మరక్కర్… మలయాళం సినిమా… పాన్ ఇండియా మూవీ, పలు భాషల్లో రిలీజ్ చేశారు… ఓ సముద్రవీరుడి కథను వీసమెత్తు అశ్లీలం లేకుండా, బూతు పాటలు లేకుండా, గలీజ్ సీన్స్ లేకుండా నీట్‌గా, భారీగా ప్రజెంట్ చేశారు…. జైభీం… తమిళ సినిమా… ఓ కమర్షియల్, పాపులర్ హీరో అయి ఉండీ, ఓ సోషల్ ఇష్యూను హైలైట్ చేస్తూ, పాత రియల్ సంఘటనల్నే సూర్య ఇంప్రెసివ్‌గా ప్రజెంట్ చేశాడు… తులమెత్తు అశ్లీలం కనిపించదు సినిమాలో…! రెండూ వేర్వేరు జానర్లు… కానీ ఎక్కడ కథలో గానీ, కథనంలో గానీ పక్కదోవ పట్టలేదు… మితిమీరిన హీరోయిజం గానీ, వెగటు కలిగించే దృశ్యాలు గానీ కనిపించవు… ఇవి ఇప్పుడు చెప్పుకోవడానికి నేపథ్యం ఉంది…
ఈసారి ఆస్కార్ అవార్డుల బరిలో మంచి ఫీచర్ ఫిల్మ్స్ విభాగానికి షార్ట్ లిస్ట్ చేయబడిన 276 సినిమాల్లో ఇవి రెండూ ఉన్నయ్… గత ఏడాది సూర్య తీసిన ఆకాశం నీ హద్దురా సినిమా కూడా ఆస్కార్ బరి దాకా వెళ్లొచ్చింది… అంటే రెండు వరుస సంవత్సరాల్లో సూర్యవి రెండు సినిమాలు ఆస్కార్ మెట్టు టచ్ చేశాయి… నిజానికి తను కమర్షియల్ హీరో, ప్రతి సినిమాకు లాభాల లెక్కలు చూసుకునే కేరక్టరే… ఐనా కథల్లో బోలెడంత వైవిధ్యం చూసుకుంటున్నాడు… తను నిర్మాతగా తీసే సినిమాలు కూడా అంతే… భిన్నమైన కథలు, వాటికి అనుగుణంగా కథనాలు…
ఆస్కార్ వార్త చదువుతుంటే హఠాత్తుగా మన తెలుగు సినిమాలు రెండు గుర్తొచ్చాయి… ఒకటి అఖండ… రెండు పుష్ప… రెండూ బంపర్ హిట్లు కొట్టాయి… వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి… ఆ సినిమాల విశ్లేషణ ఇక్కడ అక్కరలేదు గానీ… కొన్ని విషయాలు మాత్రం చెప్పుకోవాలి… (రఫ్లీషియా పుష్పం చాలా పెద్దది, కానీ వాసన దగ్గరకు కూడా రానివ్వదు…) అవునూ… మన తెలుగు దర్శకులు, ప్రేక్షకుల టేస్ట్… మరీ పులుపెక్కిపోతున్నారా..? ఎస్, ఇలాాంటి సినిమాలు, సీన్లే మాకు కావాలంటూ ఎగబడుతున్నారా..? పైగా ఇద్దరూ టాప్ హీరోలే… మొదట అఖండలోని ఈ సీన్ చూడండి… (ఓ మిత్రుడి ఫేస్ బుక్ లింక్…)
Ads
హీరోయిన్ ఒక జిల్లా కలెక్టర్… హీరోను తీసుకుపోయి కల్లు తాపించి, నాలుక తెరువు అంటూ తొక్కు నాకిస్తుంది… (తప్పడం లేదు, నా భాష కూడా అదుపు తప్పుతోంది… ఈ నాకుడు భాషకు క్షమించండి)… అసలు రాయలసీమ వాళ్లకు తొక్కు అంటే తెలియనట్టుగా ఓ కలరింగ్… అట్ల నాకొద్దు, ఇట్ల నాకాలి అని హీరోయిన్ చూపిస్తుంది… ఆమె ఓ కలెక్టర్ అట, అదీ ఆ పాత్ర కేరక్టరైజేషన్ దరిద్రం… బాలయ్య ఆ అని నోరంతా తెరిచి నాలుక తాటిమట్టలా బయటికి చాపుతాడు… హీరోయిన్ తొక్కు రాసి పరవశించిపోతుంది… ఆహా, ఏం టేస్టు బ్రదర్, బోయపాటీ… నీ జన్మ ధన్యం… పక్క నుంచి చమ్మక్ చంద్ర అంటుంటాడు… ఏం నాకుతున్నారు బాబూ, నాకండి, బాగా నాకండి, అమ్మగారు బాగా నాకిస్తున్నారు అని వెక్కిరింపుగా పంచ్ వేస్తుంటాడు… టెకీలా తాగినప్పుడు అరచేతి మట్ట మీద ఉప్పు, నిమ్మకాయ వేసుకుని నాకుతారు కదా… తొక్కును కూడా అలా పెట్టి నాకిస్తుంది ఆమె… ఆ సినిమా దరిద్రాన్ని అక్కడే వదిలేసి, ఈ మరో వీడియో చూడండి…
https://www.youtube.com/watch?v=7yhPtrH9ueA
హిందీలో ఉందా..? పర్లేదు… సీన్ గుర్తుంది కదా… ఓ కూలీ బడా స్మగ్లర్‌గా ఎదిగిన మెగా సక్సెస్ స్టోరీ… హీరో కేరక్టరైజేషన్ అది… అసలే సుకుమారుడు దర్శకుడు… ఆ టేస్ట్ అలాగే ఉంటుంది… అందులో హీరోయిన్ పాత్ర మరీ దరిద్రం… డబ్బు తీసుకుని హీరో వైపు చూడాలి, ఇంకా డబ్బిస్తానంటే ముద్దు పెట్టుకోవడానికి వస్తుంది… నోట్లో యాలక్కాయ వేసుకుని, నోరు తెరుచుకుని హీరో రెడీగా ఉంటాడు… దా దా, కమాన్, నోట్లో నోరు పెట్టు అన్నట్టుగా త్వరపెడుతూ ఉంటాడు… ఆహా, సుకుమారా, నీ సినిమాలో హీరోయిన్ పాత్ర రేంజ్, లెవల్, స్థాయి ఇదన్నమాట… ఇదేకాదు, హీరో పులుపు చూపించడానికి మరో సీన్, హీరో హీరోయిన్ ఛాతీ మీద చెయ్యేస్తాడు… ఏయ్, ఎక్కడేశావ్ చెయ్యి అనే డవిలాగు కూడా పెట్టారు… అంటే పొరపాటున ‘ఆ సీన్ గొప్పతనం’ ప్రేక్షకుడికి ఎక్కడ అర్థం గాకుండా పోతుందేమోనని ఈ విఖ్యాత ఘన దర్శకుడికి డౌటు అన్నమాట… ఇక సామీ పాటలో హీరోయిన్ డ్రెస్సింగ్, గెంతులు, ఊపులు, ఊ, ఊహూ అంటూ సమంత విసిరిన ఊపులు సరేసరి…
మనం జస్ట్, రెండు సినిమాల్లోని రెండు సీన్లను ఉదాహరణగా తీసుకున్నాం… అంటే ఎంతటి ఘనమైన బ్లడ్డు, బ్రీడు ఉన్నాసరే, మన కమర్షియల్, పాపులర్, బడా హీరోలకు ఇలాంటి వెగటు సీన్ల సపోర్ట్ తప్పనిసరి అన్నమాట… అవి లేకపోతే సినిమాలకు సక్సెస్ లేదన్నమాట… వీటికితోడు బీభత్సమైన హింస, నెత్తురు… ఐతే నరుకుడు భాష లేదంటే నాకుడు భాష… అదీ మన రేంజ్… కొంతలోకొంత నయం… శ్యాంసింగరాయ్ సినిమాలో దేవదాసి పాత్ర ఉన్నా సరే, సినిమా కథనం, భాష ఎక్కడా అదుపు తప్పి, వెగటు కాలువలోకి జారిపోలేదు… (ఒక్కచోట మాత్రం లిప్ లాకులు, మీదపడి, నాని రెచ్చిపోయిన సీన్ కాస్త ఎబ్బెట్టుగా ఉంది… నాని సినిమాకు ఇవి అవసరమా..?) సేమ్, లవ్ స్టోరీ సినిమా కూడా… ఆ రెండు సినిమాలు కూడా విజయవంతమైనవే… కానీ ఆ దర్శకులు ఎక్కడా తమను తాము మూసీలోకి పారేసుకోలేదు… ఆస్కార్ అవార్డులు కాదు గానీ… మన తెలుగువాళ్లకు అంతర్జాతీయ అవార్డులు రావాలంటే… మనవాళ్లే పూనుకుని, అవార్డుల్ని ప్రవేశపెట్టాలి… అఖండల్ని, పుష్పాల్ని ఇంకా ఎంకరేజ్ చేసేలా ఇతోధికంగా, ఉదారంగా బోలెడన్ని అవార్డులు ఇవ్వాలి… అదొక్కటే ఆస్కారం… ఈ స్టోరీ ఇక ఇక్కడ ఆపేద్దాం, లేకపోతే పులుపు భాష, నాకుడు భాష ముంచెత్తే ప్రమాదముంది..!!
Share this Article