.
రేవంత్ రెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులకు బాగా, బలంగా నచ్చేది ఇదే… గెలుపో, ఓటమో జానేదేవ్… గిరి గీసి, బరిలో నిలబడతాడు, తలపడతాడు… సవాళ్లు విసురుతాడు, ఆ సవాళ్లపై పోరాడతాడు… ఆ ధోరణి తెలంగాణ ప్రజానీకానికి కూడా నచ్చింది, అప్పటిదాకా కేసీయార్ నియంతృత్వ, అడ్డదిడ్డం పాలనతో విసిగిన ప్రజలు, ఇక కేసీయార్‌కు ఎదురుగా నిలబడే కాంగ్రెస్ లీడర్ తనే, ఆల్టర్నేటివ్ తనే అని ఫిక్సయిపోయి, మొన్నటి ఎన్నికల్లో వోట్లేశారు, గెలిపించారు… ఇది రియాలిటీ…
ఈ దూకుడు గతంలో కాంగ్రెస్ నాయకుల్లో ఏమాత్రం కనిపించేది కాదు… అసలు కేసీయార్‌కు దీటుగా సవాళ్లు, జవాబులు వినిపించేవే కావు… వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో కాస్త కనిపించేది… ఈ రేవంత్ దూకుడే తెలంగాణ కాంగ్రెస్ కొత్త బలం… ఇవీ మా సామ్రాజ్యాలు, మాకు పెట్టనికోటలు, మా అడ్డాలు అని బీఆర్ఎస్ ముఖ్యనేతలు భావించే సిరిసిల్ల, సిద్దిపేట స్థానాలపైనా రేవంత్ రెడ్డి సవాళ్లకు రెడీ అంటున్నాడు ఇప్పుడు… అవి బద్దలు కొట్టడానికి తనదైన స్టయిల్ చూపిస్తున్నాడు…
Ads
తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకుడు అనే భుజకీర్తుల వెనుక చీకటి కోణాల్ని, అక్రమాల్ని, భారీ అవినీతి సంపాదనను, ఫామ్ హౌజులను, స్టార్ హోటళ్లను, వేల కోట్ల ఆస్తుల్ని బయటపెడుతున్నాడు కదా… ఇప్పుడిక ఎవరికీ ఏ కోట సురక్షితం కాదు అని చెప్పే మరో రాజకీయ ప్రయత్నం…

ఆల్రెడీ పార్టీ తరఫున సెప్టెంబరు చివరలో సిరిసిల్లలో సమావేశం జరిగింది… కష్టపడండి, కేటీయార్ కోటను బ్రేక్ చేద్దాం అనే ఉత్సాహాన్ని పార్టీ శ్రేణులకు ఇచ్చాడు… ఇప్పుడిక సిద్దిపేట… మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది…
అదే రోజున ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు… రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు… సిద్దిపేట మీటింగు, ప్రోగ్రామ్స్ పార్టీవి కావు, ప్రభుత్వానివి… హరీష్ రావుకు కూడా ఓ సవాల్ విసరడమే ఇది…

నిన్నటి మంత్రివర్గ సమావేశపు నిర్ణయాల్లో ఈ సిద్దిపేట బహిరంగసభ ఆసక్తికరం… ఇక తరువాత గజ్వెల్..? ఇది మాజీ సీఎం కేసీయార్ నియోజకవర్గం… అక్కడ ఈటల రాజేందర్ గనుక నిలబడకపోయి ఉంటే, కేసీయార్ కాంగ్రెస్ కీలక నాయకుల్ని లోబరుచుకోకుండా ఉండి ఉంటే… కేసీయార్ వ్యతిరేక వోటు ఇలా చీలిపోకుండా ఉంటే… కేసీయార్ నానా తిప్పలూ పడాల్సి వచ్చేది, కథ వేరేలా ఉండేది…
సాధకుడు, జాతిపిత, తొలి సీఎం వంటి బిరుదులు పనిచేయవు… అవి ఉత్త భ్రమాత్మక భూషణాలు, అంటే దేవతావస్త్రాలు తరహా… అందుకే కామారెడ్డిలో కేసీయార్ స్వయంగా నిలబడినా ఓడించారు జనం… అంతెందుకు..? ఇది నా కోట, అన్ బ్రేకబుల్ అనే భావనే అబ్సర్డ్… ఉదాహరణ ఏపీలోని పులివెందుల…

పురపాలక, పరిషత్ ఎన్నికల్లో ఆల్రెడీ టీడీపీ కూటమి వైసీపీకి చుక్కలు చూపించింది… వైఎస్ కుటుంబానికి పెట్టనికోట అనే భావనల్ని చెల్లాచెదురు చేసింది… సో, ఏదీ ఎవరికీ కోట కాదు, సురక్షిత స్థానమూ కాదు… ఎటొచ్చీ సవాల్ విసిరి, బరిలో కొట్లాడే సమర్థుడు కావాలి… సిద్దిపేట సభను కూడా ఈ కోణంలోనే చూడాలి…
కానీ ఏమాటకామాట… కేసీయార్ బిడ్డ కవిత… పదే పదే హరీష్ రావు మీద దాడి చేస్తోంది కదా… ఆమె గనుక సిద్దిపేట బరిలో నిలబడితే… కాంగ్రెస్ పార్టీతో అవగాహన కుదుర్చుకుంటే… సర్వశక్తులూ ఒడ్డితే… కథ ఖచ్చితంగా రక్తికడుతుంది…

అన్నట్టు… నిన్నటి మంత్రివర్గ సమావేశపు నిర్ణయాల్లో నచ్చిన మరొకటి… దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలనే నిర్ణయం… మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు… ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ఈ కార్యక్రమం ఉంటుంది… ఖచ్చితంగా ఇలాంటివి ప్రభుత్వంపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తాయి, గుడ్ డెసిషన్…
Share this Article