ఆళ్ల మోహన్ సాయిదత్… ఈయన్ని జగన్ తన పార్టీ నిర్మాణ సలహాదారుడిగా నియమించారనే సమాచారం మనం నిన్న చెప్పుకున్నాం కదా… చదివాక జగన్ సానుభూతిపరులు, తన అభిమానులు, పార్టీ వాళ్లే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు… ఇదేం ఎంపిక, జగన్ ఇక మారడా అనేదే వాళ్ల హాహాశ్చర్యానికి కారణం…
ఎందుకంటే..? గతంలో జగన్ ఎడాపెడా సలహాదారుల్ని నియమించుకున్నాడు… అధికారంలో ఉన్నప్పుడు కొందరిని ఏవో పోస్టుల్లో అకామిడేట్ చేయాలని సలహాదారులుగా పెట్టేశాడు… మీడియా నుంచి తను కొందరికి కిరీటాలు పెట్టిన తీరు పార్టీలోనే విస్మయానికి దారితీసింది… సరే, గతం గతః … కనీసం ఇంతటి దారుణమైన ఓటమి తరువాతనైనా సరే, ఎవరు నిజంగా తనకోసం పనిచేస్తుంటారు, ఎవరు తాత్కాలిక ప్రయోజనాల కోసం తన చుట్టూ తిరుగుతున్నారు, ఎవరిని దూరం పెట్టాలి, తను ఎంపిక చేస్తున్న వ్యక్తుల బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని ఆలోచించుకోవాలి కదా…
ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం జగన్ శిబిరం నుంచి హఠాత్తుగా కొందరు మాయమైపోయారు… పారిపోయారు… జగన్ చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ పెత్తనాలు వెలగబెట్టినవారు సైతం…! ఇలాంటి విషయాల్లో చంద్రబాబు క్యాంపు కొంత తెలివిగా వ్యవహరిస్తుంది… తమను మిస్‌లీడ్ చేసేవాళ్లను, రకరకాల వ్యవహారాలతో తమను బదనాం చేసేవాళ్లను ఎప్పటికప్పుడు గుర్తించి, దూరం పెట్టేస్తుంది… కొందరినైతే అసలు దగ్గరకే రానివ్వదు…
Ads
ఎన్నికల స్ట్రాటజిస్టులు లేదా పార్టీ వ్యూహకర్తలు… మొదట్లో ఐప్యాక్… ప్రశాంత్ కిషోర్ ఏది చెబితే అది చేశాడు జగన్… మొదట్లో వోకే… తరువాత పీకే ఆ క్యాంపు నుంచి దూరమయ్యాడు… జగన్ ఓడిపోబోతున్నాడని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు, సరే, జగన్‌కూ తనకూ ఎక్కడో చెడింది కాబట్టి అలా మాట్లాడుతున్నాడు అనుకున్నారందరూ… తనతోపాటు గతంలో పనిచేసిన ఒడిశా రిషిరాజ్ టీం జగన్‌కు పనిచేసింది… ప్రభుత్వ విభాగాల్లో కూడా కొందరిని నియమించి వాళ్లతో వర్క్ చేయించుకున్నారు…
చివరకు వాళ్లు చేసిందేమిటి..? అడ్డదిడ్డం సర్వేలతో జగన్‌ను మిస్‌లీడ్ చేస్తే… ఎడాపెడా మార్పులు చేస్తూ పోయాడు జగన్… అన్ని వికటించి, అదుగో ఆ ఫలితం వచ్చింది… అదే పీకే చంద్రబాబుకు దగ్గరయ్యాడు… ఐనా సరే, చంద్రబాబు చాన్నాళ్లుగా తనకు వర్క్ చేస్తున్న రాబిన్ శర్మను వదులుకోలేదు… లోకేష్ కోసం కూడా కొన్ని టీమ్స్ పనిచేశాయి… అదుగో అలా పనిచేసిన వాళ్లలో ఈ మోహన్ సాయిదత్ కూడా…
ఏదో తేడా కొట్టింది… లోకేష్ క్యాంపు తనను నిష్కర్షగా వదిలించుకుంది… మరి తను జగన్‌కు ఏకంగా పార్టీ నిర్మాణ సలహాదారు ఎలా అయ్యాడు..? అసలు పార్టీ నిర్మాణం, రెగ్యులర్ పార్టీ కేడర్ వర్క్ పట్ల జగన్‌కు పెద్ద ఇంట్రస్ట్ ఉండదు… మరి ఈ సలహాదారు ఏం చేయాలి..? ఎవరు తనను రిఫర్ చేశారు..? సరే, తను గతంలో బీజేపీ నేతలకూ పనిచేశాడు… పార్టీ గానీ, తను గానీ ఆత్మవిమర్శ, గత పనితీరు సమీక్ష, లోపాల నిర్ధారణ, చికిత్స, దిద్దుబాటు వంటి కీలకదశల్లోకి ప్రయాణించాల్సి ఉన్నప్పుడు ఇలాంటి సలహాదారులు జగన్‌కు ఏ దారులు చూపిస్తారు..?
శివ రాచర్ల వంటి ప్రొ-జగన్ థింకర్స్, వర్కర్స్ ఉదాహరణ తీసుకుంటే… వాళ్లు ఎక్కడా జగన్‌తో కలిసి ఫోటోలు దిగరు, పార్టీ కోసం వర్క్ చేస్తున్నట్టు కనిపించరు, కానీ అలాగే ఉండిపోతారు, ఎవరెవరో జగన్ చుట్టూ చేరిపోతారు, ఏవేవో పోస్టుల్లో దూరిపోతారు… ఇలాంటి విషయాల్లో అసలు జగన్‌ను ఎక్కువగా ఎవరు మిస్‌లీడ్ చేస్తుంటారనేది అనూహ్యం… సోషల్ మీడియా పేరిట కోట్లకుకోట్లు ఖర్చుపెట్టాడు… కానీ ఎప్పుడైనా ఆ సొమ్ము ఎటుపోతుందో, ఎలా ఖర్చవుతుందో ఒక్కసారైనా సమీక్షించుకున్నాడా జగన్..? ఎవరు నిజంగా లబ్ది పొందింది..? తన మీడియా పీఆర్ ఎలా పనిచేసిందో వెనక్కి తిరిగి చూసుకున్నాడా..? సరే, పవర్‌లో ఉన్నప్పుడు అన్నీ సజావుగా కనిపిస్తుంటాయి, వైనాట్ 175 అనే మాటలూ పలికిస్తాయి..? ఇప్పటికైనా ఆత్మచింతన అవసరం లేదా..? (మీడియా, సోషల్ మీడియా, స్ట్రాటజిస్టులు, పీఆర్ టీమ్స్ పేర్లు ఏవైనా సరే…)
మీడియా… గతంలో జగన్‌ను ఆడిపోసుకున్న వ్యక్తుల్ని సైతం జగన్ తన క్యాంపుల్లోకి తీసుకుని, మంచి జీతాలు, మంచి పోస్టులు కట్టబెట్టాడు… వాళ్లు తెలుగుదేశం క్యాంపులో ఉండి, ఏ కారణంచేతో ఆ క్యాంపుకి దూరమైతే… జగన్ తెలుగుదేశం బాధితులు అనే సూత్రీకరణతో చేరదీశాడు… అదేం విధానమో అర్థం కాదు… తనను నిజాయితీగా అభిమానించేవాళ్లు, తన కష్టకాలంలోనూ తనతో ఉన్నవాళ్లు ఎవరు, తనకు అనవసరంగా రిఫర్ చేయబడుతున్నవాళ్లు ఎవరు, తను ఎవరిని గుడ్డిగా నమ్మేస్తున్నాడు అనేది జగన్ ఎప్పటికప్పుడు స్వయంగా సమీక్షించుకోవాల్సిందే… ఆళ్ల మోహన్ సాయిదత్ ఎంపిక మరోసారి ఆ అవసరాన్ని గుర్తుచేస్తోంది..!!
Share this Article