నిన్నటి నుంచీ ఓ వార్తను బాగా సర్క్యులేషన్‌లోకి తీసుకొస్తున్నారు… అదేమిటయ్యా అంటే..? రోజా భర్త సెల్వమణి నిన్న చెన్నైలో ఏదో వ్యాఖ్య చేశాడు… ‘‘తమిళ హీరోలు చెన్నై గాకుండా వైజాగ్, హైదరాబాద్ కేంద్రాల్లో సినిమాలు తీస్తున్నారు, షూటింగులు చేస్తున్నారు, ఇది సరికాదు, అలా చేస్తే చెన్నైలో సినిమా పనుల మీద ఆధారపడి బతికే వేల కుటుంబాలు ఏమైపోవాలి..? అజిత్‌కు కూడా చెప్పాం, సరే, ఇకపై చెన్నైలోనే చేస్తానని అంగీకరించాడు…’’ అంటూ ఏదేదో చెబుతూ పోయాడు…
ఆయన కోణంలో ఆయనకు అది తప్పనిసరి… ఎందుకంటే… ఆయన ఫిలిమ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా సంస్థకు అధ్యక్షుడు… ఓహ్, సౌత్ ఇండియా మొత్తానికి అధ్యక్షుడా అనడక్కండి… కొన్ని సంఘాలు అంతే… పైగా ఆల్ ఎంప్లాయీస్… ఆయన తన కార్మికుల పక్షాన, వాళ్ల ఉపాధి కోరుతూ ఆ డిమాండ్ చేశాడు, దాన్ని తప్పుపట్టలేం, ఆ సంఘం అధ్యక్ష పదవి ప్రకారం అలాగే మాట్లాడాలి…
ఆయన భార్య, ఏపీ మంత్రి రోజా దీనిపై స్పందించాల్సిందే అని నిన్నటి నుంచీ సోషల్ మీడియాలో ఒకటే గోల… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? భార్య ఒకవైపు, భర్త ఒకవైపు… భర్త వైజాగులో షూటింగులు చేయవద్దంటే రోజా సమర్థిస్తుందా..? ఖండిస్తుందా అనేది వార్తాంశం… నిజానికి దీంతో రోజాకు సంబంధం లేదు… ఆమె కేవలం సాంస్కృతిక, పర్యాటక, యువజన శాఖ… అసలు జగన్ మంత్రులకే పెద్దగా బాధ్యతలు ఏమీ ఉండవు… పైగా ఈ శాఖలకు అంత పెద్ద ప్రయారిటీ కూడా లేదు… ఈ సినిమాటోగ్రఫీ ఆమె పరిధిలోకి రాదు…
Ads
అయితేనేం..? కేటీయార్ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చింది కదా, అన్ని అంశాల్లోనూ వేలు పెట్టి ఏదో మాట్లాడుతుంది కదా, మరి దీనిపైనా స్పందించాలి కదా అనేది మరో ప్రశ్న… కావచ్చు… కానీ ఏపీలో సినిమాటోగ్రఫీకి ఓ మంత్రి ఉన్నాడు… చెల్లుబోయిన వేణు… అదేనండీ, జగన్‌ను ఆరాధించండి, వరాలు పొందండి అనే నినాద సృష్టికర్త… ఆమధ్య వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకరిల్లి జగన్ కుటుంబం పట్ల అపరిమిత విధేయతను ప్రకటించుకున్నాడు కదా… ఆయనే… సారు గారేమంటారో వేచిచూడాలి… తెలంగాణ, హైదరాబాద్ సంబంధించి తలసాని మాట్లాడాలి…
అయితే ఇక్కడ కొన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలున్నాయి… సెల్వమణి తమిళ సినిమాల్ని మాత్రం చెన్నైలో తీయండి, ఇక్కడ ఇన్ని వసతులు, మ్యాన్ పవర్ ఉండగా హైదరాబాద్, వైజాగ్ వెళ్లడం దేనికి అనడుగుతున్నాడు… తప్పుపట్టలేం… తను బేసిక్‌గా తమిళుడు… ఆ ఇండస్ట్రీకి చెందినవాడు… తను అలాగే ఆలోచిస్తాడు… తెలుగు సినిమాల్ని వైజాగులో తీసుకుంటానంటే అభ్యంతరపెట్టడు కదా…
ఇవన్నీ వదిలేస్తే… రాను రాను అసలు పాన్ ఇండియా సినిమాల్ని కూడా ఎంప్లాయీస్ సంఘాలు వ్యతిరేకిస్తాయేమో… ఆల్‌రెడీ ఓటీటీలో నేరుగా విడుదలను థియేటర్ల సంఘాలు వ్యతిరేకిస్తున్నట్టుగా…. పాన్ ఇండియా సినిమా అంటే ఏదో భాషలో తీసి, ఇతర భాషల్లోకి డబ్ చేసి వదలడం… ఇది పరోక్షంగా ఆయా ప్రాంతాల వృత్తినిపుణులు, కార్మికుల పొట్టగొట్టడమే అనీ, అవసరమైతే ఆయా రాష్ట్రాల్లో, ఆయా భాషల్లో రీమేకులు చేసుకోవాలే తప్ప పాన్ ఇండియా పేరిట డబ్బింగ్ సినిమాల్ని రుద్దితే సహింబోం అని కొత్త డిమాండ్లు వచ్చాయనుకొండి…. ఆశ్చర్యపోవద్దు…!!
Share this Article