తన సీనియారిటీని అగౌరవపరిచి, తనను పక్కకు తోసేసిన గురుద్రోహాన్ని కడుక్కోవడం కోసం మోడీ అద్వానీని రాష్ట్రపతిని చేయడం బెటర్ అంటాడు ఒకాయన… అబ్బే, వెంకయ్య నాయుడికే ప్రమోషన్ ఇవ్వడం మేలు అంటారు ఇంకొకాయన… నో, నో, విపక్ష వోట్లు లేకుండా రాష్ట్రపతిని గెలిపించుకోలేదు బీజేపీ, అందుకే శరద్ పవార్‌ను పెడితే సరి, ఈజీ అని సూచిస్తున్నాడు మరొకాయన… ఇవన్నీ కాదు, గులాం నబీ ఆజాద్‌ను రాష్ట్రపతిని చేస్తే గాయపడిన కశ్మీరీయులకు కొంతైనా స్వాంతన దక్కుతుంది అని తేల్చేశాడు మరో వీరవిశ్లేషకుడు…
ఓ పనిచేయండి మోడీజీ, చంద్రబాబును రాష్ట్రపతిని చేసేయండి, ఆ పార్టీని విలీనం చేసేసుకొండి, దాన్ని ఉద్దరించే వారసులు లేరు అని వెటకారంగా సూచించేవాళ్లు కూడా కనిపిస్తున్నారు ఈమధ్య… రజినీకాంత్ పేరు సహా ఇలా బోలెడు పేర్లు కాబోయే రాష్ట్రపతి కోసం అప్పుడే తెరమీదకు వచ్చేసి, చర్చల్లో నలుగుతున్నయ్… రకరకాల ఈక్వేషన్లు వినిపిస్తున్నారు… ఇలాంటి కీలక విషయాల్లో అమిత్ షా, మోడీ అస్సలు బయటపడరు…
గత రాష్ట్రపతి ఎన్నికల ముందు హఠాత్తుగా రామనాథ్ కోవింద్ పేరును బహిర్గతం చేశారు… దళితుడు, బాగా చదువుకున్నవాడు, పార్టీకి విధేయుడు, పలు పదవుల్లో పనిచేసిన అనుభవం ఉంది, వివాదరహితుడు, సౌమ్యుడు… ఇంకేముంది..? అందరి యాక్సెప్టన్సీ వచ్చేసింది… ఎన్నిక సాఫీగా జరిగిపోయింది… నిజానికి అప్పుడే బీజేపీ వర్గాల్లో ఓ పేరు బాగా వినిపించింది… ఆ మహిళ పేరు ద్రౌపది ముర్ము… చివరలో మోడీ షా లెక్క ఎందుకు మారిందో తెలియదు గానీ ఆమె పేరు వెనక్కి వెళ్లిపోయింది…
Ads
మీరు ఎన్ని పేర్లయినా చెప్పండి… ప్రస్తుతం ఒక ప్రధాన ప్రశ్న… ద్రౌపది ముర్ముకన్నా మంచి అభ్యర్థి ఎవరు..? ఆమె ఎందుకు ఈ దేశ అత్యున్నత పదవిలో కూర్చోవద్దు..? వై నాట్ ద్రౌపది..? వై ద్రౌపది..? ఈ రెండు ప్రశ్నలకూ బోలెడు సమర్థనీయ జవాబులున్నయ్… ఆమెది ఒడిశా… మయూర్‌భంజ్ జిల్లాలోని బైడపోసి ఊరు… సంతాల్ అనే గిరిజన తెగ వాళ్లది… చదువుకుంది… కొద్దిరోజులు ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్… తరువాత టీచర్…
రాజకీయాల్లో చేరాక మొదట 1997లో రాయ్‌రంగపూర్ అనే ఓ నగర పంచాయితీకి కౌన్సిలర్… బీజేపీ ఎస్టీ మోర్చాకు ఉపాధ్యక్షురాలు… తరువాత రెండుసార్లు అదే రాయ్‌రంగపూర్ నుంచి ఎమ్మెల్యే… బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండు దఫాలు మంత్రి… జార్ఖండ్ గవర్నర్… సో, చదువు ఉంది, అనుభవం ఉంది, పార్టీకి ఎంతోకాలంగా పనిచేసిన విధేయత ఉంది… అన్నింటికీ మించి ఆమె ఓ మహిళ… అదీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురికాబడిన గిరిజన తెగకు ప్రతినిధి… గ్రాడ్యుయేట్… రాష్ట్రపతి పదవిలో తొలిసారిగా ఓ గిరిజన మహిళ కూర్చుంటే తప్పేముంది..? ఎంపిక చేయకపోతేనే తప్పు..!
ఆమె కుటుంబపరంగా బాగా నష్టపోయింది… భర్త మరణించాడు… ఇద్దరు కొడుకుల్ని కోల్పోయింది… ఓ కూతురు ఉంది, ఇతిశ్రీ ముర్ము… జార్ఖండ్ గవర్నర్‌గా పూర్తి పదవీకాలం పనిచేసిన గవర్నర్ ఆమే… ఈ సంతాల్ తెగకు ఓ విశిష్టత ఉంది… జార్ఖండ్ మొదటి ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండి, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కూడా ఈ తెగ వాళ్లే… ద్రౌపది పేరు ప్రకటించగానే ఫస్ట్ మద్దతు నవీన్ పట్నాయక్ నుంచి… మిగతా గాయిగత్తర విపక్షాల నోళ్లు కూడా మూతపడతాయి…!!
Share this Article