పెద్ద పెద్ద కమెడియన్లుగా పేరొచ్చిన హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, బలగం వేణు వంటి చాలామంది వెళ్లిపోయారు… వెండి తెర అవకాశాల కోసం ప్లస్ మల్లెమాల పోకడలు నచ్చక..! చాలామంది కొత్తవాళ్లు వస్తున్నా సరే పెద్దగా ఇంప్రెసివ్ అనిపించడం లేదు…
రోహిణి, ఫైమా వంటి వాళ్లు తప్ప… మేల్ కమెడియన్లలో నూకరాజు, ఇమాన్యుయేల్ తమ టైమింగుతో, స్పాంటేనిటీతో క్లిక్కయ్యారు… ప్రత్యేకించి నూకరాజును చూస్తే ఆశ్చర్యమేస్తుంది… పటాస్ షోతో మొదలై, జబర్దస్త్ చేరి, ఈటీవీ ఆస్థాన కమెడియన్ అయిపోయాడు… నిజం చెప్పాలంటే తను ఈరోజు ఏ హాస్యనటుడికీ తక్కువ కాదు… కాదు, చాలామందికన్నా ఎక్కువే, కమెడియన్‌కన్నా ఎక్కువే…
చాన్నాళ్లుగా తనను గమనిస్తున్నాను జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, స్టాండప్ కామెడీ షో ఎట్సెట్రా… రీసెంటుగా ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూస్తే నూకరాజులో మంచి గాయకుడున్నాడని అనిపించింది… అంతేకాదు, ఓ భావోద్వేగ గీతాన్ని అంతే ఇంటెన్స్‌తో పాడి మెప్పించిన తీరు బాగుంది…
Ads
జూన్ 2… తెలంగాణ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని ఏదో స్పెషల్ స్కిట్ చేశారు… ఓ తెలంగాణ అమరుడి తల్లి బాధను గేయంగా పాడాడు నూకరాజు… పాత పాటే, కానీ కొత్తగా, సందర్భోచితంగా, కన్నీళ్లు పెట్టేలా పాడాడు…
ఉడుకునీళ్లతో తానం చేయిస్తే తల్లడిల్లేటోనివి, వేడి అన్నం ఊదుకుని ఊదుకుని తినేటోడివి, పెట్రోల్ పోసుకుని ఆ మంటలల్ల ఎట్ల కాలిపోయినవ్ బిడ్డా…. అనే పాట అది… అసలు ఎవరు ఈ నూకరాజు అని ఆరా తీస్తే, తనదీ ఓ భిన్నమైన ప్రస్థానమే అనిపించింది… దుఖం నుంచి, వెనకబాటుతనం నుంచి, కన్నీళ్ల నుంచి… ఆకలిపస్తులతోనే ఎదిగిన కెరీర్ తనది… తనలో సామాజిక స్పృహ కూడా ఉండటం అభినందనీయం… ఎక్కడో చదివాను ఇలా…
నిజానికి తనది అమలాపురం, విజయవాడలో సెటిలయ్యారు… పాలిటెక్నిక్ చేశాడు, విజయవాడ పవర్ ప్లాంటులో పనిచేసేవాడు… చాలా చిన్న, దిగువ మధ్యతరగతి కుటుంబం… పటాస్ షో చేయడానికి ముందు జీతెలుగులో ఓ కామెడీ షో వచ్చేది (కామెడీ కిలాడీలు..?), అందులో చేస్తూనే కొలువు చేసుకునేవాడు, కానీ కొన్నాళ్లకు జంట పడవల మీద ప్రయాణం కుదరదని హైదరాబాద్ బస్సెక్కేశాడు…
హైదరాబాద్ వచ్చాక సినిమా కష్టాలేమిటో తెలిసొచ్చాయి… ఆడిషన్స్ కష్టాలు, పస్తులు… ఖర్చులకు డబ్బుల్లేవు… అద్దె కట్టడానికీ తిప్పలే… ఓ ఫ్రెండ్‌ను అడిగితే ఉప్పర పనికి తీసుకెళ్లాడు… ఛ, ఇవన్నీ మానేసి విజయవాడ వెళ్లిపోయి, కల్లోగంజో తాగి బతకడం బెటర్ అనుకున్న స్థితిలో ఈటీవీ ప్లస్‌లో వచ్చే పిట్టగోడ కామెడీ షో ఆడిషన్స్, తరువాత పటాస్‌కు ఎంపిక, అక్కడి నుంచి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ…
గుడ్… తెలంగాణ గీతాన్ని ఒక కీరవాణి ఎందుకు కంపోజ్ చేయకూడదు..? తెలంగాణ అమరుడిపై ఒక నూకరాజు ఎంత గొప్పగా పాడాడో ప్రోమో చూడండి… ఎవరు కూర్చారు, ఎవరు పాడారనేది కాదు, ఎంత ఉద్వేగాన్ని పలికించారనేదే ముఖ్యం… పక్కా ఆంధ్రా పోకడల ఈటీవీలో, అదీ మల్లెమాల నిర్మాణంలో ఆ పాట, తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం స్పెషల్ స్కిట్ బాగున్నాయి… నూకరాజూ ఆల్ ది బెస్ట్…!!
Share this Article