.
నిజమే… ప్రస్తుత తరానికి తెలంగాణ గత చరిత్ర, కష్టాలు, కన్నీళ్లు తెలియవు… తెలుసుకోవల్సిన అవసరం మాత్రం ఉంది… ప్రత్యేకించి నిజాం పీరియడ్‌లో రజాకార్లు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌ల అరాచకాలతో తెలంగాణ ఎన్ని అవస్థలు పడిందో తెలిస్తేనే… ఇప్పటి విముక్తి, స్వేచ్ఛ విలువ తెలుస్తుంది…
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సోషల్ మీడియా పోస్టు ఓసారి చదవండి… తన కాసనోవ-99 నవలలోని ఓ భాగం ఇది… తన పోస్టు ఇలా యథాతథంగా… (యండమూరికి ధన్యవాదాలతో… చాలా బాగా రాసినందుకు, నాటి తెలంగాణను అనితరసాధ్యంగా కళ్లకు కట్టినందుకు…)
Ads
Veerendranath Yandamoori …. నేటి యువతలో చాలామందికి… ఒకప్పటి తెలంగాణా చీకటి జీవితం ఇలా ఉండేదని తెలీదు. “కాసనోవ-99” నవలలో ఈ భాగం వ్రాయటానికి సహకరించిన వారు: సర్వశ్రీ సి. నారయణరెడ్డి, గుర్రం జాషువా వగైరాలు. ఆ రోజుల్లో ఈ విషయ సేకరణకి ౩ నెలలు పట్టింది. నవలలో ఒక పాత్ర ఇలా చెబుతుంది:
‘‘నా తండ్రి పేరు చెంచయ్య, బోయి చెంచయ్య..! సూర్యాపేట దగ్గర చిన్న గ్రామం మాది. భారత దేశంలో స్వాతంత్య్రోద్యమ పోరాటం జరుగుతోందన్న విషయం కూడా తెలియనంత చిన్న ఊరు మాది . ఆటోలు రాక ముందు సైకిల్ రిక్షాలు, ఇంకా కొంచెం వెనక్కి వెళితే ‘మూడు చక్రాల బండి’ని మనుషులు చేతులతో లాగేవారు. దానికన్నా వెనక్కి వెళ్తే పల్లకీలు ఉండేవి.
ఇప్పుడు నేను చెప్తున్నది అంతకన్నా వెనుక మీకు తెలియని చరిత్ర గురించి..! ఆ రోజుల్లో జాగీర్దార్లనీ, దేశ్‌ముఖ్‌లనీ, పటేల్, పట్వారీలనీ ఒక చోట నుంచి మరొక చోటుకి చేర్చటానికి, మా తండ్రిలాటి వారిని ‘జంతువుల్లా’ ఉపయోగించేవారు. వెనుక వంది మాగధులు వెంట రాగా ఈ పటేళ్ళు ‘బోయీ’లు భుజాల మీద ఎక్కి, అయిదారు మైళ్ళు ప్రయాణి౦చే వాళ్ళు. బోయీలు మధ్యలో నీటి కోసం కూడా ఆగటానికి వీల్లేదు’’.
- ‘‘… నాకొక అన్నయ్య, చెల్లి ఉండేవారు. ఆ రోజుల్లో ఈ ‘దాసి’ సిస్టమ్ చాలా కఠినంగా అమలులో ఉండేది. సూర్యాపేట్ దేశముఖ్ కూతురి పెళ్ళికి మా పిన్నిని ‘దాసి’గా పంపవలసి వచ్చింది. దాసీ అంటే పెళ్ళికూతురుతో పాటు, ఈ అమ్మాయి కూడా అత్తవారింటికి భరణంగా వెళ్ళి, అక్కడ కొత్త పెళ్ళికూతురుకి జీవితాంతం సేవ చేస్తూ, ఆ ఇంట్లో మొగవారికి ఉంపుడుకత్తెగా ఉండాలి. ఇదీ అప్పటి ఆచారం.
ఇదిగాక ‘వెట్టి’ అని ఉండేది. ప్రతి హరిజన కుటుంబం నుంచి ఒక కుర్రవాడ్ని జమిందారు ఇంటికి ‘వెట్టి’ కోసం తప్పనిసరిగా పంపాలి. మా పిన్ని వెళ్ళిన కొన్నిరోజులకి మా అన్న ‘వెట్టి’ కోసం పట్వారీ దగ్గరికి వెళ్ళిపోయాడు”.
‘‘అప్పుడే మా తండ్రి నన్ను స్కూల్లో చేర్పించాడు. సూర్యాపేట తాలూకాలో ‘స్కూల్లో’ చదువు ప్రారంభించిన మొట్ట మొదటి హరిజనుణ్ణి నేను. అప్పుడు తెలంగాణా ప్రాంతం నిజాం ఆధీనంలో ఉంది. తెలుగు, కన్నడ, మరాఠీలాటి మాతృభాషల్ని బోధించాలంటే స్కూలు యాజమాన్యం, ఉర్దూ అధికారుల్నుంచి ‘ప్రత్యేక పర్మిషన్’ తీసుకోవాలి. తొంభై శాతం హిందువుల మీద పదిశాతం ముస్లిమ్‌లు ఆ విధంగా అధికారం చెలాయించేవారు..! అదీ అప్పటి పరిస్థితి..!
ప్రొద్దున్నపూట చదువుకుంటూ, సాయంత్రాలు నేను తపాలా బట్వాడా చేసేవాడిని. రెండున్నర మైళ్ళు నడిచి వెళ్ళి ఒక ఉత్తరం బట్వాడా చేస్తే ‘అణా’ ఇచ్చేవారు. ఆ రోజుల్లో దాన్నే ‘‘కోసుకు వీసం’’ అనేవారు. కోసు అంటే రెండున్నర మైళ్ళు. వీసం అంటే రూపాయిలో పదహారోవంతు…!
కమ్మర్లు, కుమ్మర్లు, రజకులు, బోయలు, బెస్తలు- అందరూ ఈ పట్వారీల ఇళ్ళల్లో ఉచితంగా పనిచేయాలి. గీత పనివారు, వారి కుటుంబాలకి రోజూ ఉచితంగా కల్లు సప్లయి చేయాలి. బట్టలు ఉతకడం- కుండలు సప్లయి చేయటం- అంతా ఉచితమే.
ఈ పట్వారీలు గుర్రాల మీద గానీ, మేనాల్లోగానీ వేరే ఊర్లో ఉన్న బంధువుల ఇళ్ళకి ప్రయాణం చేయవలసి వస్తే, మేమంతా ఈ ఊరి నుంచి ఆ ఊరివరకూ ఆ బళ్ళ ముందూ, వెనుకా కొన్ని మైళ్ళు దారిని ‘క్లియర్’ చేస్తూ గట్టిగా అరుచుకుంటూ పరుగెత్తుతూ వెళ్ళాలి. దాన్ని వ్యతిరేకిస్తే వంద కొరడాదెబ్బలు…!
‘సారఖాస్’ అని ఒక సిస్టమ్ ఉండేది. హైద్రాబాద్ రాష్ట్రంలో అయిదుకోట్ల ముప్పై లక్షల ఎకరాలలో పంటలు పండేవి. అందులో అయిదులక్షల ఎకరాల మీద వచ్చే ఆదాయం కేవలం నైజాం నవాబు ఖర్చులకీ, విందులూ వినోదాలకీ, భార్యల- ఉంపుడుకత్తెల నిర్వాహణకి వినియోగించేవారు..!
నవాబుకి విశ్వాసపాత్రులయిన దేశ్‌ముఖ్‌లు మమ్మల్ని నిరంకుశులుగా పాలించేవారు. మా కుటుంబాల్లో ఎవరికైనా కాస్త భూమి ఉంటే, విత్తనాలు, నాగళ్ళకి వీరు ధన సహాయం చేసేవారు. పంట చేతికి రాగానే వడ్డీ రూపేణా మొత్తం తోలుకు వెళ్ళి పోయేవారు. ఆ తరువాత “అసలు” రూపేణా పొలాన్ని తమ పొలంలో కలిపి వేసుకునేవారు. ఆ విధంగా ‘తిరిగి’ మళ్ళీ మా కుటుంబం వెట్టి జాబితాలో చేరి పోయేది…! తన భూమిలోనే తను కూలీగా పనిచేయవలసి వచ్చేది…! జానారెడ్డి ప్రతాపరెడ్డి అనే దేశ్‌ముఖ్ ఒక్కడికే సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో 1,50,000 ఎకరాల పొలం ఉండేది. మా తండ్రి అక్కడే పని చేసేవాడు.
మాలో ఎవరయినా కొద్దిగా ఎదురు తిరిగినా- పట్వారీలు పిలిపించేవారు. అశుద్ధం తినిపించేవారు. మూత్రం తాగించేవారు. తలక్రిందులుగా వ్రేలాడదీసేవారు..! మా జీవితమంతా చీకటే. పట్వారీ- మా కుటుంబంలోంచి కుర్రవాడిని వెట్టి కోసం ఏ క్షణం స్వంతం చేసుకుంటాడో తెలీదు. ఏ క్షణం దేశ్‌ముఖ్- మా కుటుంబంలోని ఒక ముక్కుపచ్చలారని అమ్మాయిని భరణంగా స్వీకరిస్తాడో తెలీదు.
- మా జీవితమంతా భయమే. కదుల్తున్న అస్థిపంజరాల్లా బ్రతికేవాళ్ళం. భవిష్యత్తు పట్ల అంధకారంలో, జీవితం పట్ల భయంతో… వారి సేవలో గడపటమే మేము చేసుకున్న పుణ్యం అన్నట్లు… మోసగింపబడటమే మా జీవితంలో భాగం అన్నట్లు జీవచ్ఛవాల్లా బ్రతికేవాళ్ళం. సరిగ్గా ఆ సమయంలో వచ్చింది- ‘‘తెలంగాణా సాయుధ పోరాటం…!’’ చెప్పటం ఆపాడు శ్రీవాత్సవ. పార్లమెంట్‌లో చీమ చిటుక్కుమంటే వినపడేటంత నిశ్శబ్దం…
‘‘… తెలంగాణా అంతా ఉద్యమం ప్రారంభమైంది. కల్లు శిస్తు నిరాకరణ నుంచి- అధిక భూముల పంపకం వరకూ ‘దళాలు’ చేపట్టాయి. మా తండ్రి బోయి చెంచయ్య, సూర్యాపేట తాలూక జాజిరెడ్డి గూడెంకి స్క్వాడ్ లీడర్ అయ్యాడు. మల్కాపురం, గోరంట్లలలో చిన్నగా ప్రారంభమైన ఉద్యమం ఆదిలాబాదు, భద్రాచలం వరకూ పాకింది.
ఇరవై ఎకరాలు ‘లాండ్ సిలింగ్’గా కమ్యూనిస్ట్ పార్టీ ఆంక్షలు విధించింది. అంతకన్నా ఎక్కువ ఉంచుకో కూడదని మా దళాలు హెచ్చరించాయి. తెలంగాణా భూస్వాముల, దొరల గుండెల్లో రైళ్ళు పరుగెత్తాయి. వెళ్ళి నిజాం నవాబుని శరణుజొచ్చారు.
నైజాం నవాబుతో కలిసి న్యాయాన్యాయాల్ని పక్కన పెట్టి ఒక సైన్యాన్ని తయారు చేశారు. వారికి సర్వాధికారాలూ ఇచ్చాడు నవాబు. ఎదురు తిరిగినవాడిని అక్కడికక్కడే కాల్చేందుకు రైఫిల్స్ ఇచ్చాడు. గృహ దహనాలు, లూటీలు, మానభంగాలు ఒకటేమిటి? దేనికయినా సరే, వారిని ప్రశ్నించేవారు లేరు. అటువంటి అధికారాలతో ఆ ముస్లిం గూండాలు తెలంగాణా పైకి విరుచుకుపడ్డారు. వారే రజాకార్లు…’’ అన్నాడు శ్రీవాత్సవ.
“రజాకార్లు జీపుల్లోనూ, గుర్రాలపైనా వస్తుంటే- గ్రామాలకి గ్రామాలు నిముషాల్లో ఖాళీ అయి పోయేవి. హిందువులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగెత్తేవారు. అటకల పైకెక్కి దాక్కునేవారు. రజాకార్లు హిందూ స్త్రీల స్థనాల్నీ, ఆవు పొదుగుల్నీ కత్తిరించే వారు. పల్లె ప్రజల ఆస్తుల్ని, ఆహార ధాన్యాల్నీ- చివరికి కందిపప్పు, మినప్పప్పుతో సహా రజాకార్లు దోచుకు పోయేవారు.
- గ్రామాల్ని తగులబెట్టేవారు. నెలల తరబడి క్యాంపు వేసి కోళ్ళు, మేకలు, విందులు- వినోదాలు ఒకటేమిటి- వారి ఆనందానికి, అరాచకానికీ అడ్డుండేది కాదు. ఆడది కనపడితే చాలు. ఆమె భర్తే స్వయంగా తీసుకెళ్ళి వారి క్యాంపుల్లో అర్పించాల్సిందే…!
ఆ సమయంలో మా తండ్రిలాంటి సాయుధ దళాధిపతులు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం రజాకార్లని ఎదుర్కొన్నారు. దేశ్‌ముఖ్‌లనీ, పట్వారీలనీ భుజాలపై మోసుకుంటూ మైళ్ళకి మైళ్లు నడిచిన చేతులు, స్త్రీలనీ పీడిత ప్రజల్నీ రక్షించడం కోసం రైఫిళ్ళని పట్టుకుని నడుం కట్టాయి. బోయి చెంచయ్య అంటే సూర్యాపేట తాలూకాలో తెలియనివారు లేరు’’.
‘‘… అనుకున్నట్టుగానే, ఇండియాకి స్వతంత్రం రాగానే నిజాంనవాబు హైద్రాబాద్‌ని స్వతంత్ర దేశంగా ప్రకటించాడు. పాకిస్తాన్ నుంచి సైన్యం వచ్చి తమ దేశాన్నీ, దేశంలోని ముస్లిమ్‌లనీ కాపాడుతుందని అనుకున్నాడు. కానీ అతడొక విషయం మర్చిపోయాడు. రజాకార్లతో చేరి హిందువులపై భీభత్సం సృష్టిస్తూన్న ముస్లిమ్ ఛాందసవాదులకన్నా- మాతో ఉండి పోరాడుతున్న బీద “ముస్లిమ్” గ్రామీణులే ఎక్కువ.
ఆ విధంగా మా పోరాటం కొనసాగింది. ఈ లోపు భారత సైన్యం బయల్దేరిందని తెలిసింది. అందరం నృత్యాలు చేసాం. మా రక్తంతో తడిసిన తెలంగాణా మట్టి, మాకు శాశ్వతంగా సొంతంగా మిగిలి పోబోతుందన్న సంతోషంతో చిందులు తొక్కాం.
సెప్టెంబర్ 13, 1948… అటు భారత సైన్యం ఢిల్లీ నుంచి బయల్దేరి వరంగల్ వస్తోంది. ఇటు హైద్రాబాద్ నుంచి రజాకార్ల సైన్యం ఆలేరు, భువనగిరి, ఖమ్మం రైల్వే స్టేషన్లని మరింత బలపర్చి, స్వాధీనంలో ఉంచుకోవటం కోసం బయల్దేరింది.
- మా దళాలు రైలు పట్టాలు తొలగించాయి. రోడ్డు దారిన రజాకార్లు ఆ ప్రాంతాలకు చేరుకోకుండా ‘‘ఆరు నూళ్ళ తట్టపార- మూడు నూర్ల గడ్డపార’’ అని పాడుతూ రోడ్డుకి అడ్డంగా గుంటలు తవ్వటం ప్రారంభించాయి. ‘రజాకార్లని ఆపటానికి మూడొందల గునపాలూ, ఆరొందల తట్టలూ చాలు’- అన్న ఆ పాట ఆ రోజుల్లో ఎంతో ప్రసిద్ధమైంది.
భారత సైన్యం వచ్చేస్తుందన్న సంతోషంలో మేము కాస్త ఆదమరచి ఉండగా ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. రజాకార్లు హైద్రాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్ళకుండా యాదగిరిగుట్ట దగ్గర గుడి పూజారి వేషంలో వాహనాలు మేకులు జల్లుతూన్న నా తండ్రి రజాకార్లకి దొరికిపోయాడు.
బోయి చెంచయ్య పట్టుబడిన విషయం తెలియగానే జనం ప్రాణభయం కూడా పక్కన పెట్టి పరుగెత్తుకు వచ్చారు. నాకపుడు నిండా ఇరవై ఏళ్ళు కూడా లేవు. నేనాయన కొడుకునని రజాకార్లకి తెలియదు. చెల్లి మాత్రం దొరికిపోయింది. మమ్మల్నందర్నీ వలయంగా నిలబెట్టారు. రోడ్డుకి అడ్డంగా మా తండ్రి తవ్విన గుంటలోనే ఆయన్ని మెడ వరకూ పాతిపెట్టారు.
- నేలలో మేకులు కొట్టి, మొహానికి ఆకాశం కనపడేలా జుట్టు గట్టిగా బిగించారు. కళ్ళు మూసుకోవటానికి వీల్లేకుండా కనురెప్ప కత్తిరించి, రక్తం తొందరగా గడ్డ కట్టటానికి వాటిపై మూత్రం పోశారు. ఆ తరువాత ఆయన మొహం మీద నులక మంచం వేసి, దుప్పటి లేకుండా పదిమంది రజాకార్లు మా చెల్లిని ఆ మంచం మీద అత్యాచారం చేశారు. మేమందరం నిశ్శబ్దంగా ప్రేక్షకుల్లా చూస్తూ నిలబడ్డాం… మా తండ్రితో సహా…’’
పార్లమెంట్ అంతా వేదనాపూరిత వాతావరణం నిండింది. ఒక యువ పార్లమెంటేరియన్ దుఃఖం ఆపుకోలేక ఏడ్చేశాడు.
“భారత సైన్యం వస్తోందిరా…! నిజాం రజాకార్లు ఓడిపోక తప్పదు’’ అంటూ నా తండ్రి చివరి శ్వాస తీసుకున్నాడు. అనుకున్నట్టుగానే భారత సైన్యం దిగింది. విమానాల దాడులతో హైద్రాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతం దద్దరిల్లింది. తెలంగాణా ప్రజలు రజాకార్లని తరిమికొట్టారు.
1948 సెప్టెంబర్ 18న నిజాం నవాబు లొంగిపోయాడు. సూర్యాపేటలో నూట ఇరవై ఎకరాల స్థలంలో, నైజాం పాలెస్ కన్నా పెద్దదయిన జానారెడ్డి ప్రతాపరెడ్డి భవంతి అంగుళం కూడా మిగలకుండా కూలగొట్టబడింది. అక్కడ రెండువేల బస్తాల ధాన్యం దొరికిందంటే మీరే ఊహించుకోవచ్చు.
తెలంగాణా రైతు కూలీలు విజయానికి గుర్తుగా మధ్యలో చిన్న సమాధి వదిలిపెట్టి, మిగతా స్థలాన్ని పొలంగా మార్చారు. ఎక్కడ చూసినా జనప్రవాహమే. జండాలు పట్టుకుని, పాటలు పాడుతూ, కదం తొక్కుతూ ఆనందాన్ని ప్రకటించారు. అదీ మా తెలంగాణా కథ”.
పార్లమెంటు చప్పట్లతో దద్దరిల్లింది. అక్కడి సభ్యుల్ని అది ఎంతగా ‘మూవ్’ చేసిందంటే, ప్రతిపక్ష సభ్యులు కూడా కరతాళ ధ్వనులు చేశారు…
Share this Article