మనికె మగే హితే… అని ఆమధ్య, అంటే రెండుమూడేళ్ల క్రితం ఓ శ్రీలంక గాయని పాడిన పాట ఇండియాలోనూ ఓ ఊపు ఊపేసింది… 25 కోట్ల యూట్యూబ్ వ్యూస్ ఒరిజినల్ వీడియోకు… దాన్ని అనుకరించి ఇండియాలో పలు భాషల్లో వీడియోలు చేశారు… అవీ హిట్… సరే, ఇప్పుడు ఆ పాట విశేషాలు చెప్పుకోవడం కాదిక్కడ మనం… కానీ…
Ads
అరె, ఒక థమన్, ఒక డీఎస్పీయే కాదు… మన దేశీయ సంగీత దర్శకుల కన్నెండుకు పడలేదబ్బా దీనిపై అనిపించేది పలుసార్లు… ఆ అవకాశాన్ని అనిరుధ్ రవిచంద్రన్ ఒడిసిపట్టుకున్నాడు.,. అందరూ చేస్తున్న పనే కదా అనుకున్నట్టున్నాడు… ట్యూన్ దింపేశాడు దేవర సినిమా కోసం… ఈ విమర్శనే నెటిజనం హోరెత్తిస్తున్నారు…
మరీ కాపీ అనిపించకుండా… కాస్త లైట్ ఛేంజెస్ చేసుకున్నా సరే, అది ఆ పాట అనుకరణే అని రెండు పాటలూ వింటే తెలిసిపోతూనే ఉంది… రెండూ యూట్యూబ్‌లో ఉన్నాయి… మీరే పోల్చి వినొచ్చు… అక్కర్లేదు అంటే వదిలేయొచ్చు… నిజానికి ఆర్ఆర్ఆర్ తరువాత జూనియర్ సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది… ఆ రేంజ్ సినిమా కావాలి, ఆ హ్యాంగోవర్ కంటిన్యూ కావడానికి…
అందుకే జూనియర్ ఫ్యాన్స్‌కు దేవర సినిమా మీద చాలా ఆశలున్నయ్… (నిజానికి అప్పట్లో అదుర్స్ కొంత మేరకు జూనియర్‌లోని అసలు నటుడిని కొంత వెలికి తీసింది… కానీ ఇప్పటికీ జూనియర్‌ను పూర్తి స్థాయిలో ఆవిష్కరించే సినిమా పాత్ర ఏమీ రాలేదు తనకు… అదే గనుక దొరికితే ఇగరదీస్తాడు తను, అంత సత్తా ఉంది తనలో… ఆర్ఆర్ఆర్ వదిలేస్తే చాలావరకూ తను రొటీన్ ఫార్ములా ఇమేజీ బిల్డప్ సినిమాలే తీస్తూ తనలోని అసలైన నటుడిని ఏమాత్రం బయటికి రానివ్వడం లేదు… )
ఇది నందమూరి కల్యాణ్‌రామ్ సినిమా… శ్రీదేవి బిడ్డ జాన్వీకపూర్ నటిస్తోంది… అసలే కొరటాల శివ దర్శకత్వం… చుట్టమల్లె చుటేస్తాంది, తుంటరిచూపు, ఊరకే ఉండదు కాసేపు అని మొదలయ్యే ఈ సాంగ్ ‘సరస్వతీపుత్ర’ రామజోగయ్య శాస్త్రి రాశాడు… సో, అందరూ టాపర్లే… ఎటొచ్చీ ఈ పాట ఓ కాపీ అనే విమర్శతో అనిరుధ్ ఇమేజీకి మరకపడింది…
నిజానికి ఇప్పుడు సౌత్ ఇండియాయే కాదు, ఇండియాలోనే చాలా ఎక్కువ గిరాకీ, పాపులారిటీ ఉన్న సంగీత దర్శకుడు తను… విదేశాల్లో కన్సర్ట్స్ ఏర్పాటు చేస్తే బంపర్ హిట్స్ అవుతున్నాయి… ఊహించలేనంత రెవిన్యూ… అలాంటివాడు కూడా చివరకు పరాయి ఎంగిలి ట్యూన్లను తన ట్యూన్లుగా దింపేయడం బాగాలేదు… పాట పాడిన శిల్పారావు కూడా ఆ శ్రీలంక గాయని (యోహని) గొంతుతోనే పాడినట్టనిపించింది కాసేపు… ఇలాంటి పాటల్లో చెప్పుకోవడానికి సాహిత్య మెరుపులు ఏమంటాయి..? ఏమీ లేవు..!!
Share this Article