.
Subramanyam Dogiparthi ….. యుద్ధ భూమి… మరో దుష్టశిక్షణ శిష్టరక్షణ సినిమా ఇది . మిలిటరీ ఆఫీసర్ అయిన చిరంజీవి శెలవులకు స్వగ్రామం పులిగడ్డకు వచ్చి ఆ గ్రామ ప్రజలను దోచుకుతింటున్న మోహన్ బాబు అఘాయిత్యాలకు గ్రామంలోనే ఉండి అతని ప్రజా ద్రోహ , దేశ ద్రోహ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయటమే సినిమా కధాంశం .
మరి ఈ పులిగడ్డ అవనిగడ్డ వద్ద ఉన్న పులిగడ్డ ఒకటేనా కాదా అనేది తెలియదు . అదెలా ఉన్నా ఈ మోహన్ బాబుకు మరో దుష్ట తమ్ముడు కూడా ఉంటాడు . వీళ్ళ ధన సహాయంతో మంత్రి పదవిని దక్కించుకున్న నూతన్ ప్రసాద్ , అతనితో పాటు మరో రాజకీయ నాయకుడు రాళ్ళపల్లి , వీరందరితో పాటు దేశ రక్షణ రహస్యాలను విదేశాలకు అమ్మే శక్తికపూర్ , వారందరితో పాటు అల్లు రామలింగయ్య దుష్ట సమూహం .
Ads
గ్రామంలో పది మంది తరఫున మాట్లాడే మంచివాడుగా మురళీమోహన్ , ఈయన భార్యగా శుభ , వారిద్దరి కొడుకుగా మాస్టర్ రాజేష్ . ఈ మురళీమోహన్ తమ్ముడే చిరంజీవి . అన్నావదినలు అంటే తల్లిదండ్రులతో సమానం . వీరందరితో పాటు ఊరంతా గలగలలాడించే కుమారిగా విజయశాంతి ఫుల్ గ్లామర్ పాత్రలో అదరగొట్టేసింది .
సినిమా అంతా చిరంజీవి , విజయశాంతి డ్యూయెట్లు , విలన్లను చితగ్గొట్టే హీరోచిత ఫైట్లు . చాలా ఏక్షన్ సీన్లు మారిషస్ లో షూట్ చేసారు . కొన్ని పాటలు కూడా . లొకేషన్లు బాగుంటాయి .
విలనుగా మోహన్ బాబు నటన విలక్షణంగా ఉంటుంది . ప్రతీ సినిమాకు ఏదో ఒక ఊతపదం ఉంటుంది ఆయనకు . ఈ సినిమాలో అద్గదీ అదీ నా పాయింట్ అని బ్రహ్మాండంగా నటించారు . హిందీ నటుడు శక్తికపూర్ నటించిన రెండో తెలుగు సినిమా ఇది . పెద్ద రోల్ ఏమీ ఉండదు .
మరో విలన్ నూతన్ ప్రసాద్ . రాష్ట్ర మంత్రి . చాలామంది రాజకీయ నాయకులలాగానే జనగణమన పాడలేక పోతుందీ మంత్రి పాత్ర . ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే అనుకోండి . ఊళ్లో జనం మంత్రిని ఆహ్వానించి నులక మంచం , పసుపు , కుంకుం , గాజులు , పూలు పెట్టే సీన్ కాస్త అసహజంగా , అసాధ్యంగా అనిపిస్తుంది . జనం అంత ధైర్యం చేసి ప్రజాప్రతినిధులను నిలేస్తే ఇంకేం కావాలి !? సినిమాల్లో లాజిక్ ఉండదు కదా !
ఇతర ప్రధాన పాత్రల్లో ముచ్చెర్ల అరుణ , సుత్తి వేలు , జగ్గయ్య , సుధాకర్ , ప్రసాద్ బాబు , చిట్టిబాబు , చిడతల అప్పారావు , పేకేటి తదితరులు నటించారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో , తార నృత్య దర్శకత్వంలో పాటలన్నీ రాఘవేంద్రరావు స్టైల్లో ఉంటాయి .

చిరంజీవి , విజయశాంతిలకు అయిదు డ్యూయెట్లు . వయసో నమః వరసో యమహా , గాలొచ్చి తాకిందమ్మ ఈపక్క , అబ్బబ్బా చందమామ లాంటి పిల్ల సందెకాడ తారసిల్లి సన్నజాజులిచ్చి పొమ్మంటే , గాలి గాలి సందె గాలి లాలి పాడనా , వీరామగధీరా రారా రసవీరా అంటూ సాగుతాయి ఈ డ్యూయెట్లు .
అన్ని డ్యూయెట్లు చిరంజీవి అభిమానులకు కన్నుల పండగే . ఈ అయిదు కాకుండా చివర్లో చిరంజీవి , విజయశాంతి మారు వేషాల్లో వచ్చి ఓ గ్రూప్ డాన్స్ వేస్తారు . ఏంటీ ఎప్పుడు ఎక్కడ ఎలా అంటూ సాగుతుంది . విజయశాంతి కాస్ట్యూమ్స్ అదిరిపోతాయి . డాన్స్ కూడా బాగుంటుంది .
ఫొటోగ్రఫీ డైరెక్టర్ కె యస్ ప్రకాషుని అభినందించవలసిందే . పాటల్ని వేటూరి , జొన్నవిత్తుల వ్రాయగా బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర శ్రావ్యంగా పాడారు . యం వి యస్ హరనాధరావు డైలాగులు పదునుగానే ఉంటాయి .
రాఘవేంద్రరావు సోదరుడు కె కృష్ణమోహనరావు నిర్మాత . రాఘవేంద్రరావు , చిరంజీవి , విజయశాంతి లెవెల్లో ఆడినట్లు లేదు 1988 నవంబర్లో వచ్చిన ఈ సినిమా . యూట్యూబులో ఉంది . చిరంజీవి అభిమానులు ఇంతకుముందు చూడనట్లయితే ట్రై చేయవచ్చు . Totally action-oriented , romantic , feel good movie
నేను పరిచయం చేస్తున్న 1196 వ సినిమా .
#తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article