షర్మిల రాజకీయ పార్టీ ఇంకా ప్రకటించనేలేదు… పేరు కూడా పెట్టలేదు… అప్పుడే కొంత ప్రభావం కనిపిస్తోంది… ఆమె ఖమ్మం సభ చెప్పుకోదగిన రీతిలో విజయవంతం కావడమే కాదు… ఆమె ప్రభావం ఏయే పార్టీపై ఎంత ఉండనుందనే చర్చకు అప్పుడే తెరలేచింది… ప్రత్యేకించి తెలంగాణ రాజకీయాల్లో రెడ్లు అనే ఫ్యాక్టర్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది… తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ రెడ్లదే ఆధిపత్యం… తెలుగుదేశం వచ్చాక కమ్మల ప్రభావం పెరిగి, రెడ్ల ఆధిపత్యానికి, అధికారానికి బీటలు పడటం స్టార్టయింది… రాష్ట్ర విభజన తరువాత వెలమల ప్రభావం పెరిగింది… సహజమే, అధికారంలో ఉన్నారు కాబట్టి..! ఏపీలో జగన్ కారణంగా తిరిగి రెడ్ల ప్రాబల్యం నిలదొక్కుకుంది… కానీ తెలంగాణలో ఇప్పటికీ ఓ అనిశ్చితి ఆ కులంలో ఉంది… ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా… ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి బాగాలేదు… బీజేపీ ఆ నమ్మకాన్ని కలిగించలేకపోతోంది, పైగా అది కాపు కోణంలో కదులుతోంది… ఈ సందిగ్ధ స్థితిలో షర్మిల రాజకీయ రంగప్రవేశం జరిగింది… ఈ బాణం వెనుక ఎవరున్నారనేది కాసేపు వదిలేస్తే, ఆమెకు ప్రధానబలం రెడ్లు, క్రిస్టియన్లు… దీంతో ఏం జరుగుతున్నదంటే..?
కొన్ని కొత్త ప్రశ్నించే బాణాలను డైలమాలో పడేసింది షర్మిల… ఉదాహరణలు చెప్పుకుందాం…
Ads
- పీసీసీ అధ్యక్ష పదవి రాకపోతే కొత్తగా పార్టీ పెట్టుకుని, రెడ్లను ఆర్గనైజ్ చేసుకుంటూ… తెలంగాణ రాజకీయాల్లో ఓ ఫోర్స్ అవుదామని రేవంత్‌రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు… తను సొంతంగా అధికారంలోకి రాకపోయినా, రాబోయే ఎన్నికల్లో కీలక ప్లేయర్ కావాలనేది ఆశ… రెడ్లను కాపాడుకోవడంలో కాంగ్రెస్, ఆకర్షించడంలో బీజేపీ పెద్దగా ఆశాజనకంగా లేవు కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న రెడ్లు తనతో కలిసి వస్తారని అంచనా… పొలిటికల్ మ్యాథ్స్ ప్రకారం సరైన సమీకరణమే… కానీ ఇప్పుడు షర్మిల రావడం, ఆ పీసీసీ ఎటూ తేలకపోవడం, ఒకవేళ జానారెడ్డి గెలిస్తే తన పెత్తనం పెరిగే అవకాశాలుండటం… ఇలా కొత్త కోణాలు పుట్టుకొస్తూ డైలమాలో పడేస్తోంది తనను…
- కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్‌ను వదిలేశాడు… ఒక దశలో తను కూడా ఓ పార్టీ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు… బీజేపీ కూడా రమ్మంటోంది… ఒకవేళ రెడ్లు షర్మిల వైపు పోలరైజ్ అయ్యే సూచనలుంటే, తను పార్టీ పెడితే ఫాయిదా ఏమిటి..? పోనీ, బీజేపీలోకి వెళ్తే అక్కడ దక్కే ప్రాధాన్యం ఏమిటి..? రేవంత్‌తో కలిసి నడవడమా..? సొంత బాట వెతుక్కోవడమా..? డైలమా..!
- కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కొద్దిరోజులుగా కాంగ్రెస్ పట్ల అవిధేయ వ్యాఖ్యలు చేస్తున్నాడు… బీజేపీ అనుకూలత కనబరుస్తున్నాడు… ఉండాలా…? వెళ్లిపోవాలా..? తను సొంత పార్టీ ఏమీ పెట్టకపోవచ్చు… కానీ ఎటుపోవాలో తెలియని డైలమా… వెంకటరెడ్డి కలిసి వస్తాడా..? సొంతంగానే తన బాట వెతుక్కోవాలా..? రెడ్ల ప్రాబల్యం అధికంగా ఉండే పాత నల్గొండ జిల్లా మీద షర్మిల ప్రభావం ఎంతవరకూ ఉండొచ్చు..? అదీ ప్రశ్న…
- ఈటల రాజేందర్… కేసీయార్‌తో ఇక సత్సంబంధాలు తెగిపోయినట్టే కనిపిస్తోంది… ఉంటే ఉండు, పోతేపో అన్నట్టుగానే ఉంది కేసీయార్ వ్యవహారధోరణి తనతో…. ఏం చేయాలి..? సొంత పార్టీ పెట్టాలా..? పెడితే ఏమేరకు ఆర్గనైజ్ చేసుకోగలం..? తను బీసీ, తన భార్య తరఫు రెడ్డి బంధుగణం… ఉద్యమ తెలంగాణ బ్యాచు నేతల్లో ఎంతమేరకు తనతో కలిసివస్తారు..? ఉండాలా..? వదిలేయాలా అసలు..? డైలమా…
- ఆల్రెడీ ఉన్న పార్టీల్లో టీజేఎస్ కోదండరాంరెడ్డి, యువతెలంగాణ రాణి రుద్రమరెడ్డి… ఇలా కేసీయార్‌ను ప్రశ్నించే, ప్రశ్నించాలనుకునే ప్రతి ప్రత్యామ్నాయ గొంతూ రెడ్లదే దాదాపుగా… షర్మిల వెంట ఇప్పుడు చెప్పుకోదగిన నేతలు లేకపోవచ్చు… రాబోయే రోజుల్లో ఆమె కార్యాచరణ, ఆమెకు ఆదరణ ఎలా ఉంటాయో చూడాలి…
చివరగా :: మొన్న వరంగల్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగింది..? ఉద్యోగుల్లో, నిరుద్యోగుల్లో, పట్టభద్రుల్లో కేసీయార్ పట్ల వ్యతిరేకత ఉన్నా సరే… అంతిమంగా టీఆర్ఎస్సే గెలుచుకుంది… వ్యతిరేక వోటు బలంగా చీలిపోవడమే కారణం… మరి ఇప్పుడు మనం చెప్పుకున్న బాణాలన్నీ రాను రాను ఇంకా యాక్టివేట్ అయిపోతే, అది అంతిమంగా ఎవరికి ఉపయోగకరం..?!
Share this Article