.
మీడియాలో కూడా కవరైంది, సోషల్ మీడియాలో వైరలైంది… ముందు సంక్షిప్తంగా… ఓ తెలుగమ్మాయి, హైదరాబాద్, జేఎన్‌టీయూలో ఆర్కిటెక్చర్ చదివి, న్యూయార్క్‌లో ఎంఎస్ చేయడానికి వెళ్లింది… పేరు భవిత మండవ…
ఓ సబ్ వే ప్లాట్‌ఫారమ్ మీద ఉన్నప్పుడు… 2024 చివరలో… Bottega Veneta (బొట్టెగా వెనెటా) క్రియేటివ్ డైరెక్టర్, ఫ్యాషన్ డిజైనర్ మాథ్యూ బ్లేజీ (Matthieu Blazy) కంట్లో పడింది… లేదా ఆయన తరఫున ఒక ప్రతినిధి (టాలెంట్ స్కౌట్) ఆమెను చూశాడు… ఆమె అప్పుడు జస్ట్, ఓ స్వెట్టర్, జీన్స్ వేసుకుని ఉంది… ఆమెలో ఏదో ఆకర్షణ…
Ads
ఆమెకు మంచి మోడలింగ్ ఆఫర్ ఇచ్చారు, మొదట నిరాకరించింది… ఇదేదో మోసం అనుకుంది… పైగా ఆమె గోల్ అది కాదు, ఆ కెరీర్ మీద తనకు ఐడియా కూడా లేదు… ఏమాత్రం అనుభవం లేదు… కానీ ఒప్పించారు… సర్లె, చూద్దాం అనుకుంది… రెండు వారాల వ్యవధిలోనే, భవిత Bottega Veneta (బొట్టెగా వెనెటా) Spring/Summer 2025 షోలో పాల్గొని, అసాధారణమైన అరంగేట్రం చేసింది… రెండే వారాల్లో ఆమెను ఓ మోడల్‌గా తీర్చిదిద్దారు… ఆమె అలా రూపుదిద్దుకుంది…
తరువాత అంతర్జాతీయ గుర్తింపు…. Dior, Courrèges వంటి పలు అంతర్జాతీయ అగ్రశ్రేణి బ్రాండ్ల షోలలో నడిచింది… ఆమె ఛానెల్ (Chanel) ప్రతిష్టాత్మకమైన మెటీయర్స్ డి’ఆర్ట్ 2026 (Métiers d’Art 2026) షోను ప్రారంభించిన (Open చేసిన) మొదటి భారతీయ మోడల్‌గా నిలిచింది… ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం…
దీని విశేషం ఏమిటంటే..? ఈ ఛానెల్ షోను న్యూయార్క్ సిటీలోని బోవరీ స్టేషన్ (Bowery Station) అనే డీకమిషన్ చేయబడిన సబ్‌వే ప్లాట్‌ఫారమ్‌లో ఏర్పాటు చేశారు… ఎక్కడైతే ఆమెలోని మోడల్ కనిపెట్టబడిందో… తిరిగి అక్కడే ఓ విశేషమైన షో… ఒక పొయెటిక్ ఫుల్ సర్కిల్ మూమెంట్… ఆ షోలో ఆమె దుస్తులు కూడా దాదాపు ఆమె మాథ్యూ కళ్లల్లో పడినప్పటివే దాదాపు… సింపుల్…
ఛానెల్ షో జరిగిన తర్వాత, భవిత తన తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని తమ ఇంట్లో టీవీలో ఆమె రన్‌వే వాక్‌ను చూస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది…
ఆ వీడియోలో, ఆమె తల్లి ఆనందంతో కన్నీరు పెట్టుకుంటూ, పదే పదే తన కూతురి పేరును ఉచ్ఛరించడం, తండ్రి గర్వంగా చూడటం కనిపించింది.. ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులను చేరుకుని, ఆమె కథనాన్ని కేవలం ఫ్యాషన్ వార్తగా కాకుండా, కుటుంబ విజయం, గర్వంగా మార్చింది…

భవిత మండవ కథ ఒక సాదాసీదా ఆర్కిటెక్చర్ విద్యార్థిని, అనుకోకుండా, ఏదో ఒక క్షణం ఆమె బతుకును మార్చేసి… అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలో అత్యున్నత స్థానానికి చేరిన అద్భుతమైన ప్రయాణం… ఇది యువతకు కలలు కనడానికి, వాటిని సాధించడానికి ప్రేరణనిచ్చే ఒక కథ…
అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచపు విశ్లేషకుల అనాలిసిస్ కూడా ఆసక్తికరంగా ఉంది… ఇలా…
-
సహజత్వం (Natural Look)…: ఆమె మోడల్‌గా ఎంపిక కావడానికి ప్రధాన కారణం, ఫ్యాషన్ ప్రపంచం కోరుకునే అతి సన్నని, పాశ్చాత్య రూపం కాదు… ఆమె సహజమైన చర్మం రంగు, మొటిమల మచ్చలు (Marks), సహజమైన జుట్టును అలాగే ఉంచడం…
-
ప్రభావం…: అంతర్జాతీయ బ్రాండ్లు, పాత ఫ్యాషన్ పద్ధతులను పక్కన పెట్టి, నిజమైన, సహజమైన అందాన్ని అంగీకరిస్తున్నాయనడానికి భవిత ఒక ప్రత్యక్ష ఉదాహరణ… ఇది భారతీయ లేదా దక్షిణాసియా నేపథ్యం నుండి వచ్చిన యువతకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది…
మోడలింగ్‌కు ముందు ఆర్కిటెక్చర్ చదవడం, మాస్టర్స్‌లో డిజైన్ నేర్చుకోవడం ఆమె కెరీర్‌కు పరోక్షంగా సహాయపడింది… ఎలాగంటే..? పోజ్ (Posing) & స్పేస్ (Space)… ఆర్కిటెక్చర్‌లో, స్పేస్‌ను, ఫామ్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం… రన్‌వేపై నడుస్తున్నప్పుడు లేదా ఫొటోలకు పోజు ఇస్తున్నప్పుడు, ఆమె తన శరీరాన్ని ఒక రూపం (Form)గా ఎలా ఉపయోగించాలి, లేదా దుస్తులను స్పేస్‌లో ఎలా ప్రెజెంట్ చేయాలనే అవగాహన ఉండటం వల్ల, ఆమె ప్రెజెంటేషన్ ఇతరుల కంటే భిన్నంగా, ప్రభావవంతంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు….
- న్యూయార్క్ నగరంలో సబ్‌వే అనేది జీవితంలో భాగం… సబ్‌వేలో సాధారణ వ్యక్తి అసాధారణంగా మారడం అనే కాన్సెప్ట్ న్యూయార్క్ మీడియా, ప్రజలలో ఆమెకు ఒక “కల్చరల్ ఐకాన్” స్టేటస్‌ను తెచ్చిపెట్టింది…

ఫ్యాషన్ ప్రపంచంలో మారుతున్న ట్రెండ్స్… అసలు కథ…
1. వైవిధ్యానికి (Diversity) పెరుగుతున్న ప్రాధాన్యత…. గత దశాబ్ద కాలంగా, ఫ్యాషన్ పరిశ్రమలోని ‘తక్కువ వైవిధ్యం’ (Lack of Diversity)పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి… ఈ ఒత్తిడి కారణంగా, అగ్రశ్రేణి బ్రాండ్లు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా వివిధ చర్మ రంగులు, జాతులు, శరీర ఆకృతుల మోడళ్లను తమ షోలలో ప్రదర్శిస్తున్నాయి… వైవిధ్యం కోసం…
- ఆసియా ప్రాధాన్యత…: ఫ్యాషన్ మార్కెట్‌లో ఆసియా (ముఖ్యంగా చైనా, కొరియా, ఇండియా) కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది… ఈ మార్కెట్‌ను ఆకర్షించడానికి, బ్రాండ్లు ఆసియా మోడళ్లకు, ముఖ్యంగా దక్షిణాసియా (South Asian) మోడళ్లకు అవకాశం ఇస్తున్నాయి… ఇదీ అసలు స్టోరీ…
2. ‘సహజత్వం’ (Authenticity) అనే కొత్త ఫ్యాషన్…. ఆమె స్టన్నింగ్ బ్యూటీ ఏమీ కాదు… ఆమె గొప్ప సౌందర్య ప్రమాణాలకు (కన్వెన్షనల్ బ్యూటీ స్టాండర్డ్స్) సరిపోకపోవచ్చు… కాకపోతే ఇప్పుడు అదే ఆమె బలంగా మారింది...
ఇంకా చెప్పాలంటే… సంపూర్ణ సౌందర్యం ఇప్పుడు ఫ్యాషన్ కాదు… సహజత్వం, ఏదో విభిన్నత కావాలి… రకరకాల రసాయనాలతో మెరుగు పెట్టిన, అనగా తోమిన అందం కాదు… అనగా తయారు చేయబడిన అందం కాదు…
-
ఛానెల్ వంటి సాంప్రదాయ, అత్యున్నత బ్రాండ్, ఒక భారతీయ మోడల్‌కు ఈ గౌరవం ఇవ్వడం అనేది పాశ్చాత్య ఫ్యాషన్ ప్రపంచంలో ఒక మార్పును సూచిస్తుంది... ఇది కేవలం ఆమెకు ఇచ్చిన అవకాశం కాదు, ఫ్యాషన్ ప్రపంచం మారుతోందని ప్రకటించే ప్రయత్నం...
Share this Article