బిగ్‌బాస్ షో… 2020… ఏదో పిచ్చి టాస్క్… హౌజులో ఎవరినైతే జీరో అనుకుంటున్నారో వాళ్లను మెడపట్టుకుని, గేటు నుంచి తోసేయాలి… టీవీ9 దేవి కూడా ఆ షోలో కంటెస్టెంట్… తన భాషతో, తన చేష్టలతో కంటెస్టెంట్లను, ప్రేక్షకులను హింసించిన అమ్మ రాజశేఖర్ అనే కంటెస్టెంట్‌ను దేవి నెట్టుకెళ్లి, మెడ పట్టుకుని, గేటు బయటికి నెట్టేసింది… అది ఆట… ఆట అంటే అంతే… సదరు రాజశేఖరుడు అక్కడే పొర్లిపొర్లి ఏడ్చాడు… దేవి సైలెంటుగా, నిర్వికారంగా చూస్తూ నిలబడింది…
విష్వక్సేన్ ఫ- భాష వాడినప్పుడు కూడా ఆమె సింపుల్‌గా గెటవుట్ అని వేలు చూపించింది గేటు వైపు… ఆ సీన్ చూశాక నాటి బిగ్‌బాస్ సీన్ గుర్తొచ్చింది… ఇప్పుడు మళ్లీ ఇదంతా ఎందుకు అంటారా..? సినిమా నటులకు ప్రమోషన్ గ్యాంగ్స్ ఉంటయ్, పెయిడ్ బ్యాచులు ఉంటయ్ కదా… విష్వక్సేన్‌ను ఎహెఫోరా అన్న రీతిలో గెటవుట్ అన్నందుకు దేవికి వ్యతిరేకంగా భీకర ట్రోలింగ్, స్టార్టయింది… ఎక్స్‌పెక్ట్ చేసిందే… కానీ దేవి మాత్రం ఎక్కడా తన చర్యను సమర్థించుకుంటూ గానీ, విష్వక్సేన్‌ను నిందిస్తూ గానీ చిన్న పోస్టు పెట్టలేదు, ఒక్క మాట మాట్లాడలేదు… కానీ సదరు అద్భుత సంస్కారవంతుడైన ‘‘హీరో’’ మాత్రం ఇతర చానెళ్లకు వెళ్తూ రచ్చ రచ్చ చేయడానికి ప్రయత్నించాడు… నొప్పి తగిలినప్పుడు అమ్మా అనే పదం వచ్చినట్టుగానే తనకు ఫ- పదం సహజంగా వచ్చేస్తుందట… ఇక తనను ఏమనాలో అర్థం కాదు…
చాలామంది ఆరోపిస్తున్నట్టుగా… టీవీ9 రేటింగ్స్ పెంచుకునేందుకు ఈ నాటకాన్ని ఆడింది, అందులో దేవి పాత్రధారి అనే వాదన కాసేపు నిజమే అనుకుందాం… కానీ చిన్న ప్రశ్న… ఎంత రేటింగ్ నాటకమైతే మాత్రం, స్టూడియోలో తన ఎదుట కూర్చోబెట్టుకుని, దేవి వంటి టెంపర్మెంట్ ఉన్న లేడీ యాంకర్ ఫ- తిట్లు తిట్టించుకుంటుందా..? ఇతర చానెళ్లు కూడా దొరికింది చాన్స్ అనుకుని, టీవీ9 మీద ద్వేషాన్ని మొత్తం విష్వక్సేనుడి మీద ప్రేమగా వర్షించాయి… వేరే టీవీ స్టూడియోలో జరిగిన (అది ప్రాంక్ అయినా సరే) సిగ్గుమాలిన ఇన్సిడెంటు విషయంలో ఓ మహిళ జర్నలిస్టు పక్షాన గాకుండా… ఈ సంస్కార హీరో పాదాల వద్ద మోకరిల్లాయి…
Ads
ఇక్కడ ఓ రిలీఫ్ దక్కింది… ఇద్దరూ ఒకే కులమట… (దేవి తన కులాన్ని ఎప్పుడూ ఫోకస్ చేసుకున్నట్టు గుర్తులేదు, దాసరి నారాయణరావుకు మనవరాలినని చెప్పుకున్నట్టు కూడా గుర్తులేదు… బిగ్‌బాస్ సందర్భంగానే అది బయటికి వచ్చింది…) పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రెండు వేర్వేరు కులాల వాళ్లయితే ఈ పంచాయితీ ఇంకా ఎటు దారితీసేదో… మీడియా, పార్టీలు, కులసంఘాలు ఇంకా కంపు కంపు చేసేవేమో… (బిగ్‌బాస్ అంటేనే స్క్రిప్టెడ్ దందా… పోటీలు, ఎలిమినేషన్లు, కంట్రాక్టులు, చెల్లింపులు, వోటింగులు అన్నీ ఓ వెగటు యవ్వారమే… బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఆ పేరు వాడుకుని ప్రతి కంటెస్టెంట్ లబ్ధి పొందాలని ట్రై చేసేవాళ్లే, కానీ దేవి మాత్రం ఎలిమినేటయ్యాక ఈరోజుకూ బిగ్‌బాస్ మీద ఒక్కమాట మాట్లాడలేదు, ఆ పేరు వాడుకోలేదు… గుడ్ టెంపర్‌మెంట్…)
నిజానికి దేవి అప్పుడప్పుడూ అర్ధపరిజ్ఞానంతో చేసే వ్యాఖ్యానాలు ఆమెను ఇప్పటికే ప్రేక్షకుల్లో పలుచన చేశాయి… ప్రత్యేకించి రుధిరం కురుస్తోంది, నీటి గురుత్వాకర్షణ ఎట్సెట్రా… మనలోమనమాట, అక్కడ బాస్‌గా ఉన్న రజినీకాంత్‌కే పోస్కోకు, పోక్సోకు… అటాప్సీకి, ఆటోస్పైకి తేడా తెలియదు, పాపం దేవి ఎంత..? అది ఆ చానెల్ నాలెడ్జ్ రేంజ్… నిన్నటి విష్వక్సేన్ ఉదంతం వేరు… ఏ కోణం నుంచి చూసినా విష్వక్సేన్ వైఖరి చీదర పుట్టించేదిగా ఉంది… ఆమె పాగల్‌సేన్ అని వ్యాఖ్యానించడంతోనే విష్వక్సేన్ రెచ్చిపోయాడు అని కొందరి సమర్థన… విజయ్ దేవరకొండ రౌడీ అనే ఇమేజీ కోసం పాకులాడాడు, ఇలాంటి పదాలతోనే… ఇప్పుడు విష్వక్సేన్‌దీ అదే పోకడ… ఐనా ప్రాంక్ వీడియోలతో సినిమా ప్రమోషన్లు చేసుకుంటే పాగల్‌సేన్ అనకుండా మృణాల్‌సేన్ అంటారా..?
ఎస్, పాగల్‌సేన్ అని ఆమె అనడంలో తప్పేముంది..? ఆ పేరుతో ఏకంగా ఓ స్కిట్టే చేశారు ఆ చానెల్ వాళ్లు… ఎహెహె అని నవ్వుతూ, వెటకారం చేస్తూ, ఓ స్వీట్ బాక్సు తీసుకుపోయి, నేరుగా స్టూడియోలోకి వెళ్లి, ఓ డిబేట్ లైవ్‌లో రనవుతుంటే… తను వాడిన భాష ఏమిటసలు..? నీకు టీవీ9 ప్రసారం చేసే డిబేట్ నచ్చకపోతే, నేరుగా స్టూడియోలోకి వెళ్లి ఓ లేడీ జర్నలిస్టుతో ఇలాగేనా మాట్లాడటం..?
పిలిస్తేనే వచ్చాడు, అందుకే రాగానే మైకు పెట్టి కూర్చోబెట్టారు, ఇదంతా టీవీ9 ప్రాంక్, ఎవడైనా గెస్టును గెటవుట్ అంటారా..? వంటి వాదనలన్నీ కాసేపు వదిలేయండి… టీవీ9 అలాంటిదే… రేటింగ్స్ కోసం వేషాలు వేయగలదు, వేస్తుంది కూడా… ఇక్కడ ఇష్యూ అది కాదు… సదరు హీరో భాష, ధోరణి… ఆయన ఫలక్‌నుమాదాస్ సినిమా ప్రమోషన్ సమయం నుంచీ అంతే… నోరిప్పితే ఈ ఫ- వల్గర్ భాషే… ఏం..? ఆకాశం నుంచి ఊడిపడ్డాడా తను..? అంత తోపా..?
తను రోడ్డుపై సినిమా ప్రమోషన్ కోసం చేయించుకున్న ఆ చిల్లర స్థాయి ప్రాంక్ వీడియో తప్పు… పబ్లిక్ న్యూసెన్స్… నాన్సెన్స్… ‘‘నా మీద కోపంతో ప్రాంక్ వీడియోలు చేసేవాళ్లు కడుపులు కొట్టకండి’’ అని ఏదో మహత్తర ఉదార వాదన చూపిస్తున్నాడు… ప్రాంక్ వీడియోలు చేసేవాళ్లు తలతిక్కగా నడిరోడ్డు మీద పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేయరు… చేస్తే శిక్షార్హులే… ‘‘నా ప్లేసులో మరొకరు ఉంటే, ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు బాధ్యులు..?’’ అని మరో పిచ్చిప్రశ్న… నీ వెగటు ధోరణి, భాషకు దేవి ఏమైనా చేసుకుంటే (పాపం శమించుగాక) అప్పుడెవరు బాధ్యులవుతారు..?
పెద్ద హీరోలయితే ఇలాగే చేస్తారా… అనేది కొందరి వాదన… ఎస్, చూడాలి… ఏ పెద్ద హీరో అయినా ఓ టాప్ టీవీ స్టూడియోలోకి నేరుగా వెళ్లి ఈ ధోరణితో వ్యవహరిస్తే, ఇదే భాష వాడితే, అక్కడ మళ్లీ ఇదే దేవి కూర్చుని ఉంటే ఏం జరుగుతుంది అనేది చూడాలి… జరిగితే చూడాలనే ఉంది… హీరోల కాళ్ల మీద పొర్లుదండాలు పెట్టేదే ప్రతి మీడియా సంస్థ… టీవీ9 ఆ సందర్భంలో కూడా అన్నీ మూసుకుని కూర్చుంటే, అదీ చూడాలని ఉంది… అలాగని ఈ హీరో కుసంస్కారాన్ని సమర్థించలేం కదా…!!
ఒక లేడీ జర్నలిస్టుకు అవమానం జరిగింది కదా, సంఘీభావంగా ఉందాం అనే ధోరణే తోటి జర్నలిస్టుల్లో కనిపించలేదు, సరికదా ఇంకాస్త వివాదాన్ని రెచ్చగొడుతూ, కావల్సినంత పెట్రోల్ పోశారు… (యూట్యూబర్లను వదిలేయండి, వాళ్ల పొట్టతిప్పలు వేరు) జర్నలిస్టులు వార్తలు చదువుతారు, రాస్తారు, సేకరిస్తారు… కొన్నిసార్లు వాళ్లే వార్తలు అవుతంటారు… అందుకే ఈ ఎపిసోడ్ మీద ఇంత సుదీర్ఘమైన కథనం… అంతే…! ఆమె ప్లేసులో వేరే యాంకర్ ఉండి ఉంటే, ఏం జరిగేది..? ఏమీ ఉండదు… మనం ఇంతసేపు ఇదంతా మాట్లాడుకునే అవసరమే వచ్చేది కాదు…!!
ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి క్లిప్పింగ్… ఆ పదాన్ని వాడినందుకు సారీ చెబుతున్నాడట… దెబ్బతగిలినప్పుడు అసంకల్పితంగా అమ్మా అనే పదం వచ్చినట్టుగానే తనకు ఆ ఫ- పదం వస్తుందట… అదీ విష్వక్సేన్ స్థాయి… అమ్మా అనే పదానికీ, నీయమ్మా అనే పదానికీ తేడా తెలియదు… పైగా ఏమంటున్నాడు..? ఇకముందు కూడా నా సినిమాలకు ఇలాగే దూకుడుగా ప్రచారం కార్యక్రమాలు చేస్తాను అంటున్నాడు… అర్థమైంది కదా… ఓవర్ టు హైదరాబాద్ పోలీస్…!!
Share this Article