Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ కోట్ల ప్రజాధనానికి సార్థకత ఏమున్నట్టు..? పైగా అందులోనూ వివక్ష..!!

June 2, 2023 by M S R

ఒక ప్రభుత్వం పత్రికలకు తన గొప్పతనాన్ని తనే పొగుడుకుంటూ ఎందుకు యాడ్స్ ఇవ్వాలి..? దాంతో ప్రజలకు ఒరిగేదేమిటి..? వాటికి ప్రజాధనం ఎందుకు ఖర్చు చేయాలి..? ఇవన్నీ బేసిక్ ప్రశ్నలు… మన పాలకుల నుంచి సమాధానం ఆశించలేం కాబట్టి… ఆ ప్రశ్నలను పక్కన పెట్టేయండి… ఒకప్పుడు సీఎం ఇమేజీ కోసం దేశంలోని అనేక భాషల్లో, అనేక ప్రాంతాల్లో పత్రికలకు కూడా వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర అవతరణ సందర్భంగా ఈరోజు ఇచ్చిన యాడ్స్ పెద్దగా బాధించవు…

ఐతే… ఒకేరోజు ఏకంగా పదేసి పేజీల యాడ్స్ కుమ్మేయడం మాత్రం ఖచ్చితంగా రికార్డే… గతంలో ఏ పాలకుడికీ చేతకాని ఔదార్యం ఇది… నిజంగా రాష్ట్ర అవతరణ సందర్భాన్ని చిన్నాచితకా పత్రికలు, వాట్సపులో ఎడిషన్లు కనిపించే పత్రికలు సైతం పండుగ చేసుకున్నాయి… ఈరోజు వాటికి కేసీయార్ ఓ కుబేరుడి అవతారంగా కనిపిస్తున్నాడు… సరే, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచడానికి ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి ప్రత్యేక ప్రకటనలు ఇవ్వడం పరిపాటే కదా అనే ఓ జవాబును అధికార పక్షం నుంచి ఊహిద్దాం కనీసం…

పత్రికలు ఈ ప్రభుత్వ విశిష్టతను, గొప్ప పనులను సరిగ్గా రాయడం లేదు కాబట్టి… ప్రజలందరికీ ఈ వివరాలు తెలియాలి కాబట్టి… (ఇక్కడ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు అనే బేసిక్ సోయి కలిగి ఉండాలి) ఇలా వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారు అనుకుందాం కాసేపు… ఆ ప్రకటనల్లో డప్పు తప్ప మరేమీ ఉండదని అందరికీ తెలుసు… ఐనా సరే, రాష్ట్ర అవతరణను సెలబ్రేట్ చేసుకుంటూనే, గత తొమ్మిదేళ్లలో ఏం చేశారో ప్రజలకు చెప్పుకోవడం ఈ యాడ్స్ ఉద్దేశం అనీ సమాధానపడదాం కాసేపు…

Ads

i&pr

అయితే మరి… యాడ్స్ ఉద్దేశం ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాల్ని ప్రజలకు చెప్పడమే అయితే… సూర్య, ప్రజాపక్షం, ఆంధ్రప్రభ, నవతెలంగాణ, మనతెలంగాణ వంటి చిన్న పత్రికలకు సైతం యాడ్స్ ఇచ్చి, కోట్లాది మందికి మన విజయాల్ని చెప్పుకున్నాం అనేదే నిజమైతే… మరి ఆంధ్రజ్యోతి, వెలుగు ఏం పాపం చేశాయి… వాటిల్లో యాడ్స్ ఎందుకు రాలేదు..? ఇది హుందాతనం లేని కుంటి వివక్ష…

పెద్ద పత్రికలయితే ఏకంగా 11 పేజీల యాడ్స్… పత్రిక యాడ్స్ అడుక్కున్న తీరును బట్టి పత్రికలకు యాడ్స్ పేజీల సంఖ్య దక్కింది… ఇక్కడ ప్రధానమైన ప్రశ్న… ఈ యాడ్స్ ప్రభుత్వ విజయాల్ని ప్రజలకు చెప్పడమా..? పత్రికల్ని పోషించడమా..? ఒక పత్రికకు 11 పేజీలు ఇచ్చి, మరో పత్రికకు అయిదు పేజీలు ఇస్తే… ప్రభుత్వ విజయాలపై ఆ కొన్ని పత్రికల పాఠకులకు అసంపూర్ణ సమాచారాన్ని ఇచ్చినట్టే కదా… అందులో సమంజసం ఏమున్నట్టు..?

టీవీల్లో ప్రకటనల గురించి, ఇంగ్లిషు పత్రికల్లో ప్రకటనల గురించి గాకుండా… కేవలం తెలుగు పత్రికల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ… మనకు ప్రొఫెషనల్‌గా తస్మదీయుడు అయిపోయాడు కాబట్టి ఆంధ్రజ్యోతికి కట్… పొలిటికల్‌గా బద్ధవిరోధి బీజేపీ నాయకుడి పేపర్ కాబట్టి వెలుగుకు యాడ్స్ కట్… ప్రభుత్వం, పార్టీ రాగద్వేషాలను బట్టి ఈ వివక్ష ఏమిటి..? యాడ్స్ ప్రయోజనం ప్రభుత్వ విజయాల ప్రచారం అయినప్పుడు… వెచ్చిస్తున్న కోట్ల ప్రజాధనం ఉద్దేశం ప్రచారమే అయినప్పుడు… నీ పట్ల సానుకూలత, ప్రతికూలతల్ని లెక్కేసి యాడ్స్ ఇవ్వాలా..? అదేం ప్రాతిపదిక..?

ఈనాడు కార్డ్ రేటుకన్నా చాలా చాలా తక్కువకు ఫుల్ పేజీ యాడ్స్ సేకరిస్తోంది… మరి ఇన్ని పేజీల యాడ్స్ వరదను ఏ రేటుకు ఇచ్చినట్టు..? నమస్తే తెలంగాణ రేంజ్ ఎలా లెక్కకట్టారు..? దానికి ఈనాడు స్థాయిలో యాడ్స్ ఎలా ఇచ్చినట్టు..? దాని సర్క్యులేషన్, టారిఫ్ లెక్కల్లో బాగోతం ఏమిటి..? ఇవన్నీ తవ్వితే అదొక బాగోతం… సాక్షి ఇప్పుడు ‘నమస్తే సాక్షి’ కాబట్టి దానికి కూడా భారీగానే యాడ్స్ ఇచ్చారు అనుకుందాం… కానీ ఆంధ్రజ్యోతి తక్కువేమీ కాదుగా… ఏబీసీ సర్క్యులేషన్ ఫిగర్స్‌ను బట్టి తెలంగాణలో మూడో స్థానంలో ఉంది… ఐనా యాడ్స్‌కు ఎందుకు నోచుకోలేదు..? నమస్తే తెలంగాణకు గానీ, ప్రభుత్వ యాడ్స్ పొందిన ఇతరత్రా చిన్నాచితకా పత్రికలకు గానీ అసలు ఏబీసీ ధ్రువీకరణలే లేవుగా… మరి సర్క్యులేషన్ లెక్కల్ని ఎవరు రూపొందించారు..? ఆ లెక్కలకున్న విశ్వసనీయత ఎంత..? వాటి ఆధారంగా యాడ్స్ ఇవ్వడం ఏమిటి..?

అన్నింటికీ మించి ఇన్ని కోట్ల ఖర్చుతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు… పత్రికల్ని పోషించడమూ ప్రభుత్వ బాధ్యత కాదు… అందులోనూ కొన్ని పత్రికలపై వివక్షను ప్రదర్శించి, కొందరిపై ప్రేమగా భారీ యాడ్స్ ఇవ్వడం ఏరకంగానూ సమర్థనీయం కాదు…!!

aj

మిగతా పత్రికలన్నీ కేసీయార్ ప్రభుత్వ ఘనకీర్తిని చాటిచెబుతుంటే… ఆంధ్రజ్యోతి మాత్రం దశాబ్ది దారెటు..? అంటూ రాష్ట్ర అవతరణ నేపథ్యం, ప్రస్తుత పరిస్థితినీ బేరీజు వేస్తూ ప్రత్యేక కథనాలు ప్రచురిస్తోంది… అదీ ఎక్కువ ప్రాధాన్యతతో… ఈ నెగెటివ్ కథనాలను చూసి యాడ్స్ ఆపేశారా..? లేక యాడ్స్ ఇవ్వడం లేదు కాబట్టి కోపంతో ఈ వరుస కథనాలు స్టార్టయ్యాయా..? చిక్కు ప్రశ్న… ఆశించిన తెలంగాణ ఏమిటి..? వర్తమాన తెలంగాణ ఏమిటనే సవివర వ్యాసాలు ‘వెలుగు’కు ఎందుకు చేతకాలేదు..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions