు కోణం వేరు… అధికారంలో ఉన్నవాళ్ల కోణం వేరు… అంటే లెక్కలు వేరు…
కానీ కొన్నింటితో ఏకీభవించొచ్చు.., క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ ఎంతో… ఇండియన్ సినిమాకు సంబంధించి అమితాబ్ బచ్చన్ అంతకు చాలా ఎక్కువ… చాలామంది అర్హులున్నారు, లేరని కాదు… అనేక ప్రతిపాదనలు, కోరికలు కేంద్రం దగ్గర పెండింగ్… కొందరికి ఈ పురస్కారాల మీద విమర్శలు, వ్యాజ్యాలు కూడా నడిచాయి…
అయితే ఇక్కడ ఇప్పుడు ఈ వ్యాసం ప్రస్తావన దేనికీ అంటే..? నిజంగా రాజీవ్ గాంధీ, ఎల్‌కే అడ్వాణీ భారతరత్న పురస్కారాలకు అనర్హులా..? అసలు భారతరత్న పురస్కారానికి ఎవరు అర్హులు..?! ప్రామాణికాలు ఏమిటి..?!
Share this Article