తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ప్రచారంతో రాజకీయాలు కాస్త హీటెక్కాయి… మొత్తం వోటర్ల సంఖ్యే పది లక్షలు… కానీ రాజధాని సహా ఆరు జిల్లాల్లో పాలిటిక్స్ కాక పెరుగుతోంది… మీడియాలో, సోషల్ మీడియాలో వాగ్వాదాలు, అభియోగాలు, ఆరోపణలు, దాడులు, ఎదురుదాడులు జోరుగా సాగుతున్నాయి… మరో రెండు వారాలు ఇదే పోకడ తప్పదు… ‘‘పట్టభద్రుల సమస్యలు తీర్చాలంటే మాకే మీ వోటు… ఉద్యోగుల కష్టాలను గట్టెక్కించాలంటే మా అభ్యర్థే గెలవాలి… పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగుల ఇక్కట్లపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే మా నాయకుడే కరెక్టు… అసలు విద్యారంగం సమూలంగా మారిపోవాలంటే మావోడే కరెక్టు…’’ ఇలా సాగుతున్నయ్ ప్రచారాలు… నిజమేనా..? కొత్తగా ఎమ్మెల్సీలు అయ్యేవాళ్లకు అంత సీన్ ఉంటుందా..? అసలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలే నిమిత్తమాత్రులుగా మిగిలిపోతున్నవేళ… విద్యారంగాన్ని ఒక ఎమ్మెల్సీ ఏం చేయగలడు..?
రాజకీయాలు కదా… ఏవేవో ప్రచారాలు సాగిపోతూ ఉంటయ్… అంతే… అసలు ఒక విద్యావేత్తకూ ఒక విద్యావ్యాపారికీ తేడా కూడా పట్టించుకోరు… సపోజ్, అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఇద్దరు గెలిచారు అనుకుందాం… ఏమవుతుంది..? ఏమీ కాదు… పీవీ బిడ్డకు ఓ రాజకీయ పదవి వస్తుంది… పల్లా రాజేశ్వరరెడ్డికి ఓ పోస్ట్ ఓ పొజిషన్ వస్తుంది… విద్యారంగం, ఉద్యోగరంగం నిర్ణయాలకు సంబంధించి వాళ్ల పోస్టులు ఏమీ ఉపయోగపడవు… అవి పాలసీ నిర్ణయాలు, ముఖ్యమంత్రి ఆలోచనల్లో నుంచే పుట్టుకురావల్సినవే తప్ప ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏ పాత్రా ఉండదు… అసలు మంత్రులకే అంత సీనుండదు… కాకపోతే రెండు ఎమ్మెల్సీలు గెలిస్తే, దుబ్బాక, గ్రేటర్ పరాభవాల నుంచి టీఆర్ఎస్ పార్టీకి పెద్ద రిలీఫ్… ఈమధ్య దూకుడు మీద ఉన్న బీజేపికి పెద్ద సెట్ బ్యాక్ అవుతుంది…
Ads
ఇప్పుడున్న స్థితిలో కాంగ్రెస్‌కు గెలిచినా ఓడినా పెద్ద ఫరక్ పడకపోవచ్చు… అ రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే పార్టీలు, అభ్యర్థులు చెమటోడ్చాలి… అంతే తప్ప ఒక ఎమ్మెల్సీ గెలిచి మండలిలో బోలెడు సమస్యల్ని ఏకరువు పెట్టినా, ఎంత మాట్లాడినా… అసలు కవర్ చేసే మీడియా కూడా లేదు… మీడియాకు అసెంబ్లీ కవరేజీ తప్ప కౌన్సిల్ కవరేజీ బొత్తిగా ఇంట్రస్టు ఉండదు… మండలి తీర్మానాలను శాసనసభ, ప్రభుత్వం పట్టించుకోవాలనీ లేదు… సో, ఎవరో గెలుస్తారు, ఎవరి సమస్యలో తీరతాయి అనేది ఓ భ్రమ… పోనీ, ఈ రెండు ఎమ్మెల్సీలతో ఏమైనా మండలిలో రాజకీయ సమీకరణాలు, బలాబలాలు మారిపోతాయా..? అదీ లేదు…! కాకపోతే… ఈ రెండు ఎమ్మెల్సీలూ గనుక టీఆర్ఎస్ ఓడిపోతే… కేసీయార్ విద్యా, ఉద్యోగ విధానాలకు ప్రజల తిరస్కృతిగా భావించాలి… ఉద్యోగుల్లో, నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో అసంతృప్తి సంకేతాలుగా భావించాలి… ఒకవేళ రెండూ బీజేపీ గనుక గెలిస్తే ప్రజలు ప్రత్యామ్నాయం పట్ల సీరియస్‌గానే ఆలోచిస్తున్నారని లెక్క… అందుకే కేసీయారే పూనుకుని రెండు ఎమ్మెల్సీల గెలుపు మీద దృష్టి సారించాడు…!! కానీ ఈరోజుకైతే అధికార పార్టీ అభ్యర్థులు ఇద్దరూ ముందంజలో ఏమీ లేరు… కాకపోతే ఇకపై పుంజుకోవద్దని ఏమీ లేదు…!!
Share this Article