‘‘ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమాలతోనే ఆరంభం కాదు, వాటితోనే ముగియవు…’’ వాణీజయరాం ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య అది… తనను ఎదగకుండా హిందీ పరిశ్రమలో కొందరు రాజకీయాలు నడిపి, తనంతటతాను ముంబై వదిలి వెళ్లేలా చేశారనే బాధ ఆమెలో ఎప్పుడూ ఉండేది… కానీ కనిపించనిచ్చేది కాదు… అదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… ‘‘ముంబైలో పని తగ్గిపోయింది, ఐతేనేం, ఆ రాజకీయాలు నాకు ఇతర భాషల తలుపులు తెరిచాయి… అనేక భాషల్లో మంచి పాటలు పాడే అవకాశం వచ్చింది…
అనేక రాష్ట్రాల్లో పర్యటనలు చేశాను, పాటలు పాడాను… హిందీ నుంచి తరిమేయబడిన అనుభవాన్ని కూడా ఆమె పాజిటివ్‌గానే తీసుకున్నట్టు చెప్పేది… పెద్దగా ఇంటర్వ్యూలు ఇచ్చేది కాదు, పెద్దగా సినిమా ప్రోగ్రాముల్లో కూడా పాల్గొనేది కాదు… సినిమాల్లో అవకాశాలు తగ్గడం వల్లే భజన గీతాలు ఎక్కువగా పాడటానికి ప్రాధాన్యం ఇచ్చారా అనే ప్రశ్నకు ‘నాన్సెన్స్, నేను 1969 నుంచీ భక్తిగీతాలు పాడుతున్నాను… ఇష్టమైన గీతాలాపన, కానీ బాలీవుడ్‌లోనే ఉండి ఉంటే మంచి మంచి హిట్స్ ఇచ్చేదాన్ని, నో ప్రాబ్లం, నో రిగ్రెట్స్’ అని బదులిచ్చింది… 19 భాషల్లో ఆమె పాటలు పాడింది… హిందీకే పరిమితమై ఉంటే, ఆ క్షుద్ర రాజకీయాల్లోనే నలిగి, అణిగిపోయేది…
‘‘నేను తామరాకు మీద నీటిబొట్టులా ఉంటానని అందరూ అంటారు… నా గురువు వసంత్ దేశయ్ అదే చెప్పాడు… గౌరవంగా బతుకు, దిగజారి బతకొద్దు, రాత్రి పడుకోబోయే ముందు అద్దం ముందు నిలబడి సమీక్షించుకుంటే ఏదో తప్పుచేసిన భావన కలగొద్దు… అదే నాకు నిత్యపాఠం… సినిమా పాటలకూ భక్తి పాటలకూ తేడా ఉంటుంది… భక్తి పాటలకు శృతి, లయ, రాగం గట్రా సరిచేసుకుని పాడే సౌలభ్యం ఉంటుంది, సినిమా పాటలకు సంగీత దర్శకుడు కట్టిన బాణీల పరిధి దాటడానికి వీలుండదు… ఆర్కెస్ట్రా ప్రాక్టీసు చేసిన రాగమే గాయకుడికీ శరణ్యం… భక్తిపాటలకు సందర్భం, ఉచ్ఛరణ, నేటివిటీ, రాగాలు ముఖ్యం… ప్రత్యేకించి సంస్కృత పదాల ఉచ్ఛరణ శాస్త్ర ప్రమాణంగా, శబ్ద ప్రధానంగా ఉండాలి… క్లాసికల్ బేస్ ఉంటే, పర భాషల్లో పాటలు కూడా కొద్దిగా కష్టపడితే పాడొచ్చు’’ అని చెప్పిందామె…
Ads
ఈ గానసరస్వతి భర్త జయరాం కూడా సంగీతకారుడే, వాద్యకారుడు… పిల్లల్లేరు… సంపాదించిన సొమ్మను పరుల కోసమే ఖర్చు పెట్టేవాళ్లు… నిరాడంబర జీవితం… ఇంటి పనుల కోసం కూడా వేరేవాళ్లపై ఆధారపడేవాళ్లు కాదు… ఓ మామూలు ఫ్లాట్‌లో వంటపనులు, ఇంటిపనులు ఆమే స్వయంగా చూసుకునేది… భర్త మరణించాక ఒక పనిమనిషిని పెట్టుకున్నట్టుంది… నిన్న మరణించినప్పుడు కూడా ఇంట్లో ఆమె తప్ప ఎవరూ లేరు… ఆమె గాయనే కాదు, పెయింటర్, కవయిత్రి కూడా… కొన్ని ప్రిన్సిపుల్స్ పెట్టుకుని వాటికే కట్టుబడింది… పెళ్లిళ్లకు కచేరీలు చేయలేదు… గుళ్లల్లో పాడేది కాదు… భజన అంటే యోగాకు మరో రూపం… అవి పాడుతున్నంతసేపు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేది…
భజనలకు ఇతర సంగీత రూపాల్ని కలపడం ఆమెకు ఇష్టం ఉండేది కాదు… అలా చేస్తే భరతనాట్య ఆహార్యంలో డెనిమ్ దుస్తులు చేర్చినట్టు అవుతుంది అనేదామె… రేడియో సిలోన్ వాళ్ల బినాకా గీత్‌మాలా ప్రోగ్రాంలో వరుసగా 16 వారాలు టాప్ వన్ పాట ఆమె పాడిన బోలోరే పపీ హరా’ పాట… గుడ్డి సినిమా కోసం పాడింది… ఆ మొదటి పాటతోనే హిందీ చిత్రసీమలో వాణిజయరాం పేరు మారుమ్రోగి పోయింది. సంప్రదాయ కర్నాటక, హిందుస్తానీ సంగీతంలో నిష్ణాతురాలైన వాణిజయరాం పాటలు విలక్షణంగా ఉండేవి.
క్రమంగా నౌషాద్, మదన్ మోహన్, జయదేవ్, చిత్రగుప్త, ఓ.పి. నయ్యర్, ఆర్.డి. బర్మన్, కల్యాణ్ జీ ఆనంద్ జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వంటి సంగీత దర్శకులు వాణిజయరాంకు మంచి అవకాశాలు ఇవ్వటం మొదలైంది. చలనచిత్రరంగం ఆమెను ‘భారతీయ నైటింగేల్’ అని పిలవసాగింది. అప్పటికే వేళ్ళూనుకొని వున్న కొందరికి బాలీవుడ్ లో ఆమె ఎదుగుదల రుచించలేదు.
సహజంగానే రాజకీయం నడిపారు. ( ఇంకెవరు..? లత, ఆశ… వాణి సౌత్ ఇండియన్, పైగా తమకు పోటీ… అందుకే తొక్కేశారు…) సున్నిత మనస్కురాలైన వాణిజయరాం కి మనస్తాపం కలిగింది. వెంటనే మద్రాసుకి మకాం మార్చింది. అలా తెలుగు సినిమాల్లో ఆమె పాడిన పాటలు వినే భాగ్యానికి శ్రోతలు నోచుకున్నారు. అంతేకాదు, తెలుగు సినిమాలే ఆమెకు రెండు జాతీయ ఉత్తమ గాయని పురస్కారాలు కూడా తెచ్చిపెట్టాయి. నిజమే… ఆమె చెప్పినట్టు… బాలీవుడ్ ఏకైక ఇండస్ట్రీ కాదు, అది లేకపోతే జీవితమే లేదనే భావన కూడా సరికాదు… అమ్మా… సినిమా సంగీత ప్రపంచంలో నీ స్థానం నీదే… నువ్వు ఎవరికీ పోటీ కాదు, నీకు అసలు పోటీయే లేదు… ఎందుకంటే… వాణీజయరాం అంటే… ది గ్రేట్ వాణీజయరాం… అంతే…
Share this Article