నిజంగా మోడీ ప్రభుత్వం దేశం పేరు మార్చడానికి నిర్ణయం తీసుకున్నదా లేదా తెలియదు… జస్ట్, ఓ ఆహ్వానపత్రికలో భారత్ అని ప్రస్తావించారు… నిజానికి ఇదేమీ తొలిసారి కాదు, భారత్ అనే పేరు వాడటానికి అడ్డంకులు కూడా ఏమీలేవు… దీనికి రాజ్యాంగ సవరణలు, కొత్త చట్టాలు గట్రా ఏమీ అక్కర్లేదు… రాజ్యాంగం మొదట్లోనే ఇండియా, భారత్ అని రెండు పేర్లూ ఉన్నయ్… ఏది వాడుకున్నా ఏ చిక్కులూ లేవు… ఏ సందర్భంలో ఏ పేరు వాడుకోవాలనేది మన ఇష్టం…
కరెన్సీ నోట్ల మీద, పాస్ పోర్టుల మీద, వోట్ల కార్డుల మీద, అనేకానేక గుర్తింపు కార్డుల మీద మార్పులు అవసరమని కొందరు అప్పుడే చాలాదూరం వెళ్లిపోయారు… ప్రస్తుత పాస్‌పోర్టులు చెల్లబోవని కూడా కొందరు భయపెడుతున్నారు… కొందరైతే డాట్ ఇన్ వంటి సైట్లు మూతపడ్డట్టేనని తేల్చేస్తున్నారు… నిజానికి పాస్‌పోర్టుల మీద ఆల్‌రెడీ భారత్ పేరుంది… ఇండియా, భారత్ ఏది వాడినా, ఏ కాగితంపై ఏది ఉన్నా ఏమీ ఫరక్ పడదు…
ఇక కొందరైతే మెలూహా అనే పాత పేరు దగ్గర నుంచి ఇండియా పేరు దాకా పరిణామ క్రమం, ఆయా పేర్లకు కారణాలతో ప్రత్యేక కథనాలు రాసిపడేస్తున్నారు… అసలు భరతుడనేవాడు మనల్ని పరిపాలించనే లేదనీ, ఇండస్ నది నుంచి ఇండియా పేరు పెట్టబడిందని మరికొందరి కథనాలు… ఇలా కలకలం మాత్రం రేగింది… ఎవరు స్టార్ట్ చేశారో ఈ పేరుమార్పిడి ప్రచారాన్ని… వాళ్లు ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు…
Ads
మోడీ వైఫల్యాల చర్చ జరగుకుండా మోడీ క్యాంపు ఒకటి తరువాత మరొకటి ఇలాంటివి వదులుతుంటారేమో… ఆ ఉచ్చులో ప్రతిపక్షాలు వెంటనే పడిపోతున్నాయి… మొన్నటి దాకా చంద్రయాన్, నిన్న జమిలి, నేడు దేశం పేరు మార్పిడి… ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆ పేరు దేశానికి లేకుండా భారత్ అని మార్చబోతున్నారనీ పలు కథనాలు… యాంటీ మోడీ సెక్షన్లు ఒకటి కౌంటర్ చేసేలోపు మరొకటి తగుల్తోంది…
చంద్రయాన్, జమిలి, పేరు మార్పు… ఈ మూడింటిపైనా ప్రతిపక్షాల కౌంటర్ సహేతుకంగా, నిర్మాణాత్మకంగా, కన్విన్సింగ్‌గా లేదు… ఈ కౌంటర్ల తీరు తమకే మైనస్ అవుతుందనే సోయి కూడా లేదు… దీనికితోడు స్టాలిన్ కొడుకు అనాలోచితంగా చేసిన సనాతన ధర్మ నిర్మూలన వ్యాఖ్యలు కూడా ఇండియా కూటమికి మైనస్ అయిపోయింది… అందుకే మమత, కేజ్రీవాల్ సైతం ఆ వ్యాఖ్యల్ని ఖండించారు… కాంగ్రెస్‌కే ఇంకా ఏ సోయీ లేదు… పుత్ర ప్రేమతో స్టాలిన్ కిక్కుమనడం లేదు… ఎప్పటిలాగే బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ ఎట్సెట్రా తెలుగు పార్టీలు ఇంకా నిద్రలేవలేదు… లేవవు…
వచ్చే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో దేశం పేరు మార్పిడి బిల్లు పెడతారని కొందరి వార్తలు… కానీ అది కరెక్ట్ కాదేమో… ఎందుకంటే… భారత్ అనే పేరు వాడటానికి మన రాజ్యాంగాంలోనే వీలుంది… ఆల్‌రెడీ వాడేస్తున్నాం కూడా… మరిక కొత్తగా రాజ్యాంగసవరణ దేనికి..? కామన్ సివిల్ కోడ్, జమిలి వంటి ఇంపార్టెంట్ అంశాలేమో మోడీ ప్రభుత్వం రహస్యంగా వర్కవుట్ చేసి రెడీగా ఉన్నట్టుంది… చిన్న విషయం కూడా లీక్ కానివ్వడం లేదు మోడీ… ఈలోపు నెటిజనం మాత్రం రెండువర్గాలుగా చీలిపోయి యుద్ధాలు చేసేసుకుంటున్నారు…
ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ప్రత్యేకించి ప్రాణావసర మందుల దగ్గర నుంచి ప్రతిదీ ధర అడ్డగోలుగా పెంచేశారు… మోడీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్… ధరల నియంత్రణ మీద దానికి ఆసక్తి లేదు… సగటు మనిషి జీవన ప్రమాణాల కోణంలో ఇలాంటి అవసరమైన చర్చలు, విశ్లేషణలు లేకుండా మొత్తానికి మోడీ క్యాంపు ప్రజల ఆలోచనల్ని, చర్చల్ని విజయవంతంగా పక్కదోవ పట్టిస్తోంది… మోడీ క్యాంపు వేసే ఉచ్చుల్లో మొత్తం యాంటీ మోడీ సెక్షన్లు అడ్డంగా కూరుకుపోతున్నయ్…
Share this Article