Subramanyam Dogiparthi…. సినిమా చూస్తున్నా , పాటలు వింటున్నా ఎక్కడో చూసామే , ఎక్కడో విన్నామే అనిపిస్తుంది . దసరా బుల్లోడి ప్లాటును తీసుకుని , మార్పులు చేసినట్లుగా ఉంటుంది . పాటలు కూడా అలాగే అనిపిస్తాయి . అయితే పాటలు హిట్టయ్యాయి . గంపా నెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే గుండె ఝల్లుమన్నాదే రంగమ్మా పాట దసరా బుల్లోడిలో పచ్చ గడ్డి కోసేటి పడుచు పిల్లో పాట గుర్తుకొస్తుంది . అక్కినేని, వాణిశ్రీ ఆ పాటలోలాగే నర్తిస్తారు. అలాగే ఈ సినిమాలో గౌరమ్మ తల్లికి బోనాలు పాట , ఆ పాటలో సంబరాలు హడావుడి దసరా బుల్లోడు సినిమాలో సంబరాలు గుర్తుకొస్తాయి .
మొత్తం మీద టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . అందానికి అందానివై ఎనాటికి నాదానివై , చక్కాని చిన్నవాడే చుక్కల్లో చందురూడే , మనసైనా చినదానా ఒక మాటుంది వింటావా , పిల్లోయ్ జాగర్త ఒళ్ళు కాస్తా జాగర్తా , మా చేను బంగారం పండిందిలే మా ఇంట మహాలక్ష్మి నిలిచిందిలే , రావమ్మా రావమ్మ రతనాల బొమ్మ , చూడనీ ఆహా చూడనీ పాటలు బాగుంటాయి .
ANR , వాణిశ్రీ , వెన్నిరాడై నిర్మల , రామకృష్ణ , నాగభూషణం , శాంతకుమారి , పద్మనాభం , రమాప్రభ , అల్లు రామలింగయ్య , మిక్కిలినేని , సూరేకాంతం వంటి హేమాహేమీలు ఉన్నా , శ్రావ్యమైన హిట్ సాంగ్స్ ఉన్నా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు . ఓ తమిళ చిత్రకథ ఆధారంగా నిర్మించారు దీన్ని .
Ads
పాటల్లో మంచి వైవిధ్యం కలబోత… సినారె, కొసరాజు, దాశరథి రాతగాళ్లు కాగా, బాలు, ఘంటసాల, మాధవపెద్ది, ఎల్ఆర్ఈశ్వరి, సుశీల తదితరులు పాటగాళ్లు…
నాగేశ్వరరావు , వాణిశ్రీ అభిమానులకు చూడబులే . యూట్యూబులో ఉంది . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . మా నరసరావుపేటలో కాలేజి రోజుల్లో చూసా . తర్వాత టి విలో చూసినట్లు గుర్తులేదు . By the way , చిత్తూరు జిల్లా దండుమిట్ట గ్రామంలో షూటింగ్ జరిగింది . రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బేనర్లో టి లెనిన్ బాబు దర్శకత్వంలో 1972 లో వచ్చింది ఈ దత్తపుత్రుడు సినిమా .
#నాకిష్టమైన_నా_ఫొటోలు #తెలుగుసినిమాలు
ఒక కామెంట్‌గా Ramana Kumar యాడ్ చేసిన సమాచారం మరింత బాగుంది… ‘‘మాములు మూస సినిమా ఇది, కేవలం నాగేశ్వరావు కోసం రాసిన కధ, నాగేశ్వరావు స్టెప్పులకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుందామనే ప్రయత్నం.., వివిధ భారతి పుణ్యాన అప్పట్లో దాదాపు పెద్ద హీరోల సినిమా పాటలన్నీ హిట్టే.., ఈ సినిమాలో విశేషం మనసైనా చినదానా అనే పాట మధ్యలో అప్పట్లో కిషోర్ కుమార్ టైపు పాట పెట్టి, అయనలాగా యూడ్లింగ యుడి, యుడ్లుడి చేద్దాం అంటే ఘంటసాల, బాబూ అది మావల్ల కాదు అనేశారు… అప్పుడు music director చలపతిరావు దగ్గర అసిస్టెంట్ గా ఉన్న మాధవపెద్ది రమేష్ యుడ్లింగ్ బిట్ పాడించి ఆ పాటకు జత చేశారు.., ఆడ పాత్ర నవ్వులు రమొలా అనే ఆర్టిస్ట్ చేసారు…
ఇక్కడే మరికొంత కూర్పు, జతచేర్పు ఏమిటంటే…? ఆమధ్య ఇండియన్ ఐడల్ టీవీ షోలో మన విశాఖ గాయని షణ్ముఖప్రియ ఈ యూడ్లింగ్ భలే పాడి అందరినీ మెప్పించింది… అది నిజానికి అందరూ పాడలేరు, కాస్త క్లిష్టం… మన తెలుగు గాయనుల్లో కూడా ఇంకెవరూ ఇది ట్రై చేసినట్టు లేరు… అవున్లెండి, అంతటి ఘంటసాల, బాలులే వల్లకాదని వదిలేస్తే, మిగతావాళ్లెంత..? తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్‌కు హోస్ట్ మళ్లీ శ్రీరామచంద్రే కదా, తనేమైనా ట్రై చేస్తాడేమో చూడాలి… తను ఏదైనా పాడగలడు..!!
Share this Article