ఒక సింపుల్ ప్రశ్న మనలో మనమే వేసుకుందాం… ‘‘ఇకపై నేను కాంగ్రెస్ గుంపులో లేనట్టే, త్వరలో పార్టీకి రాజీనామా చేస్తా’’ అంటున్నాడు కదా జగ్గారెడ్డి అనబడే ఓ కాంగ్రెస్ నాయకుడు… తన మీద పార్టీ కోవర్టు ముద్ర వేశారనే బాధతోనే వెళ్లిపోతా అంటున్నాడు కదా… నిజంగానే అంత పెయిన్ ఉంటే వెంటనే రాజీనామాలు ఇచ్చేవాడు కదా… పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేయడానికి ఏమైనా పెద్ద ప్రొసీజర్ ఉంటుందా..? త్వరలో రాజీనామా అంటూ ఈ గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నట్టు..?
ఎందుకంటే..? అదొక వ్యూహం… ఈయన రాజీనామా అనగానే కూడబలుక్కున్నట్టుగా మిగతా యాంటీ- రేవంత్ నాయకులంతా తెరపైకి వస్తారు… పది రోజులు ఆగు అంటాడు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్… నేను ఢిల్లీలో మాట్లాడతా అంటాడు ఇంకొకాయన… పది రోజుల్లో ఏం జరుగుతుంది..? రాహుల్ వెంటనే లైన్‌లోకి వచ్చేసి… ‘‘నేను రేవంత్ పోస్టు పీకేశాను, మీరు పార్టీలోనే ఉండండి ప్లీజ్’’ అంటాడా..? ‘‘రేవంత్ కారణంగా అందరూ వెళ్లిపోయే ప్రమాదం వస్తోంది, ఇటు చూడండి’’ అని సోనియా మీద, రాహుల్ మీద ప్రెజర్ పెంచే ఈ సీనియర్ల ఎత్తుగడ వర్కవుట్ అవుతుందా అసలు..? రాజీనామా అనగానే సీనియర్లు వచ్చి జగ్గారెడ్డిని బుజ్జగించినట్టుగా వార్తలు… తనకు పగ్గాలేసి, పార్టీ వీడిపోకుండా పార్టీని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నంతగా కవరింగులు, కలరింగులు… అవసరమా..?
రేవంత్‌ను వదిలేయండి కాసేపు… తనను చంద్రబాబు కోవర్టు అందాం… అసలు తననే తరిమేస్తే బెటర్ అనుకుందాం… కానీ కనీసం బండి సంజయ్ స్థాయిలోనైనా కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీయార్‌కు లేదా కేటీయార్‌కు నిలబడి గట్టిగా కౌంటర్లు, సమాధానాలు ఇవ్వగల ఒక్క కేరక్టర్ కనిపించడం లేదు కదా… ఈ ఎక్స్ పీసీసీ ఉత్తముడు గత ఏడేళ్లలో పార్టీని ఎంత ఉద్దరించాడో అందరూ చూసిందే కదా… కోమటిరెడ్డి కేసీయార్ ఆహా ఓహో అంటాడు… అలుముకున్నాడు మొన్నొకచోట… ఆయన సోదరుడే బీజేపీవైపు చూస్తుంటాడు… ఇదే జగ్గారెడ్డి, హరీష్ పొట్టుపొట్టు తిట్టుకుంటున్నారు చాలా ఏళ్లుగా… ఇప్పుడు ఇద్దరూ దోస్త్ మేరా దోస్త్ అని పాడుకుంటున్నారు…
Ads
సోనియా, రాహుల్, గాంధీ కుటుంబం మీద జగ్గారెడ్డికి మస్తు గౌరవం ఉందట, జస్ట్, కోవర్టు అనే నిందలతోనే మనస్సు గాయపడిందట…. సో వాట్, గాయపడితే నిన్ను అలా ఎవరు నిందించారో వాళ్ల మీద హైకమాండ్‌కు కంప్లయింట్ పంపించు… పార్టీ మీద అంత ప్రేమ ఉన్నవాడివి, ఎవరో ఏదో అన్నారని నువ్వు మస్తు ప్రేమించే పార్టీని ఎలా వీడిపోతవ్..? పర్ సపోజ్, రేవంతే నిన్ను కోవర్టు అని నిందించాడు అనుకుందాం… పార్టీ ఏమైనా రేవంత్ సొంతమా..? పార్టీలో వర్గ విభేదాలేమైనా కొత్తా..?
పోనీ, ‘‘త్వరలో రాజీనామా’’ అంటూ ఈ గ్యాప్ దేనికి..? రేవంత్ వచ్చి బాబ్బాబు, ప్లీజ్, ఏమైనా ఉంటే చెప్పు, కూర్చుని మాట్లాడుకుందాం అని బతిమిలాడాలా..? ఏదైనా ఒప్పందానికి రావాలా..? పోనీ, అదీ జరగదు అనుకుందాం… ఏం చేయాలి ఇక… జగ్గారెడ్డే చెబుతున్నాడు, సొంత పార్టీ పెట్టుకుంటా, జగ్గారెడ్డి అంటే ఏమిటో చూపిస్తా అని… కాంగ్రెస్ (జె) అని పేరు పెడతారా..? కాదు, కాదు… టీఆర్ఎస్‌లో చేరిపోతడా..? అలా చేరితే అసలు టీఆర్ఎస్‌లో ఇమడగలడా తను..?
రాష్ట్రంలో ఒకవైపు బీజేపీ పుంజుకుంటోంది… కనీసం పుంజుకున్నట్టు కనిపిస్తోంది… దూకుడు మాత్రం పెరిగింది… టీఆర్ఎస్ ప్రభుత్వం మీద క్షేత్ర స్థాయిలో వ్యతిరేకత కూడా కనిపిస్తోంది… ఈ స్థితిలో కాంగ్రెస్ నాయకులు మాత్రం తమలోతాము తన్నుకుంటున్నారు… ‘‘మాకు బీజేపీ వద్దు, మాకు టీఆర్ఎస్ వద్దు, కాస్త మీరు గట్టిగా ఉండండర్రా, వోట్లేస్తాం అని నిజంగానే ప్రజలు రెడీగా ఉన్నా సరే, వీళ్లకు సోయి వచ్చే సీన్ మాత్రం కనిపించడం లేదు… వీళ్లా అంతటి కేసీయార్‌ను ఢీకొట్టేది..? ఏతావాతా చెప్పేదేమిటయ్యా అంటే… ఫాఫం రేవంత్…!! ఈ దళనాయకులతో రేపు కేసీయార్ మీద యుద్ధానికి పోతాడట…!!
Share this Article