.
రాకింగ్ స్టార్ యష్ తెలుసు కదా… ‘కెజియఫ్’తో ఎక్కడికో ఎదిగిపోయాడు ఈ పాన్ ఇండియా స్టార్… గ్లోబల్ రేంజ్… తరువాత తన సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు… రామాయణంలో రావణ పాత్ర పోషిస్తూ హీరో ప్యాకేజీకన్నా ఎక్కువ తీసుకుంటున్నాడని వార్తలు…
అదీ తన రేంజ్… ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ కనబరుస్తున్న వైఖరి మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో… యష్ తన అభిమానులకు రాసిన ఓ లేఖ బాగుంది… ఎస్, కోట్లకుకోట్లు కొల్లగొడుతూ, ఫ్యాన్స్, ప్రజలు, సమాజం మీద వీసమెత్తు కన్సర్న్ లేని స్టార్ హీరోలు కూడా ఓసారి చదవాలి అది…
Ads
తమిళనాడులో సూర్య, అజిత్ వంటి హీరోలు మినహాయింపు… యష్ తన పుట్టిన రోజు రాబోతున్న నేపథ్యంలో ఈ బహిరంగ లేఖ రాశాడు… సారాంశం ఇదీ…
‘‘ఈ ఏడాది పూర్తవుతున్నది… అందరూ వేడుకల్ని నిర్వహించుకోవడానికి రెడీ అవుతున్నారు… అలాగే నా పుట్టిన రోజును (8 జనవరి) కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి నా అభిమానులు కూడా సిద్ధమవుతున్నారు… మీ అభిమానానికి, మీరు చూపిస్తున్న ఆదరణ నాకు ప్రత్యేకం…
కానీ జాగ్రత్త… ప్రేమను వ్యక్తపరిచే విధానాల్ని మార్చుకుందాం… మీరు గొప్ప లక్ష్యాలను చేరుకోవాలి… ఇదెందుకు చెబుతున్నాను అంటే..?
గతంలో నా పుట్టినరోజు సందర్భంగా దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి… నా పుట్టిన రోజు సందర్భంగా గదగ్ జిల్లాలో (కర్నాటక) ముగ్గురు అభిమానులు భారీ కటౌట్ ఏర్పాటు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు…
“నా మనసును కలిచివేసింది… వెళ్లాను, పరామర్శించాను ఆ కుటుంబాలను… మద్దతుగా ఉంటానని హామీ ఇచ్చాను… కానీ పోయినవారిని తీసుకురాలేం కదా… సో, ప్లీజ్… నన్ను నిజంగా అభిమానించేవాళ్లు బ్యానర్లు కట్టకండి, ప్రమాదకరమైన బైక్ చేజింగులు చేయకండి, నిర్లక్ష్యపు సెల్ఫీలు తీసుకోకండి… అవి చేస్తే అది తన పట్ల నిజమైన అభిమానం చూపడం కానే కాదు…’’
భేష్ యష్… ఫ్యాన్స్‌ను ఎప్పటికప్పుడు కట్టడి చేసుకునే విధానం ఇది… అసలు ఫ్యానిజాన్నే నిరుత్సాహపరచాలి… వోకే, ఇప్పుడున్న స్టార్ హీరోయిజం దిక్కుమాలిన ప్రమాణాల నేపథ్యంలో… తమను తాము దేవుళ్లుగా పరిగణించుకుంటూ, పిచ్చి భ్రమల్లో వాళ్లు బతుకుతూ, ఫ్యాన్స్‌ను- ప్రమాదాలను కూడా పట్టించుకోని వాతావరణంలో యష్ కనీసం ఈ జాగ్రత్తల్ని చెప్పడం ఒకింత మేలు… పిచ్చి పనులు చేస్తే అది తన పట్ల అభిమానం చూపడం కానేకాదని నిష్కర్షగా స్పష్టం చేయడం బాగుంది…
రికార్డు స్థాయి కటౌట్లు, నోరిప్పితే అబద్దాలు కాదు… మన హీరోల్లో యష్‌లా ఒక్కరైనా ఈ నాగరిక ధోరణిని కనబరిచారా..? పైగా ఏదైనా దుర్ఘటన జరిగి, ప్రభుత్వం స్పందిస్తే, ఇండస్ట్రీ మూకుమ్మడిగా వెళ్లి నిందితుడినే బాధితుడిగా పరామర్శించడం..!!
Share this Article