గత కొద్దికాలంగా స్టీరియో టైపిక్ సాంప్రదాయ పద్ధతులను బ్రేకు చేస్తూ.. కొన్ని కంపెనీల సీఈవోలు తమ వ్యాపారాల్ని అంచనా వేయడానికి.. జనంలో ఉన్న టాక్ గురించి తెలుసుకోవడానికి వారే స్వయంగా కార్మికుల అవతారాలెత్తుతున్నారు. అయితే, ఇదిప్పుడే కొత్తేం కాకపోవచ్చు. మన చిన్ననాట కథల్లో కూడా ఫలానా రాజు తమ రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మారువేషంలో తిరిగినట్టన్నమాట!
ఎలాంటి హోటల్ ఇండస్ట్రీనే లేకుండా… ఒక చిన్న ఐడియాను విస్తరించి ఇప్పుడు స్టార్టప్ వ్యాపార రంగంలో రారాజుగా ఎదిగి.. ఇంట్లో వంటయ్యే సమయం కంటే తక్కువ నిడివిలో ఏ రుచంటే ఆ రుచిని ఇంటికందించే జొమాటో సీఈవో కూడా ఆ అవతారమెత్తాడు గనుకే ఈ చర్చంతా!
గురుగ్రామ్ లో జొమాటో డెలివరీ వర్కర్స్ గా బైకుపై ఇద్దరు కలిసి వెళ్తున్నారు. కానీ, వారెవ్వరనేది ఎవ్వరి దృష్టినీ పెద్దగా ఆకర్షించలేదు. కానీ, తీరా చూస్తే వారిద్దరూ జొమాటో కంపెనీ సీఈవో దీపీందర్ గోయల్, భార్య గ్రేసియా గోయల్.
Ads
ఆ పిక్చర్స్ గోయల్ దంపతుల జంట ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో.. సీఈవో డెలివరీ బాయ్ గా మారిన కథ వైరలైంది.
ముఖ్యంగా వారు షేర్ చేసిన ఫోటోలను పరిశీలిస్తే దీపీందర్ గోయల్ బైక్ నడుపుతుంటే… భార్య గ్రేసియా మోబైల్ లో డెలివరీ చేసే పాయింట్ లొకేషన్ ఎక్కడో వెతుకుతోంది. రెండు రోజుల కోసం ఆర్డర్స్ ను సప్లై చేసేందుకు బయటకు వెళ్లామంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలపై ఓ కామెంట్ ను కూడా జత చేయడంతో ఈ విషయం కాస్తా వెలుగులోకొచ్చింది.
నెటిజన్స్ నుంచి వ్యక్తమైన భిన్న స్పందనలు!
చాలామంది నెటిజన్స్ సీఈవో స్థాయిలో ఉండి హాయిగా కాలు మీదు కాలు వేసుకుని కంపెనీని నడిపించక… అదీ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న సమయంలో ఇలా డౌన్ టూ ఎర్త్ అన్నట్టుగా రోడ్లపైకి రావడం బాగుందంటూ ప్రశంసలు గుప్పించారు. ఇక మరికొందరైతే.. ఇప్పటికైనా జొమాటో డెలివరీ కార్మికుల కష్టాలను తెలుసుకునేందుకు వచ్చి ఉంటారని స్పందించారు. మరికొందరు అలా వారి కష్టాలను ఇప్పటికైనా తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత సీఈవో దంపతులదేనంటూ కామెంట్స్ పోస్ట్ చేశారు. అసలు ఆఫీసులో మిమ్మల్ని కలవడానికే మేం ఒకింత ఉలక్కిపడతాం.. అలాంటిది మీరే ఇలా బయటకు కార్మికుల వేషాలు కట్టి రావడమేంటంటూ మరొకరు స్పందించారు. ఇలా రకరకాల భిన్న స్పందనల సమాహారంగా మారాయి.. గోయల్ దంపతుల ఇన్ స్టా పోస్ట్ అకౌంట్స్.
దీపీందర్ గోయెల్ ప్రస్థానం!
2008లో దీపీందర్ గోయల్ జొమాటోను ప్రారంభించాడు. ఫోర్బ్స్ ప్రకారం 1.7 యూఎస్ డాలర్స్ నెట్ వర్త్ కల్గి ఉన్న సీఈవోగా, కో-ఫౌండర్ గా ఇప్పటికే వ్యాపారాభివృద్ధిలో దూసుకుపోతున్నాడు దీపిందర్. మెక్సికన్ మాజీ మాడల్ అయిన గ్రేసియా మునోజ్ ను ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నాడు దీపిందర్.
తన ఫుడ్ డెలివరీ వ్యాపారాన్ని ప్రారంభించేకంటే ముందు ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేసిన దీపీందర్ ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి జొమాటోతో ఓ సక్సెస్ ఫుల్ వ్యాపారిగా ఎదిగాడు. ఇప్పుడు బిలియనీర్ల ఎలైట్ క్లబ్ లోనూ దీపీందర్ పేరు చేరింది. జొమాటోలో 4.2 శాతం వాటాతో ఈ వ్యాపారవేత్త నికర విలువ అమాంతం పెరిగిపోయింది. గత రెండేళ్లల్లోనే జొమాటో షేర్స్ 300 శాతం వృద్ధి రేటుతో పైపైకెగి ఎగబాకాయంటే.. ఇప్పుడు జొమాటో జమానా ఏ స్థాయిలో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.
మొత్తమ్మీద సీఈవో, కో ఫౌండరైన దీపీందర్, భార్యతో పాటు డెలివరీ బాయ్స్ అవతారాలెత్తి ఇప్పుడు మరోసారి వార్తల్లో చర్చయ్యారు….. (రమణ కొంటికర్ల)
Share this Article