.
Murali Buddha …… బాబును భయపెట్టిన ఇజ్రాయిల్… జర్నలిస్ట్ జ్ఞాపకాలు- ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశం … అయన ఉపన్యాసం రొటీన్ గా సాగుతోంది … ఎన్నోసార్లు చెప్పిన విషయాలే చెబుతుండడం వల్ల పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు ఎప్పటిలాగే …
కొత్త విషయాలు లేవు . చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో ఇజ్రాయిల్ టెక్నాలజీతో వ్యవసాయం చేయడాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టిన రోజులు అవి . బాబు రొటీన్ ఉపన్యాసంలో తాను ఇజ్రాయిల్ పర్యటించనున్నట్టు చెప్పారు . అప్పటికే ఇజ్రాయిల్ టెక్నాలజీతో వ్యవసాయం సాగుతున్నందున అందరూ మామూలుగానే విన్నారు .
Ads
అప్పుడు బీబీసీ రేడియోకు ఉర్దూ రిపోర్టర్ గా ఉన్న ఉమర్ ఫరూఖ్ ‘‘మీరు ఇజ్రాయిల్ ఎలా వెళతారు ? మన దేశం పాలస్తీనాకు అనుకూలంగా ఉంది . ఇజ్రాయిల్ ఎలా వెళతారు..?’’ అని ప్రశ్నించేసరికి బాబు ఖంగుతిన్నారు . పక్కనున్న అధికారులతో మెల్లగా మాట్లాడారు . వాళ్ళు ఏం చెప్పారో వినబడలేదు కానీ ఇజ్రాయిల్ వెళితే మైనారిటీ ఓటర్లకు దూరం అవుతారు అనే భయం పట్టుకుంది . అధికారులతో కొద్దిసేపు మెల్లగా మాట్లాడిన తరువాత అటూ ఇటూ కాకుండా తన ఇజ్రాయిల్ పర్యటన లేదు అన్నట్టు సూచన ప్రాయంగా చెప్పారు .
****
అంతమంది ఉన్నప్పుడు ఇతరులకు వినపడకుండా బాబు ఎలా మాట్లాడారు అని సందేహం రావచ్చు . 95 ప్రాంతంలో టీడీపీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాణిక్ రెడ్డి ఉండేవారు . మెదక్ జిల్లాకు చెందిన నాయకుడు . జిల్లాలో పరిచయం కావడం వల్ల బాగా పరిచయం . బాబు ముఖ్యమంత్రి అయ్యాక రోజూ తన పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యేవారు .
ఆ సమయంలో బాబుకు ఫోన్ వస్తే మాట్లాడేవారు కానీ ఎదురుగా కూర్చున్న మాకు ఎవరితో మాట్లాడారు , ఏం మాట్లాడారో కూడా తెలిసేది కాదు . కావాలంటే మీరు ఓసారి గమనించి చూడండి, మీరు ఎదురుగా ఉన్నప్పడు ఎవరికైనా ఫోన్ వస్తే ఎవరి నుంచి వచ్చింది , విషయం ఏమిటీ అనేది ఎంతో కొంత అర్థం అవుతుంది . కానీ బాబుకు కాల్ వస్తే కొన్ని వందలసార్లు అక్కడే ఉన్నాను గానీ, ఎవరి నుంచి కాల్ వచ్చిందో , విషయం ఏమిటో అస్సలు అర్థం కాదు అని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు .
అనుమానం ఉంటే ఓటుకు నోటు వీడియో చూడండి . కట్టేకొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది . ఎవరితో మాట్లాడాడు , ఏం మాట్లాడాడు అనేది అర్థం కాదు . మైకు ముందు గంటల తరబడి మాట్లాడే బాబు ఫోన్ లో మాత్రం చిక్కడు దొరకడు అన్నట్టు మాట్లాడుతారు . రాజకీయాల్లో ఉన్నప్పుడు, అందులోనూ అధికారంలో ఉన్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త అవసరం … ఈ రోజుల్లో టెక్నాలజీ మరీ పెరిగిపోయింది . అందరి బండారాలు బయటపెట్టే న్యూస్ ఛానల్స్ ఓనర్ల గూడుపుఠాణిలే బయటపడుతున్న రోజులివి .
***
ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేదు కానీ పత్రికల్లో ఇందిరాగాంధీ – పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ యాసర్ అరాఫత్ ఫోటోలు , వారి వార్తలు ప్రముఖంగా వచ్చేవి . అరాఫత్ ఆజానుబాహుడు అన్నట్టుగా ఉండేవారు . ప్రత్యేకమైన దుస్తులతో మీడియా ఫోటోలకు ప్రత్యేకంగా ఉండేవారు .
ఇజ్రాయిల్ , పాలస్తీనా వివాదం గురించి అప్పుడు తెలియదు కానీ ఇందిరాగాంధీ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేశ మీడియా అరాఫత్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది . బాబు హయాంలో అమెరికా అధ్యక్షుడు వస్తే మీడియాలో ఎంత ప్రాముఖ్యత లభించేదో అరాఫత్ కు అంత ప్రాముఖ్యత లభించేది . 1948లో ఇజ్రాయిల్ స్థాపనకు వ్యతిరేకంగా ఇండియా ఓటు వేసింది . 1992 వరకు ఇజ్రాయిల్ తో మన దేశం కనీసం పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకోలేదు .
1992లో పివి నరసింహారావు హయాంలో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది . అప్పటివరకు ఇండియా పాలస్తీనాకు పూర్తి మద్దతుగా నిలిచింది . 1999లో వాజపేయి హయాంలో సమావేశాలు జరిగాయి . నరేంద్ర మోడీ హయాంలో ఇజ్రాయిల్ , ఇండియా మధ్య సంబంధాలు బాగా బలపడ్డాయి . ఇజ్రాయిల్ లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ . ఇటీవల ఇజ్రాయిల్ పర్యటించి అక్కడి పార్లమెంట్ లో ప్రసంగించారు .
***
ఇజ్రాయిల్ పాలస్తీనా వివాదం గురించి , మైనారిటీ ఓట్లపై పడే ప్రభావం వంటి అంశాలు ఏ మాత్రం తెలియక కేవలం ఆధునిక వ్యవసాయ పద్దతులను తెలుసుకోవడం కోసమే బాబు ఇజ్రాయిల్ వెళ్ళాలి అనుకున్నారు . అదే విషయం మీడియా సమావేశంలో చెప్పగానే ఉర్దూ బిబిసి విలేకరి ప్రశ్నతో ఆమ్మో ఇదేదో మెడకు చుట్టుకునేట్టుగా ఉందని ఇజ్రాయిల్ పర్యటన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు . (ఇజ్రాయిల్ ఆధునిక వ్యవసాయం పేరుతో కుప్పంలో ఓ ప్రయోగం చేశాడు చంద్రబాబు అప్పట్లో)…
ఇప్పుడు బాబు ఎన్డిఏ కూటమిలో ఉన్నారు . బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు . ఇజ్రాయిల్ వెళ్ళాలి అనే కోరికను మూడు దశాబ్దాల తరువాత తీర్చుకొనే అవకాశం లభించింది . యుద్ధం ముగిసిన తరువాత భారత బృందం ఇజ్రాయిల్ పర్యటించే అవకాశం లేకపోలేదు .
ఇండియా – పాక్ మధ్య జరిగిన రెండు యుద్ధాల్లో ఇరాన్ పాక్ కు అండగా నిలిచింది . ఇండియా పాలస్తీనాకు అండగా నిలిచినా , ఇజ్రాయిల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా 1948 లో ఇండియా ఓటు వేసినా పాక్ తో జరిగిన యుద్ధాల్లో ఇజ్రాయిల్ ఇండియాకు సహకరించింది .
ప్రపంచంలో ఎక్కడా ఆశ్రయం దొరకనప్పుడు, శరణార్థులుగా వచ్చిన యూదులకు వందేళ్ల క్రితం ఇండియా ఆశ్రయం ఇవ్వడంతో వాళ్ళు ఇప్పటికీ ఇండియాను అభిమానిస్తారు . కాలం మారింది, ఇప్పుడు ఎవరికైనా తమ దేశ ప్రయోజనాలు ముఖ్యం కావాలి . బుద్దా మురళి
Share this Article