ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్ సినిమాలు దేశవ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లను రాబట్టడంతో… హిందీ ఇండస్ట్రీ నెగెటివ్‌గా స్పందిస్తుందని, పైకి ఎంత సంయమనం పాటిస్తున్నట్టు కనిపిస్తున్నా సరే, ఎప్పుడో ఓచోట ఆ అసహనం బట్టబయలు అవుతుందని అనుకుంటున్నదే… బాలీవుడ్ కోటలు కూలిపోతున్నట్టు ఫీలయిపోతున్నారు… ఇప్పుడు అజయ్ దేవగణ్ బయటపడ్డాడు… లోలోపల చాలామంది హిందీ హీరోలు, ఇండస్ట్రీ ముఖ్యులకు రగులుతూనే ఉంది…
కన్నడ నటుడు సుదీప్‌కూ, అజయ్ దేవగణ్‌కూ నడుమ జరుగుతున్న పంచాయితీ కేవలం సినిమాలు, వాటి భాష గురించి మాత్రమే… పైగా బుర్రలు మోకాళ్లలోకి జారిపోయిన వ్యాఖ్యలు అవన్నీ… వాటి మధ్యకు రాజకీయ నాయకులు దూరడం మరీ మూర్ఖత్వం… నిజానికి సుదీప్ చేసిన వ్యాఖ్య తన బుద్దిహీనత… ‘‘మా సినిమాలు పాన్ ఇండియా… ఇక హిందీ జాతీయ భాష కాదు…’’ అట..! ఒక సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి జాతీయ భాషకూ సంబంధం ఏమిటి..?
సరే, తను ఏదో అన్నాడు, అజయ్ దేవగణ్‌కు ఏం పుట్టింది..? (బయట ఇంటర్వ్యూలలో కాస్త తెలివి ఉన్నట్టే కనిపిస్తాడు మరి)… హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాల్ని హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు అని కౌంటర్ వేశాడు… హిందీ జాతీయ భాష కాబట్టి డబ్ చేయడం లేదయ్యా హీరో, మార్కెట్ కోసం… డబ్బు కోసం చేస్తారు… ఇక్కడ ఎవరి భాషను ఎవడు ఉద్దరిస్తున్నాడనే లెక్కల్లేవు… అన్నీ కరెన్సీ లెక్కలే…
Ads
చాలారోజులైంది ఈ సిద్ధరామయ్యలు, ఈ కుమారస్వాములు న్యూస్ తెర మీద కనిపించక… దొరికింది చాన్స్ అనుకుని వచ్చేశారు… అజయ్ దేవగణ్‌తో బీజేపీయే ఇవన్నీ మాట్లాడింపజేస్తోంది అనే ఇంకాస్త మూర్ఖత్వపు వాదనలకు దిగారు… మేమేదో వెనుకబడిపోతున్నాం అనుకుని బీజేపీ సీఎం బొమ్మై కూడా అజయ్ వ్యాఖ్యల్ని తప్పుపట్టాడు… అసలు ఏమిటిదంతా..?
ఎవరో ఇద్దరు నటులు సినిమాలు, వాటి భాషలు, మార్కెట్ల మీద ఏవో పిచ్చి వ్యాఖ్యలు చేసుకుంటే, నాయకులు ఎందుకు ఇన్వాల్వ్ కావాలి..? హిందీని రుద్దేంత సీన్ అజయ్‌కు లేదు, అడ్డుకునే తెలివి, ఆలోచన సుదీప్‌కు లేవు… పైగా బాలీవుడ్ కోటపైకి దండెత్తడం కన్నడ సినిమాకు ఇదే తొలిసారి… అసలు కన్నడ సినిమా రేంజ్ ఏమిటో సుదీప్‌కు తెలియదా..? నిజానికి బాహుబలి రెండు భాగాలు, పుష్ప, ట్రిపుల్ ఆర్… ఇలా తెలుగు ఇండస్ట్రీయే బాలీవుడ్‌కు మింగుడుపడకుండా మారింది… కేజీఎఫ్ వదిలేస్తే కన్నడ సినిమాకు ఇంకా అంత పెద్ద సీన్ రాలేదు…
అజయ్‌కు మాతృభాషకు, జాతీయ భాషకు నడుమ తేడా కూడా తెలియదు… బాబూ… హిందీని ఇన్ని దశాబ్దాలుగా ఇతర ప్రాంతాలపై రుద్దడానికి ఈ సోకాల్డ్ నార్త్ ఇండియన్ అధికార లాబీలు నిర్బంధంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి తప్ప… హిందీని ఓ జాతీయ భాషగా ద్రవిడ ప్రాంతాలు అంగీకరించలేదు…
ఇంత పెద్ద దేశంలో హిందీని నిజంగా మాతృభాషగా కలిగిన ప్రాంతాల విస్తీర్ణం ఎంతో పైన చార్టులో చూడండి… సౌత్ ఇండియన్ భాషల్ని పక్కన పెట్టినా… ఇంకా దేశంలో మరాఠీ, పంజాబీ, రాజస్థానీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా, ఉర్దూ తదితర భాషలు మాట్లాడేవాళ్లు ఎక్కువే… అంత పెద్ద యూపీలో చాలామంది మాతృభాష భోజ్‌పురి, మైథిలి… మరి ఏం చూసుకుని హిందీ భాషను దేశం మొత్తమ్మీద రుద్దడానికి ప్రయత్నం..? జాతీయ భాషగా దాని అర్హత ఏమిటి..? ఈ ప్రశ్నలు సహజంగానే వస్తుంటాయి… సో, అన్ని భాషల్లాగే హిందీ కూడా ఓ భాష… దానిపై ద్వేషమూ అక్కర్లేదు… దాన్ని రుద్దించుకోబడటమూ అక్కర్లేదు… పైగా సినిమావాళ్లేదో మిడిమిడిజ్ఞానంతో తన్నుకుంటుంటే మధ్యలోకి పార్టీలు దూరడం దేనికి ఇప్పుడు..?!
Share this Article