సినిమా, టీవీ ఇండస్ట్రీలో కాళ్లు మొక్కించుకుని ఆత్మానందాన్ని పొందే సంస్కృతి ఇప్పుడు కొత్తేమీ కాదు… ఎప్పటి నుంచో ఉన్నదే… అదొక వింత ఆధిపత్య ప్రదర్శన… పాపులర్ దర్శకులు, హీరోలు తమను తాము దైవాంశ సంభూతులనే భ్రమల్లో బతుకుతూ, తమ ఫ్యాన్స్ కీర్తనలతో తాము ఉన్నతులమని పరమానందం పొందుతూ… ఇండస్ట్రీ జనం నుంచి కూడా ఆ కృత్రిమ గౌరవాన్ని పొందే ప్రయత్నం చేస్తుంటారు… షూటింగుకు వచ్చే సహనటులు, ఇతర క్రియేటివ్ సిబ్బంది నుంచి కూడా ఈ మర్యాదను, మన్ననను ఆశిస్తారు…
పెద్ద హీరోలు, దర్శకుల ప్రాపకం కోసం, కాకా పట్టడం కోసం కనిపించగానే కాళ్లు మొక్కే బ్యాచ్ ఉంటుంది ప్రతిచోటా… వాళ్లతోనే ఈ సమస్య మరింత ఎక్కువ అయిపోతుంటుంది… కాళ్లు మొక్కేవాడు విధేయుడు, మనవాడు… మొక్కనివాడు విరోధి… ఇలా సూత్రీకరించేస్తారు… అసలెందుకు మొక్కాలి..? తల్లి, తండ్రి, గురువు, వయస్సులో పెద్దలైన కుటుంబసభ్యులు, ఆధ్యాత్మిక కర్మలు జరిపించే పురోహితుడు… ఇలాంటి వాళ్లు సరిపోరా..? అసలు కాళ్లు మొక్కడం అనేది గౌరవ ప్రకటనేనా..? సంస్కారం తప్పకుండా ఓ నమస్కారం పెడితే సరిపోదా..? ఇదొక పెద్ద డిబేటబుల్ ప్రశ్న… నిన్న ఓ వీడియో కనిపించింది… అది చూశాకే కాళ్లు మొక్కడం మీద ఇలా పలు ఆలోచనలు, ప్రశ్నలు ముసురుకున్నయ్…
సన్నాఫ్ ఇండియా ఫంక్షన్ కావచ్చు బహుశా… చూశారు కదా పైన వీడియోను, అందులో మోహన్‌బాబు మాటల తీరు… దర్శకుడు తన కాళ్లకు మొక్కడం లేదనే అసహనం వ్యక్తమవుతోంది… దాన్ని నేరుగా చెప్పలేక, ఏదో వెటకారాన్ని దట్టించి, పరోక్షంగా దాన్ని ప్రస్తావించడానికి నానా పాట్లూ పడుతున్నాడు… అవును, ఆ వేదిక మీద ఆ దర్శకుడు తన కాళ్ల మీద పడకపోతే అదేమైనా అమర్యాదా..? అగౌరవమా..? అసలు ఈ కాళ్లు మొక్కించుకునే తత్వం ఏమిటి..? మొక్కకపోతే ఈ మాటలేంటి..?
Ads
ఇలా మాట్లాడటం ఓ దర్శకుడి పట్ల అమర్యాద కాదా..? దర్శకుడు అంటేనే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా…? మరి ఆ హోదాను, ఆ స్థాయిని అవమానించినట్టు కాదా..? మరి ఈ వైఖరిని ఏమనాలి..? నిజానికి మోహన్‌బాబు బయటికి వ్యక్తీకరించాడు గానీ, దాదాపు ప్రతి హీరో అంతే… ప్రతి పెద్ద దర్శకుడూ అంతే… ఆత్మాభిమానం ఉన్న ప్రస్తుత జనరేషన్‌కు ఇదొక నరకం… అహాలు, చాడీలే రాజ్యమేలే ఇండస్ట్రీ కాబట్టి మనసులో ఎంత కోపమున్నా బయటపడరు… హేమిటో… మనం వేగంగా పురోగమిస్తున్నాం అని అనుకుంటాం గానీ… ఇలాంటి జాఢ్యాలు వదిలితే కదా…!!
Share this Article