మిథున్ చక్రవర్తి… డెబ్బయ్ ఏళ్ల వయస్సు… చిన్నాచితకా చాలా వేషాలు వేసినా, దేశమంతా తనను గుర్తించిందీ, గుర్తుంచుకున్నదీ డిస్కో డాన్సర్ సినిమాతోనే..! తను మొన్న బీజేపీలో చేరాడు మోడీ సమక్షంలో… ఇంకేముంది..? ఇటు లెఫ్ట్ పార్టీలు, అటు టీఎంసీ విమర్శల దాడికి దిగాయి మిథున్ చక్రవర్తిపైన… మీమ్స్, పోస్టులతో సోషల్ మీడియాను కూడా హోరెత్తిస్తున్నారు… వ్యంగ్య బాణాలు విసురుతున్నారు… హహహ… నిజానికి ఇక్కడ చెప్పుకోదగింది ఏమిటంటే..? ఈ డెబ్బయ్ ఏళ్లూ తను యాంటీ-బీజేపీ బాటలోనే బతికాడు… ఇప్పుడు తిట్టిపోస్తున్న పార్టీలకే అత్యంత ఆప్తుడిగా ఉన్నాడు… ఇప్పుడు బీజేపీలోకి రాగానే అందరికీ భ్రష్టుడిగా కనిపిస్తున్నాడు..! టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అయితే మిథున్ ఓ నక్సలైట్, తనకు క్రెడిబులిటీ ఏం ఏడ్చింది అని తిట్టేశాడు… నక్సలైట్లంటే క్రెడిబులిటీ ఉండదా..? అది టీఎంసీ నేతలు చెప్పడమా..? ఇది మరో జోక్… అయితే అది నిజమా..? మిథున్ చక్రవర్తి నక్సలైటా..?! అవును, నిజమే… బెంగాల్లో నక్సలిజం కణకణమండిన తొలి రోజుల్లోనే తను యాక్టివ్ నక్సలైట్…
చారుమజుందార్ వంటి నక్సలై నేతలతో కలిసి పనిచేశాడు… తన సోదరుడు ఓ ప్రమాదంలో మరణించడం, నక్సలైట్ల ఏరివేత మీద పోలీసులు కాన్సంట్రేట్ చేయడంతో కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయి… నక్సలైట్ల ఉద్యమం నుంచి బయటపడాలని నిర్ణయించుకుని… నేరుగా పూణె ఫిలిమ్ ఇన్స్టిట్యూట్ చేరుకున్నాడు… తన రాజకీయ గతాన్ని ఎవరికీ చెప్పకుండా, తను ఎక్స్పోజ్ గాకుండా మేనేజ్ చేసుకున్నాడు… ముంబై చేరుకున్నాక కూడా మిథున్ పేరుతోపాటు రానా రెజ్ అని మరో పేరు… విశేషం ఏమిటంటే..? తనకు అప్పట్లో వచ్చిన ఓ ప్రధాన పాత్ర కూడా నక్సలైటే… ఆ సినిమా పేరే ది నక్సలైట్స్… 1980లో… వదిలించుకుందామన్నా నక్సలిజం అనే పదం నన్ను వదలడం లేదని మొదట్లో ఆ పాత్ర చేయడానికి మొరాయించాడు… కానీ తప్పలేదు… చేశాడు… అది బాక్సాఫీసు దగ్గర తన్నేసింది… అది వేరే కథ… కానీ నక్సలైట్ అనే పదం వదలదు అని చెప్పడానికి ఓ ఉదాహరణ… ఈ వయస్సులోనూ, ఇన్నేళ్ల తరువాత కూడా… ఆ పంథాను వదిలేసిన దశాబ్దాల అనంతరం కూడా… తనను ఆ పదమే వెంటాడుతోంది…
Ads
జ్యోతిబసు హయాంలో మిథున్ సీపీఎంతో మంచి సంబంధాల్లో ఉండేవాడు… ఆ పార్టీ ఫండ్ రెయిజింగ్ కార్యక్రమాల్ని ఆర్గనైజ్ చేసేవాడు… జ్యోతిబసు మరణం తరువాత ఆ పార్టీకి దూరమయ్యాడు… తరువాత తృణమూల్‌కు దగ్గరయ్యాడు… రాజ్యసభకు పంపించింది మమతా బెనర్జీ… తరువాత ఏం జరిగిందో రెండేళ్లకే రాజీనామా చేసి దూరం జరిగాడు… చాలారోజులపాటు అసలు రాజకీయ తెర మీదే ఆయన కనిపించలేదు… ఇప్పుడు అకస్మాత్తుగా ఈ మాజీ నక్సలైట్, మాజీ సీపీఎం హితైషి, మాజీ టీఎంసీ లీడర్ ప్రధాని మోడీ సమక్షంలో బీజేపీలో చేరిపోయాడు… టార్గెట్ ఏమిటి..? ఏమో… తనకే తెలియాలి… ఒకప్పటి హీరోయిన్ యోగితా బాలిని పెళ్లిచేసుకున్న తనకు ముగ్గురు కొడుకులు, ఒక బిడ్డ… ఒకరకంగా రిటైర్డ్ లైఫ్ గడుపుతున్న తన నుంచి బీజేపీ అకస్మాత్తుగా ఆశిస్తున్నదేమిటి..? ఏమో… ఎన్నికలయ్యాక కదా తేలేది…! వేచిచూద్దాం..! ‘‘కేవలం బుసలు కొట్టే పాము అనుకుని పొరపడొద్దు, ఒకే కాటుతో చంపేస్తా’ అని డైలాగులు విసురుతున్న ఈయన్ని కొంపదీసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణించడం లేదు కదా…!!
Share this Article