Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేటీయార్ పూనకాలు లోడింగ్… ఒక్క ట్వీట్‌లోనే బోలెడంత ఫ్రస్ట్రేషన్…

January 26, 2024 by M S R

కేటీయార్ చేసిన ఒక ట్వీట్‌లో ఎన్నో భావాలు… అసలు ఒక ట్వీట్‌లో ఇన్నిరకాల ఉద్వేగాల్ని ప్రదర్శించవచ్చునని సకల నెటిజనం హాశ్చర్యపోయే ట్వీట్ ఇది… కేటీయార్ నిజంగా గ్రేట్…

ఎంత ఖర్చుపెట్టినా, ఎంత మభ్యపెట్టినా జనం ఛీకొట్టి ఒకవైపు అధికారం పోయిన మంట… జైలులో వేసినా, ఎంత తొక్కాలని చూసినా అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న దృశ్యం పదే పదే మదిలో మెదులుతూ ఒకటే దుగ్ధ… తరుముకొస్తున్న కాలేశ్వరం విజిలెన్స్ కేసుతో ఎక్కడ బండారాలన్నీ బట్టబయలవుతాయోనని భయం… 500 కోట్ల రెరా బాలకృష్ణుడు ఏం బయటపెడతాడోనని సందేహం… ధరణి పాపాలన్నీ పుట్ట పగిలినట్టు పగులుతాయేమోనని ఆందోళన…

నిరుద్యోగుల ఆశల్ని కూల్చిన టీఎస్పీఎస్సీ ఘోరాల చిట్టా తెర మీదకు వచ్చి ఆ మాజీ ఐపీఎస్ మహేందర్‌రెడ్డి ఎవరిని ఫిక్స్ చేస్తాడోనని ఫ్రస్ట్రేషన్… ఇంటర్ బోర్డులో గ్లోబరినా అరాచకాలు, కాలిపోయిన విద్యార్థుల బతుకుల కారకులు బయటపడితే ఎలా అనే ప్రశ్నార్థకం… స్మితలు, అరవిందులు సరెండర్ అయిపోతే ఇంకేం బాగోతాలు రట్టవుతాయేమోనని అసహనం…

Ads

నామమాత్రపు ధరకు 1000 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిపై కోర్టులో విచారణపైనే కాదు… ఇరువైపులా బీజేపీ, కాంగ్రెస్ కొరడాలు పట్టుకుని తరుముతుంటే ఇక పార్టీ భవిష్యత్తు ఏమిటనే అనిశ్చితి… సందిగ్ధత… ఇలా చెబుతూ పోతే… ఎన్నో, ఎన్నెన్నో… అన్నింటికీ ఈ రేవంతుడే కారణం అన్నట్టుగా… సహించలేక, ఆగలేక, భరించలేక వ్యక్తిగత దాడి… అక్షరాలా ఇది పూర్ ట్వీట్… చీప్ టేస్ట్…

ktr

కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేలా మాను వినురా సుమతీ అనే పద్యాన్ని, దాని తాత్పర్యాన్ని ఓ ట్వీట్ చేశాడు కేటీయార్… పేరు పెట్టకపోయినా అది రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తుందనేది అందరికీ తెలుసు… దావోస్‌లో రేవంత్ భాషను వెక్కిరిస్తారు… తన ఆహార్యాన్ని వెక్కిరిస్తారు… రేవంత్ ప్రతి అడుగునూ లక్ష్యం చేసుకుంటారు… రెండు నెలలకే ఎందుకింత శివాలు, పూనకాలు, ఊగిపోవడాలు… ఈ ట్వీట్ల వేపమండలు…

పేపర్ల లీకేజీలతో నిరుద్యోగుల కొంపలు కాలిస్తే, మహిళా గవర్నర్‌ను నానారకాలుగా అవమానిస్తే… అదే గవర్నర్ ఎమ్మెల్సీల భర్తీ ఫైల్ కూడా తిప్పికొడితే… ఇదే రేవంత్ వెళ్లి సింపుల్‌గా టీఎస్పీఎస్సీ, ఎమ్మెల్సీల ఫైళ్లను క్లియర్ చేయించుకోవడం చూస్తుంటేనే కేటీయార్‌కు మండిపోతున్నట్టుంది… 420 హామీలు అని ఎంత వెక్కిరించినా, పోయేముందు ఏడు లక్షల అప్పులతో చిప్ప చేతికిచ్చినా ఒక్కొక్క హామీని అమలు చేస్తుంటే ఎక్కడో మాడిపోతున్నట్టుంది…

కాలుతున్న ఆ వాసనే ఇప్పుడు ట్వీట్లలో వ్యాపిస్తోంది… అంత ఫ్రస్ట్రేషన్ అవసరమా..? త్వరలో మన ప్రభుత్వం వస్తుందంటూ ఈ ప్రభుత్వాన్ని కూల్చేసే కొత్త కుట్రల సంకేతాల్ని జనంలోకి వదలడం అవసరమా..? కాంగ్రెస్ ప్రజావ్యతిరేకంగా పరిపాలిస్తే ఇదే జనం తమ తీర్పు చెబుతారుగా రాబోయే ఎన్నికల్లో… కేటీయార్‌కు ఎందుకంత ఉరుకులాట..? పోనీ, ఇదే కాంగ్రెస్ ఇదే ట్వీట్‌కు ఇలా కౌంటర్ చేస్తే..?

‘‘అవును, కేటీయార్, నువ్వు చెప్పింది అక్షరసత్యం… తెలంగాణ రాగానే కనకపు సింహాసనమున ప్రజలు కుర్చీలో కూర్చోబెట్టారు, కానీ వెనుకటి గుణం మానలేదు… ప్రజలు మొన్న ఛీకొట్టి తరిమినా సరే అదే వెనుకటి గుణం…’’ అని తిప్పికొడితే..? అసలే రేవంత్ కొంత డిఫరెంట్… మెత్తమెత్తటి జానారెడ్డి కాదు… ఈంట్‌కా జవాబ్ పత్తర్‌సే దేనేవాలా… సో, కాస్త ఆగండి బ్రదర్… రేవంత్ మార్క్ తవ్వకాలు ఇంకా జన్వాడ గెస్ట్ హౌజ్ దాకా రానేలేదు కదా…!!

వీళ్లే కదా… మోడీని ఎడాపెడా తిడుతూ… ఇప్పుడు ముఖ్యమంత్రిని తిడుతూ… గవర్నర్‌ను అవమానిస్తూ… గతంలో కేసీయార్ మీద పల్లెత్తు మాట మాట్లాడితే మాత్రం, ఒక ముఖ్యమంత్రిని అన్నేసి మాటలనొచ్చా అని సన్నాయి నొక్కులు నొక్కింది…!! హలో సారూ… రేవంత్ శునకం అంటున్నావు సరే, జనం కోరినట్టే కాపలా కుక్కలా ఉంటానన్నది ఎవరు..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions