.
రేవంత్ రెడ్డి మాటతప్పాడు… సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తరువాత… నో ప్రిరిలీజ్ ఈవెంట్స్, నో బెనిఫిట్ షోస్, నో టికెట్ ప్రైస్ హైక్ అన్నాడు… కొన్నాళ్లకూ యూటర్న్… తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని రోహిణ్ రెడ్డి అండ్ దిల్ రాజు బ్యాచ్ విజయవంతంగా బ్రేక్ చేసేసింది… ఫాఫం, సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డికి ఏమీ తెలియదు…
నాకు తెలియకుండా మా ఆఫీసు వాళ్లేవో ఇచ్చినట్టున్నారు టికెట్ ప్రైస్ హైక్ జీవోలు, ఇక నా దగ్గరకు రాకండి, నథింగ్ డూయింగ్ అన్నాడు మొన్న… చూద్దాం… ఎందుకంటే..? కోర్టుకు చేరింది ఈ విషయం… రాష్ట్ర ప్రభుత్వం తన విధానమేమిటో ఏం చెబుతుందో చూడాల్సి ఉంది…
Ads
ఇంతకుముందే కోర్టు అడ్డగోలు రేట్లను వ్యతిరేకించిన సంగతి తెలిసిందే కదా… ఇప్పుడు మళ్లీ ఎందుకు చర్చనీయాంశం అంటే… దాదాపు 1500 కోట్ల విలువైన దాదాపు ఏడు పందెం కోళ్లు సంక్రాంతి బరిలో పోటీపడబోతున్నాయి… అందులో భారీ సినిమాలు రాజా సాబ్, శంకర వరప్రసాద్… రాజా సాబ్ పాన్ ఇండియా స్టార్ కానీ శంకర వరప్రసాద్‌కు కేవలం తెలుగు రాష్ట్రాల మీదే ఆధారం…
రాజాసాబ్ విడుదల జనవరి 9… తరువాత 3 రోజులకు శంకర వరప్రసాద్ రిలీజ్… మరుసటిరోజు రవితేజ సినిమా భర్తమహాశయులకు విజ్ఙప్తి… తరువాత రోజు నవీన్ పొలిశెట్టి సినిమా అనగనగా ఒకరాజు … ఆ మరుసటి రోజు శర్వానంద్ సినిమా నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజ్… వీరిలో నవీన్ పొలిశెట్టి, శర్వానంద్‌కు చాన్నాళ్లుగా సినిమాల్లేవు… వాళ్లకు ఓ హిట్ కావాలి… రవితేజ కథ డిఫరెంటు…
ఇవిగాకుండా…
-
జన నాయకుడు: దళపతి విజయ్ నటించిన ఈ సినిమా (తమిళంలో Jana Nayagan) జనవరి 9న తెలుగులో కూడా భారీగా విడుదల కానుంది… విజయ్ రాజకీయ రంగప్రవేశం ముందు వస్తున్న చివరి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి…
-
పరాశక్తి: శివకార్తికేయన్ నటించిన ఈ పీరియడ్ డ్రామా జనవరి 10న విడుదలవుతోంది…
వీటిలో రాజాసాబ్ బడ్జెట్ చాలా ఎక్కువ… ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా భారీ పెట్టుబడి పెట్టారు… చిరంజీవి సినిమాకు కూడా దాదాపు 200 కోట్లు పెట్టారట… నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ లాభాల్లోకి రావాలంటే (Break Even), ఈ సినిమాలు కలిపి బాక్సాఫీస్ వద్ద కనీసం రూ. 1500 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి…
సంక్రాంతి పోటీ ఈ రేంజులో గతంలో ఎప్పుడూ లేదు… కట్ చేస్తే… రాజా సాబ్, శంకర వరప్రసాద్ నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు… టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు … టికెట్ ధరలు పెంచకుండా గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేశారు… టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు కోసం ఆల్రెడీ హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేశారు… అత్యవసర పిటీషన్ కింద విచారణకు స్వీకరించాలని కోరిన న్యాయవాదులు… ఈరోజు విచారించనున్న హైకోర్టు…

మళ్లీ కీలక ప్రశ్న… సినిమా అంటేనే ఓ వ్యాపారం… హీరోలకు వందల కోట్లను (ప్రధానంగా బాగుపడేది హీరోలే) ప్రజల జేబుల్లో నుంచి ఖర్చుపెట్టించాలా…? చిత్ర నిర్మాణ వ్యయానికి పరిమితులు ఏమిటి..? అసలు ఆడిటింగ్ జరుగుతోందా..? నిర్మాణ వ్యయం అడ్డగోలుగా పెరిగితే ప్రేక్షకుడు బాధ్యుడా..? ఈ బెనిఫిట్ షోల అడ్డగోలు రేట్లు మాటేమిటి..? ఇన్ని ప్రశ్నలున్నాయి…
శంకర వరప్రసాద్ హీరోకు ఏపీ ప్రభుత్వంతో సంబంధం ఉంది… తన తమ్ముడి పార్టీ అక్కడ అధికారంలో ఉంది, సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఆ పార్టీ వద్దే ఉంది… కానీ ఇది ఇప్పుడు తెలంగాణ ఇష్యూ, ఎందుకంటే? ఇక్కడ కోర్టులో ఉంది ఇష్యూ..! పనిలోపనిగా సింగిల్ థియేటర్ రేట్లు, మల్టీప్లెక్సుల రేట్ల తేడా మీద కూడా కోర్టు దృష్టి సారించి, తన విచారణ పరిధిని మరింతగా విస్తరించి…. క్యాంటీన్ రేట్లకూ వర్తింపజేస్తే బాగుణ్ను..!! టికెట్ రేట్ల వేలం వెర్రి పాటలపై కూడా..!!
Share this Article