ప్రఖ్యాత రచయిత యండమూరి ఓ సోషల్ వివాదంలో చిక్కుకున్నాడు..! ఇటు ఆయన్ని ఖండించేవాళ్లు, అటు సపోర్ట్ చేసేవాళ్లతో తెలుగు సోషల్ మీడియా కాస్తా ఉడికిపోతోంది… నిజానికి ఢిల్లీలో ఆందోళనలు, వాటి వెనుక వ్యూహాలు, ప్రతివ్యూహాలు, రైతు బిల్లులు, టూల్ కిట్స్, గ్రెటా థన్‌బర్గ్, దిశ రవి అరెస్టు, దేశద్రోహం కేసుల మీద దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది… సోషల్ మీడియా కూడా రెండుగా చీలిపోయింది… రైట్ వింగ్ సోషల్ యాక్టివిస్టులు, ఆ ఆందోళనల సమర్థకుల నడుమ హాట్ హాట్ డిబేట్లు, తిట్లు, శాపనార్థాలు, సీరియస్ ట్రోలింగులతో సోషల్ మీడియా వేదికలు కుతకుతలాడి పోతున్నయ్… అదుగో, ఆ మంటల నడుమ అనుకోకుండా ఓ చిన్న వ్యాఖ్య ద్వారా యండమూరి అడ్డగోలుగా ఇరుక్కుపోయాడు… ఈ వివాదం సరిగ్గా ఎక్కడ స్టార్టయిందో తెలియదు… రైట్ వింగ్ సోషల్ యాక్టివిస్టు అవ్వారు శ్రీనివాసరావు దిశ రవి, గ్రెటా ఫోటోలు పెట్టి… ‘‘ప్రకృతి విరుద్దంగా.. అసహజంగా.. దేశాలకూ సమాజాలకూ వ్యతిరేకంగా ఆలోచించేవాళ్ళ మోహల్లో ప్రశాంతత ఎందుకుండదు?? ఎప్పుడూ తీవ్ర ఆందోళనతో .. చూడగానే సదభిప్రాయం కలగని ముఖకవళికలతో ఉంటారెందుకు??.. మానుఫాక్చరింగ్ డిఫెక్టా లేక జన్యులోపమా??’’ అని పోస్టు చేశాడు… బహుశా ఇక్కడే మొదలై ఉంటుంది…
దిశ రవి అరెస్టు, ఇతర పరిణామాలు, రైతు ఆందోళనల అనుకూల, వ్యతిరేక పోస్టులకు సోషల్ మీడియాలో కొదువ లేదు… అలాంటి వాటిల్లో ఇదీ ఒకటి… కానీ కామెంట్లలో ఓచోట యండమూరి వీరేంద్రనాథ్ ‘గుడ్ అబ్జర్వేషన్ సార్’ అని ఓ వ్యాఖ్య విసిరాడు… ఇక అక్కడ మొదలైనట్టుంది… నీకేం తెలుసు..? నువ్వు సమర్థిస్తున్నావా ఈ పనికిమాలిన పోస్టును అన్నట్టుగా కొందరు తిట్టేయడం స్టార్ట్ చేశారు… ఇక ఆయన్ని తిట్టేవాళ్లు, సమర్థించేవాళ్లు… అది కాస్తా ఎక్కడెక్కడికో వెళ్లిపోయింది… అసలు చర్చ ట్రాకు తప్పి, యండమూరి నవలలు, వాటి నాణ్యత, క్షుద్రసాహిత్యం, ఆయన నాసిరకం వ్యక్తిత్వ వికాసపాఠాలు, తన వ్యక్తిగత దురలవాట్లపైకి కూడా మళ్లింది… ఆ పోస్టులోని కామెంట్లలో మాత్రమే కాదు, చాలామంది ఆయన్ని విమర్శిస్తూ సపరేటుగా పోస్టులు పెట్టారు… తనను సమర్థిస్తూ కూడా కొందరు పోస్టులు పెట్టారు… మళ్లీ ఆ పోస్టుల కామెంట్లలోనూ చర్చలు… పెద్ద రచ్చ…
Ads
ఔను, తన వ్యక్తిగత అభిప్రాయం చెబితే తప్పేమిటీ అని ఎవరైనా సమర్థించాలనుకున్నా సరే, సోషల్ మీడియాలో కుదరదు… నువ్వు అలా ఎలా చెబుతావు..? అసలు నీ సంగతేమిటి..? నువ్వేమైనా శుద్ధపూసవా..? నీ కథ మాకు తెలియదా అని మొదలై మరో వ్యతిరేకవర్గం విరుచుకుపడటమే… మళ్లీ దానికి ఇటువైపు నుంచి కౌంటర్లు… నిజానికి యండమూరికి వివాదాలు కొత్తేమీ కాదు… తులసిదళం సీరియల్ నుంచీ ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో వినబడుతూనే ఉంటాడు… ఇప్పుడు తాజాగా ఇది… అయితే ఇది తను ఊహించింది కాదు… ఈ ఢిల్లీ టూల్ కిట్ యవ్వారం ఎలా కుతకుతలాడుతుందో సరిగ్గా అంచనా వేయలేక, ఎరక్కపోయి వేళ్లు పెట్టాడు… వేళ్లు కాలిపోయాయి… అంతే… ఇది ఇప్పట్లో ఆగేలా లేదు… అన్ని పోస్టులనూ మనం ఇక్కడ ప్రస్తావించలేం గానీ, మచ్చుకు ఒకటీరెండు… ఇటూఅటూ…
Share this Article