నాంచారయ్య మెరుగుమాల…. 1999 ఏప్రిల్ లో వాజపేయి సర్కారు కూలిపోయాక ఎన్డీఏలో టీడీపీ చేరితే 1996లోనే టీడీపీ చేరిందని మూడు పార్టీల సంయుక్త ప్రకటన చెబుతోంది! 1996–98 మధ్య యునైటెడ్ ఫ్రంట్ కన్వినర్ గా ఉన్న చంద్రబాబు ఎన్డీఏలో చేరారా?
టీడీపీ 1996లో ఎన్డీఏలో చేరిందని బీజేపీ లెటర్ హెడ్ పై శనివారం విడుదలైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ సంయుక్త ప్రకటన చెబుతోంది. వాస్తవానికి జయలలిత ఏఐడీఎంకే మద్దతు ఉపసంహరణతో 1999 ఏప్రిల్ లో ఏబీ వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారు లోక్ సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారి టీడీపీ ఓటేసింది. అయినా ఒక ఓటు తేడాతో ఎన్డీఏ (వాజపేయి) సర్కారు కూలిపోయింది.
Ads
నిజానికి 1990 అక్టోబర్ లో బాబరీ మసీదు కూల్చివేతకు కాషాయ శిబిరం కార్యకర్తలు ప్రయత్నించడం, అయోధ్యకు రథయాత్రపై వస్తున్న బీజేపీ అగ్రనేత ఎల్.కే.ఆడ్వాణీని బిహార్‌లో నాటి లాలూ ప్రసాద్ సర్కారు (జనతాదళ్) అరెస్టు చేయడం, ఫలితంగా వీపీ సింగ్ సర్కారుకు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో నాటి నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్న ఎన్.టి. రామారావు బీజేపీతో ఏపీలో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారు.
1992 డిసెంబర్ 6న అయోధ్యలో బీజేపీ నేతృత్వంలోని సంఘ్ పరివార్ సంస్థల కార్యకర్తలు బాబరీ మసీదును కూల్చడంతో ఎన్టీఆర్ ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ప్రకటన కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ బతికుండగా జరిగిన 1994 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా దాదాపు అన్ని సీట్లకూ పోటీ చేసింది. టీడీపీ పగ్గాలు తన చేతుల్లోకి వచ్చాక మామ గారి పాలసీనే బీజేపీ విషయంలో చంద్రబాబు కొనసాగించారు.
వరుసగా 1996, 1998 లోక్ సభ ఎన్నికల్లో ఏపీలో జనతాదళ్, సీపీఐ, సీపీఎంతోనే టీడీపీ పొత్తుపెట్టుకుని పోటీచేసింది. అంతేగాదు వరుసగా 1996, 1997లో బయట నుంచి కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ (యూఎఫ్) పేరిట బక్కచిక్కిన జనతాదళ్ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పడిన ప్రభుత్వంలో సీపీఐతోపాటు టీడీపీ భాగస్వామి అయింది. టీడీపీకి మూడు మంత్రి పదవులు (ఎర్రన్నాయుడు, బోళ్ల బుల్లిరామయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు) దక్కాయి.
కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ పేరుతో దాదాపు రెండేళ్లు సంకీర్ణ సర్కార్లు నడిపిన కూటమికి నాడు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు చైర్మన్ లేదా కన్వినర్ గా ఉన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పింది కూడా నాయుడు గారు ఈ యునైటెడ్ ఫ్రంట్ కాలంలోనే (1996–99). 1999, 2004 లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో చంద్రబాబు టీడీపీ పొత్తుపెట్టుకున్నది మాత్రం వాస్తవం. 1999 పార్లమెంటు ఎన్నికల తర్వాత టీడీపీ ఎన్డీఏ సర్కారులో చేరకుండా లోక్ సభ స్పీకర్ పదవిని (జీఎంసీ బాలయోగి) మాత్రం బీజేపీ నాయకత్వాన్ని అడిగి మరీ తీసుకుంది. (NDA ఏర్పడింది కూడా 1998లో…)
ఎన్డీఏ (బీజేపీ)–చంద్రబాబు ‘లవ్ హేట్’ బంధానికి ఇంత సుదీర్ఘ నేపథ్యం ఉండగా– 1996లోనే ఎన్డీఏలో టీడీపీ చేరిందని శనివారం నాటి సంయుక్త ప్రకటనలో పై మూడు పార్టీలు ఏ లెక్కన చెప్పాయో మావంటి జర్నలిస్టులకు అస్సలు అర్ధం కావడం లేదు. అయితే, శేఖర్ గుప్తా సంపాదకత్వంలో నడిచే ఇంగ్లిష్ న్యూజ్ వెబ్ సైట్ ‘ద ప్రింట్’ హైదరాబాద్ ప్రతినిధి ప్రసాద్ నిచ్చెనమెట్ల కూడా ఈరోజు తాను పంపిన వార్తో –1996లో ఎన్డీఏలో టీడీపీ చేరిందని రాస్తే, ఈ విషయం అలాగే ప్రచురించారు.
ఫోటో: 1996లో కేంద్రంలో దేవగౌడ ప్రధానిగా యునైటెడ్ ఫ్రంట్ సర్కారు ఏర్పాటు గురించి మీడియాకు వివరిస్తున్న సీపీఎం ప్రధాన కార్యదర్శి హర్ కిషన్ సింగ్ సుర్జీత్ పక్కన చంద్రబాబు నాయుడు….
Share this Article