‘‘శశికళ అస్త్రసన్యాసం’’……. దాదాపు అన్ని పత్రికలు, టీవీలు ఇదే హెడింగుతో వార్తలు రాసుకున్నయ్… జైలుకు వెళ్లేముందు తన సహచరి సమాధి మీద అరచేత్తో చరుస్తూ… ప్రతీకారం తీర్చుకుంటాను అని శపథం చేసిన శశికళ కీలకమైన ఎన్నికల సమయంలో అస్త్రసన్యాసం చేయడం ఏమిటి..? చేయించబడింది… !! ఆమె చేతిలోని విల్లును, బాణాల్ని స్వాధీనం చేసుకుని విరిచిపారేశారు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆమెను యుద్ధరంగం నుంచి తరిమేశారు… ఎవరు..? ఇంకెవరు బీజేపీ…! నిజానికి తమిళనాడుకు సంబంధించి బీజేపీ వ్యూహాలు, ఆలోచనలన్నీ ఎంత ప్రమాదకరంగా కనిపిస్తున్నాయో, అంతే గందరగోళంగా కూడా ఉన్నయ్… తమిళనాట దానికేమీ బలం లేదు, కానీ అక్షరాలా ఆ రాజకీయాల్ని శాసిస్తోంది ఇప్పుడు… బీజేపీ వద్దు అంటే ఓ సూపర్ స్టార్ అన్నీ మూసుకుని రాజకీయాలకు దూరం అయిపోయాడు… అదీ అస్త్రసన్యాసమే… అసలు యుద్ధరంగానికే రాకుండా చేయడం… ఇప్పుడు శశికళ… ఇవన్నీ కూలిపోతున్న అన్నాడీఎంకేను నిలబెట్టే ప్రయత్నాలు.., తను చెప్పినట్టు నడిచే ఆ పార్టీ కోసం ఆ పార్టీకన్నా తనే ఎక్కువ కష్టపడుతోంది… అదీ విచిత్రం, విశేషం…
జయలలిత చనిపోయాక ఏర్పడిన శూన్యంలోకి తను ప్రవేశించాలని అనుకుంది బీజేపీ… దానికి ప్రధాన అడ్డంకి శశికళ… ఆమె అలాగే ఉంటే అన్నాడీఎంకే ఆమె చెప్పుచేతల్లోనే ఉండేది… వేల కోట్ల డబ్బుంది, ఆమె పరివారం మన్నార్ గుడి మాఫియాలాగా ఎదిగింది… జయలలిత ఆస్తులకు బినామీ ప్లస్ ఆమె సంపాదించుకున్న సొంత ఆస్తులు… ఆమె దూరమైతే తప్ప తమిళ రాజకీయాలపై బీజేపీ పట్టు చిక్కదు… సీఎం కానివ్వలేదు… జైలుకు వెళ్లింది… ముందస్తుగా విడుదలయ్యే అవకాశాలున్నా సరే, కాలేదు… ఇవన్నీ ఆమెను నిర్దాక్షిణ్యంగా కట్ చేసిన సంకేతాలే… అంతేకాదు, సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు, ఆస్తుల స్వాధీనాలు… కాళ్లూకీళ్లూ సాఫ్ చేశారు… అంతకుముందు జయలలిత ఆర్థిక సామ్రాజ్యంలోని కీలక వ్యక్తుల్ని కూడా దూరం చేశారు… భర్త చనిపోయాడు… జయలలిత ఆస్తులు ఎవరి పాలయ్యాయో తెలియదు… యుద్ధం మొదలయ్యే సమయానికి బరిలోకి వచ్చిన ఆమెకు చుట్టూ ఇదీ వాస్తవ పరిస్థితి…!! ఒకప్పుడు ఆమె పాదసేవకు పరితపించిన నాయకులందరూ దూరమయ్యారు… వాళ్లో వీళ్లో దేనికి సాక్షాత్తూ ఇదే ముఖ్యమంత్రి భక్తితత్పరత ఈ వీడియోలో చూడండి…
Ads
రాజకీయాలు అంతే… ఎప్పుడైతే శశికళ బలహీనపడిందో అందరూ దూరమయ్యారు… ఆమె ఉంటున్న జైలుకు వెళ్లి పలకరించినవాడు కూడా లేడు… ఆమె బయటికొచ్చింది… అప్పటికే తన మేనల్లుడు దినకరన్ ఎఎంఎంకే పార్టీ పెట్టాడు… మధురై ప్రాంతంలో థేవర్ సామాజికవర్గానికి బలం ఎక్కువ… ఆమె కొంత ప్రభావం చూపగలదు, అది అన్నాడీఎంకేకు నష్టం… డీఎంకే కూటమికి ప్రయోజనం… అందుకే ఆమెతో కలిసి పనిచేయాలని బీజేపీ చెప్పింది… కానీ పళనిస్వామి వినలేదు… ఒకసారి శశికళ అన్నాడీఎంకే క్యాంపులో అడుగుపెడితే ఇక ఆమె హైజాక్ చేయగలదు… అందుకే ససేమిరా అన్నాడు… ఇక మిగిలింది ఏమిటి..? ‘‘మళ్లీ జైలుకెళ్తావా..?’’ ఒకటే ప్రశ్న… ఆమె ఆస్తులు చక్కబెట్టుకొని, కాలూచేయీ కూడదీసుకోవాలంటే బీజేపీ చెప్పినట్టు వినక తప్పదు… సో, ధనుస్సు, బాణాలు, కత్తులు కింద పడేసింది… ‘‘నువ్వెలాగూ పోటీకి అనర్హురాలివి… అందుకని నువ్వు త్యాగ తలైవి అయిపోవాలి… అన్నాడీఎంకే గెలిస్తే నీకూ క్రెడిట్, లేదంటే అప్పుడు నేనే దిక్కు అంటూ పార్టీలోకి ఎంటర్ కావచ్చు…’’ ఈ మాటలతో ఆమె యుద్ధరంగం నుంచి నిష్క్రమించింది… అంతా సరే, మరి కమల్‌హాసన్ మీద ఈ ఎత్తులు, జిత్తులు ఎందుకు ప్రయోగించలేదు బీజేపీ..? సింపుల్… తను యాంటీ హిందూ, తను స్థానిక ఎన్నికల్లోనే ఏ ప్రభావమూ చూపలేకపోయాడు, ఇప్పుడు నాలుగు వోట్లు సంపాదించినా సరే అవి డీఎంకే కూటమి వోట్లను చీల్చేవే… సో, వదిలేయబడ్డాడు… ఆస్తిక రజినీ పార్టీ అన్నాడీఎంకే పార్టీకే నష్టం… అందుకని కాషాయం కట్టని సూపర్ స్టార్‌ను అసలు రాకుండానే చేశారు… మరి ఈ మొత్తం వ్యవహారంలో తను ఆశించేది ఏమిటి..? పొత్తులో భాగంగా 23 నుంచి 25 సీట్లు… తనకు బీ-టీంగా వ్యవహరించగల అన్నాడీఎంకే అధికారంలోకి రావడం… కాంగ్రెస్ ప్లస్ డీఎంకే కూటమిని ఓడించడం… కానీ అంత వీజీ కాదు…! ప్రస్తుతానికి బీజేపీ రాజకీయం ఏమీ ఫలించే సూచనలయితే కనిపించడం లేదు..!!
Share this Article