ఎవరు వద్దనుకున్నా, ఎవరు కోపగించుకున్నా, ఎవరు స్వాగతించినా, ఎవరెలా రియాక్టయినా సరే… షర్మిల పార్టీ తెలంగాణలో చర్చనీయాంశం…! ఓ మిత్రుడి ప్రశ్న ఏమిటంటే…? అప్పట్లో జగన్‌కు వ్యతిరేకంగా మానుకోటలో పెద్ద ఎత్తున రాళ్లదాడికి దిగి, తెలంగాణలో తిరిగితే మర్యాద దక్కదు అని తిరగబడిన తెలంగాణవాదులు ఇప్పుడు షర్మిల పార్టీ పట్ల మౌనంగా ఉన్నారేమిటి..? ‘‘ఆమె వీరసమైక్యవాది వైఎస్ బిడ్డ, జగన్ సోదరి, ఆంధ్రా… తెలంగాణ పట్ల పల్లెత్తు మాటను సానుకూలంగా మాట్లాడలేదు సరికదా తెలంగాణ వ్యతిరేక శిబిరం… మరిప్పుడు వేలాది మంది ఆమె రాకను స్వాగతిస్తున్నారు… తెలంగాణ ఉద్వేగం మాటేమిటి…? అసలు ఆమెకు తెలంగాణ రాజకీయాలతో సంబంధం ఏమిటి..? ఈ గడ్డ మీద పిల్లల్ని కన్నాను, చదివించాను, ఇక్కడే బతుకుతున్నాను, బరాబర్ ఈ గడ్డ మీద తిరుగుతా, పార్టీ పెడతా, ప్రశ్నిస్తా అంటున్నది కదా, టీఆర్ఎస్ ఎందుకు కిమ్మనడం లేదు..?’’ ఇదీ ఆ మిత్రుడి ప్రశ్నల సారాంశం… (ఖమ్మం సభలో తెలంగాణలో పుట్టాను, తెలంగాణ కోడలిని అనే మాటలు ఆమె స్పీచులో వినిపించినట్టు లేదు… ఆమధ్య ఎవరో అన్నారు, ఆమె భర్త బ్రదర్ అనిల్ భీమవర పుత్రుడే తప్ప తెలంగాణ పుత్రుడు కాదని…)
సరే.., తత్వాలు, మూలాలు ఏవయితేనేం… టెక్నికల్‌గా తెలంగాణలో బతుకుతున్నవాళ్లంతా తెలంగాణవాళ్లే… పదో తరగతిలోపు వరుసగా నాలుగేళ్లు ఇక్కడ చదివితే లోకల్… పైగా ఆమె ఒక పార్టీ పెట్టడాన్ని, ప్రజాజీవితంలోకి రావడాన్ని ఎవరూ వ్యతిరేకించడానికి వీల్లేదు… చేయగలదా, చేస్తుందా అనేది వదిలేస్తే ఇదే టీఆర్ఎస్ భీమవరం నుంచి ఏపీ బ్రాంచులు ఓపెన్ చేయడం మొదలుపెట్టినా ఎవరూ వ్యతిరేకించలేరు… ఏపీ ప్రజలు ఎలా స్వీకరిస్తారనేది వేరే సంగతి… ఆమె ఆంధ్రాలో రాజకీయాలు చేయకుండా తెలంగాణ మీద పడటం ఏమిటి అనేది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న… దాని వెనుక కొన్ని స్ట్రాటజీలున్నయ్… అవి హస్తినలో రూపుదిద్దుకున్నయ్… జగన్ అంతఃపురంలో ఖరారైనయ్… అవేమిటో రాబోయే రోజుల్లో తెర మీద కనిపిస్తయ్… అవన్నీ కేసీయార్‌కు తెలియవని కాదు… ఐనాసరే, మరి టీఆర్ఎస్ ఎందుకు సైలెంటుగా ఉంది..? అదీ ప్రశ్న…
Ads
ఇంకొన్ని విషయాల్లోకి వెళ్దాం…
- జగన్-మానుకోట విషయానికి వస్తే… ఆ సందర్భం వేరు… తండ్రి మరణించాక, తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని మంకుపట్టు పట్టిన ఈ జగన్‌ను నియంత్రించడానికే ఓ రాజకీయ ప్రణాళికగా కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమాన్ని లేపింది… జగన్ గనుక సైలెంట్ అయిపోయి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని కూడా చల్లార్చేది కాంగ్రెస్… తను మొండిగా కాంగ్రెస్‌ను ధిక్కరించి సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు…
- కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించి, తరువాత ఆంధ్రా లాబీయిస్టులకు తలొగ్గి, వెనక్కి తగ్గడం, తెలంగాణ మొత్తం నెలల తరబడీ ఉద్యమించడం, ఎట్టకేలకు కనీసం తెలంగాణలోనైనా పార్టీని కాపాడుకుందామని కాంగ్రెస్ తెలంగాణను ఏర్పాటు చేయడం ఓ సుదీర్ఘ అధ్యాయం… అఫ్ కోర్స్, కేసీయార్ పార్టీని విలీనం చేసుకోవడాన్ని సరిగ్గా టాకిల్ చేయలేక కాంగ్రెస్ దెబ్బతిన్నది… అది మరో కథ… (ప్రజారాజ్యం పార్టీ విలీనమంత సులభం కాదు టీఆర్ఎస్ పార్టీ విలీనం…)
- ఏతావాతా సారాంశం ఏమిటి..? తెలంగాణ ఏర్పాటు కథలో జగన్ ఓ ప్రధాన పాత్ర… అసలు వైఎస్ గనుక బతికి ఉంటే తెలంగాణ లేదు, విభజనా లేదు… తెలంగాణ ఇవ్వొద్దు అని కాంగ్రెస్ బలంగా డిసైడ్ అయి ఉంటే, ఏ స్థాయి పోరాటాలు చేసినా అది ఇచ్చేది కాదు… అదలా తన్నుకొచ్చింది… అంతే…
- ఆ స్థితిలో తెలంగాణ ఏర్పాటు అంశంలో జగన్ ఓ ప్రభావిత అంశం కాబట్టి తనను తెలంగాణలో తిరగనివ్వలేదు, అడ్డుకున్నారు… కానీ ఇప్పుడు..? ఈ వాతావరణం వేరు… ఏపీ, తెలంగాణ రెండు వేర్వేరు రాష్ట్రాలు… సమైక్యం, వేర్పాటువాదం, ఉద్యమం పదాలు ఇప్పుడు అప్రస్తుతం… తెలంగాణ పోరాటం ఒడిసిన కథ… ఫలం సిద్ధించింది… అంతెందుకు..? కేసీయార్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గ్రహాలు ఒకప్పుడు తెలంగాణ వ్యతిరేకమే కదా… అందరూ కలిసిపోలేదా..? అంతటి తెలంగాణ వ్యతిరేకి జగన్ ఇప్పుడు కేసీయార్ ఆప్తమిత్రుడు కాలేదా..?
- ఈ స్థితిలో షర్మిల ఓ పార్టీ పెట్టుకుంటానంటే వ్యతిరేకించే పనిలేదు… పైగా ఆమె పాడేది ఇప్పుడు సమైక్యగీతం కాదుగా… తెలంగాణ పాటే కదా… (ఈ అడుగుల వెనుక ప్లానేమిటి అనేది వేరే సంగతి)…
- మరో కీలకాంశం ఏమిటంటే..? షర్మిల పార్టీ టీఆర్ఎస్కు నష్టదాయకం కాదని కేసీయార్ అంతర్గత అంచనా… ఎలాగూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక వోటును చీలుస్తాయి… దానికి తోడు షర్మిల పార్టీ వంటివి ఒకటీరెండు చిన్న చిన్న పార్టీలు వస్తే… తన వ్యతిరేక వోటు మరింత చీలుతుంది… సో, తనకు నష్టం లేదు… ఈ చిన్న పార్టీలు తెలంగాణ వ్యాప్తంగా బొచ్చెడు సీట్లు తెచ్చుకుని అధికారంలోకి వచ్చేదీ లేదు… అందుకని కేసీయార్ సైలెంటు… లేకపోతే కోదండరాం, బండి సంజయ్ వంటి నేతలు ఎటు కదిలినా అరెస్టులు చేసి కట్టడి చేసే కేసీయార్ షర్మిల సభకు అనుమతి ఇచ్చేవాడా..? అదీ కరోనా ఉధృతిలో…!!
Share this Article