.
Ganesh Thota వాల్ మీద కనిపించిన ఓ స్టోరీ నిజానికి చదువుతుంటే మొదట నమ్మబుద్ధి కాలేదు… ముందుగా మీరు ఆ కథ చదవండి…
ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్… మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ తాలూకు టేకన్‌పూర్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అకాడమీలోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అది పూర్తయ్యాక అక్కడ పెద్ద ఎత్తున విందు, రకరకాల ఏర్పాట్లూ చేశారు.
Ads
ఆయన మాత్రం అక్కడ భోజనం చేయడానికి ఇష్టపడలేదు. ఓ ఇల్లాలిని కలిసి మాట్లాడాలనుకున్నారు. ఆమె చేతి వంట రుచి చూడాలని ఆశపడ్డారు. ఇంతకీ ఎవరామె.. ఏమిటామె ప్రత్యేకత? తెలుసుకోవాలంటే చదవాల్సిందే!
ఇంద్రాక్షి త్రిపాఠి… ఆమెకు అలా పరిచయం చేసుకోవడం ఇష్టముండదు. అసిస్టెంట్ కమాండెంట్ సందీప్ మిశ్రా భార్య అని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. కారణం సందీప్ మిశ్రా దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వీరుడు.
భారత సరిహద్దు భద్రతా విధుల్లో హోరాహోరీ పోరాడి చూపు కోల్పోయారు. అయితేనేం దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తికి సేవ చేస్తే మాతృదేశానికి సేవ చేసినట్టు అనుకుంది ఇంద్రాక్షి. పెద్దలు కాదన్నా.. బలవంతంగా ఒప్పించి అతని జీవితంలోకి వచ్చింది.
ఆమె కళ్లతో భర్తకు లోకాన్ని చూపిస్తూ… ఆనందంగా వైవాహిక జీవితంలో సాగిపోతోంది. ఒక పాపకు తల్లిగా, సందీప్ సంరక్షకురాలిగా నిత్యం కాచుకునే ఇంద్రాక్షి గొప్ప మనసు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ సెల్యూట్ కొట్టకుండా ఉండరు.
అందుకే కేంద్ర హోం మంత్రి కూడా టేకన్‌పూర్‌లో పని చేస్తున్న సందీప్ మిశ్రా అర్థాంగి గురించి తెలుసుకున్నాక వెంటనే ఆమెకు అభినందనలు చెప్పాలనుకున్నారు. వారింటికి వెళ్లి కోరి ఆతిథ్యం అందుకున్నారు. మరికొన్ని వివరాల్లోకి వెళ్దాం…
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఉన్న బన్సీ అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిందామె. తండ్రి ఆ ప్రాంతంలో పేరున్న న్యాయవాది. సంపన్న కుటుంబం. పైగా తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. బీఏ, ఆ తరవాత పీజీ పూర్తి చేసింది. తైక్వాండో ఛాంపియన్ కూడా. ఉపాధ్యాయ వృత్తి మీదున్న గౌరవంతో బన్సీలోనే ఓ ప్రయివేటు పాఠశాలలో 2001లో హిందీ టీచర్‌గా చేరింది.
ఇంద్రాక్షికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. రకరకాల వివాహ పరిచయ వేదికల ద్వారా తల్లిదండ్రులు తగిన వరుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. అప్పటి వరకూ ఇంద్రాక్షికి పెళ్లి గురించి ఆలోచనలు లేవు. అయితే 2004లో వివాహ ఓ పరిచయ వేదిక ద్వారా సందీప్ మిశ్రా సంబంధం గురించి తెలిసింది. అతని గురించి చదివి ఆశ్చర్యపోయింది.
వెంటనే సందీప్‌కి ఫోన్ చేసి వివరాలు అడిగింది ఇంద్రాక్షి. మధ్యప్రదేశ్‌కి చెందిన సందీప్ మిశ్రా 1999లో బీఎస్‌ఎఫ్‌లో చేరారు. మొదటి పోస్టింగ్ బిహార్, ఆ తరవాత వివిధ చోట్ల పనిచేసి 2000 సంవత్సరంలో అసిస్టెంట్ కమాండెంట్‌గా అసోంలోని టిన్సుకియా జిల్లాకు బదిలీ అయ్యారు.
అక్కడ ఉన్నప్పుడు ఉల్ఫా తీవ్రవాదుల దాడి జరిగింది. అందులోనే హోరాహోరీ పోరాడిన సందీప్ శరీరంలో ఐదు బులెట్లు దిగాయి. ఎడమ కంట్లోకి ఒక బులెట్ దూసుకుపోవడంతో చూపు పూర్తిగా కోల్పోయారు. ముక్కు ఎముక విరిగింది. మిగతా శరీర భాగాలకూ తీవ్ర గాయాలయ్యాయి.
^^^^^^
పలు శస్త్రచికిత్సలు చేసిన ఆరు నెలల తరవాత ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. అతనిది సాధారణ మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు సందీప్ పెళ్లి, భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందేవారు. తామున్నంత కాలం కొడుకుని చూసుకుంటారు. ఆ తరవాత అతని బాధ్యతలు ఎవరు చూస్తారంటూ తల్లి చాలా బాధపడేది. అందుకే పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.
మరోవైపు సందీప్ కూడా బాధపడుతూ ఇంట్లోనే కూర్చోదల్చుకోలేదు. తనకి జీవితాన్నీ, మంచి పేరునీ తీసుకొచ్చిన బీఎస్‌ఎఫ్‌లోనే ఏదో ఒక విభాగంలో పని చేయాలనుకున్నారు. అందుకే తల్లిదండ్రులు వద్దన్నా… దిల్లీ వెళ్లి చూపులేని వారికి ఉపయోగపడే కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నారు…
ఏడాదిన్నర విరామం అనంతరం సందీప్‌కు టేకన్‌పూర్ బీఎస్‌ఎఫ్ అకాడమీలోని కంప్యూటర్ సెంటర్‌లో పనిచేసే అవకాశం వచ్చింది. అంతేనా అతని సేవలకు భారత ప్రభుత్వం శౌర్య పురస్కారాన్నిచ్చి మరీ గౌరవించింది. ఇదంతా తెలుసుకున్నాక ఇంద్రాక్షి అతడినే పెళ్లాడాలనుకుంది. అతని అమ్మానాన్నల బాధ్యత తాను తీసుకోవాలనుకుంది.
చివరకు తల్లిదండ్రులకు అదే విషయం చెప్పింది. కానీ వారు వద్దంటే వద్దన్నారు. ‘చూపులేని వ్యక్తి నిన్నేం చూసుకుంటాడు’ అని అడిగారు. దానికి ఇంద్రాక్షి ‘దేశాన్ని ప్రేమించే వ్యక్తి తల్లినీ, కట్టుకున్న భార్యనీ అంత కంటే గొప్పగా ప్రేమిస్తాడు. దేశ రక్షణలో భాగంగా చూపు కోల్పోయిన అతనికి నేను చూపుగా మారతాను. నేనే సేవ చేస్తాను’ అంటూ సమాధానమిచ్చింది.
అంతేకాదు అతన్ని తప్ప ఇంకెవర్నీ పెళ్లిచేసుకోను అని తెగేసింది. దాంతో కొన్నాళ్లకి తల్లిదండ్రులు మనసు మార్చుకున్నారు. ఇంద్రాక్షి మనసును అర్థం చేసుకున్నారు. సందీప్ మిశ్రాను సంప్రదించి .. అతని పెద్దవాళ్లతో మాట్లాడి 2004లో ఘనంగా వారి పెళ్లి చేశారు.
ఇదంతా తెలిసిన బీఎస్‌ఎఫ్ టేకన్‌పూర్ అధికారులు ఇంద్రాక్షికి అక్కడే ఉన్న సెకండరీ స్కూల్‌లో హిందీ పండిట్‌గా ఉద్యోగమిచ్చారు. పదమూడేళ్ల నుంచీ ఈ జంట ఆ అకాడమీలోనే ఎవరి విభాగాల్లో వాళ్లు పనిచేస్తున్నారు. వీరికో పాప.
సందీప్ మిశ్రాను, కుటుంబాన్ని చూసుకుంటూ ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో పాపను పెంచి పెద్ద చేస్తోంది ఆమె. తండ్రి గొప్పదనం వివరిస్తూ అతడినే రోల్‌మోడల్‌గా చూపిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది. మరోవైపు వయసు మీద పడిన అతని తల్లిదండ్రులకు తానే కొడుకై సేవలు చేస్తోంది. ఎన్ని సమస్యలు వచ్చినా కుటుంబాన్ని కాచుకుంటూ… భర్త చేయి వదలకుండా ముందుకెళుతున్న ఇంద్రాక్షి గురించి విన్నారు రాజ్‌నాథ్ సింగ్.
అందుకే వెంటనే వారింటికి వెళ్లి అడిగి మరీ ఆతిథ్యం అందుకున్నారు. భోజనం చేసి.. కుటుంబ సభ్యులందరి యోగ క్షేమాలు తెలుసుకుని వారితో కాసేపు సరదాగా గడిపారు. వైకల్యం ఉందని తెలిసి కోరి సందీప్ మిశ్రా జీవితంలోకి వచ్చినందుకు ఇంద్రాక్షిని అభినందించారు. ఆ జంట పదికాలాల పాటు చల్లగా ఉండాలని దీవించి మరీ వెళ్లారట….
నిజానికి కాస్త సెర్చితే తెలిసింది… ఇది 2017లో జరిగింది… మొదట్లో నమ్మలేదు, ఎందుకంటే… అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిల్ని కోరుకుంటున్నారో చూస్తున్నాం కదా… ఉన్నత విద్యావంతురాలు, అందమైంది, ధనిక కుటుంబం, తైక్వాండో చాంపియన్… తాను ఏరి కోరి ఓ ఉగ్రవాద బాధితుడిని, అదీ చూపులేని వాడిని ఏరికోరి పెళ్లి చేసుకోవడం ఏమిటా అనేదే సందేహం…
ఇంకాస్త సెర్చితే ఈ కథ నిజమేనని టైమ్స్, దైనిక్ భాస్కర్ కథనాలు చెప్పాయి… ఫోటోలు, వీడియోలు కూడా కనిపించాయి… అంతేనా… గత ఫిబ్రవరిలో ఏదో వీళ్లదే ప్రోగ్రాం గురించి హిందుస్థాన్ టైమ్స్‌లో ఓ వార్త, ఫోటో కనిపించాయి… మొత్తానికి భలే ఇంట్రస్టింగ్ స్టోరీ ఆమెది..!!
Share this Article