.
కొత్తగూడెం కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నిక కూడా ఓ ఆసక్తికరమైన క్రికెట్ మ్యాచ్ వంటిదే… ఇందులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సీపీఐ కూనంనేని సాంబశివరావు… విజేత సీపీఐ పార్టీ… మేయర్ గణేష్ స్టోరీతోపాటు సాంబశివరావు కెరీర్ కూడా ఆసక్తికరమే… గణేష్ వృత్తిారీత్యా ఆటో డ్రైవర్… కూనంనేని గతంలో జర్నలిస్టు…
మిత్రుడు Mohammed Rafee పంచుకున్న వివరాలు ఇంట్రస్టింగు… ముఖ్యాంశాల్లోకి వెళ్తే… ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో సైతం కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నిక ఒక రికార్డు! విజయవాడకు సిపిఐ పార్టీ నుంచి మేయర్లు అవడం సహజం! ఇప్పటికి ఐదు సార్లు అక్కడ మేయర్ గా సిపిఐ పార్టీ జెండా ఎగురవేసింది!
Ads
కానీ తెలంగాణలో సిపిఐ పార్టీకి మేయర్ విజయం ప్రప్రథమం! అందునా కార్పొరేషన్ అయిన కొత్తగూడెంలో తొలి మేయర్ గా ఎర్ర జెండా రెపరెపలాడించే అదృష్టం లభించింది! ఇటీవలే ఖమ్మంలో సీపీఐ పార్టీ శత జయంతి ఉత్సవాలు జరుపుకున్న నేపథ్యంలో ఇదొక గొప్ప నజారానాగా భావించాలి.
ఆటోడ్రైవర్ మూడ్ గణేష్ కొత్తగూడెం మేయర్ గా ఎన్నికయ్యాడు… 36 ఏళ్ల యువ రాజకీయవేత్త! కొత్తగూడెం మేయర్ పీఠం ఎస్టీ వర్గానికి కేటాయించడంతో గణేష్ కు కాలం కలసి వచ్చింది. గతంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్ గా గెలిచిన గణేష్ ఆటోడ్రైవర్ల యూనియన్ నేతగా గుర్తింపు పొందాడు… అనంతరం సిపిఐ పార్టీలో చేరాడు…
కొత్తగూడెం ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ అధికార పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తున్న ఒకే ఒక్క నేత కూనంనేని సాంబశివరావు అనుచరుడుగా గుర్తింపు పొందాడు గణేష్! ఈసారి కార్పొరేటర్ అయి ఏకంగా మేయర్ సీట్లో కూర్చున్నాడు ఆటో డ్రైవర్ గణేష్!
తెలంగాణలో ఎర్ర పార్టీలు బలహీనపడుతున్న పరిస్థితుల్లో… కూనంనేని సాంబశివరావు మిగతా నేతల కన్నా కాస్త భిన్నం! పార్టీ సిద్ధాంతాలను కాపాడుతూనే కాస్త లౌక్య రాజనీతి కూడా ప్రదర్శిస్తుంటాడు..! ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు పాత్రికేయుడే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పొన్నూరుకు చెందిన సాంబశివరావు డెస్క్ జర్నలిస్టుగా విజయవాడ విశాలాంధ్రలో ఉద్యోగం ప్రారంభించాడు… కొంతకాలం తరువాత విలేకరిగా కొత్తగూడెం బదిలీ అయ్యాడు… ఇక అక్కడే సెటిలై స్థానిక నేతగా మారిపోయాడు… నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టి ఆ పార్టీకి తెలంగాణ చీఫ్ అయ్యాడు!
గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో సిపిఎమ్ వెనకడుగు వేసినా సిపిఐ అడుగు మాత్రం ముందుకే వేయించాడు! ఫలితంగా కొత్తగూడెంలో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు… ఇప్పుడు జరిగిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లోను అధికార కాంగ్రెస్ పార్టీతో పొత్తు కొనసాగిస్తూనే కొత్తగూడెంలో మాత్రం కొత్త రాజకీయాలకు తెరలేపాడు..!
ఇక్కడ అసలు రాజకీయం ఏమిటంటే… పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన ప్రతిపాదనలు కూనంనేనికి నచ్చలేదు, పొత్తు కుదరలేదు… దాంతో విడిగానే పోటీ చేయాల్సి వచ్చింది… పొత్తులో భాగంగా కూనంనేని 20 సీట్లు అడిగాడు… కుదరదంటే కుదరదు, 15 కన్నా ఎక్కువ ఇచ్చే సమస్యే లేదంది కాంగ్రెస్… దాంతో కొత్తగూడెంలో పొత్తు విఫలమైంది…
చివరకు ఏమైంది..? సీపీఐ బలంగా పోటీపడింది… 20 ఇస్తే చాలు అన్న సీపీఐ తనే సొంతంగా 22 గెలుచుకుంది… కాంగ్రెస్ కూడా అదే సంఖ్యలో గెలుచుకుంది… స్వతంత్ర అభ్యర్థులు ఆరుగురు, బిఆర్ఎస్ అభ్యర్థులు ఎనిమిది చోట్ల గెలుపొందారు…
ఎలాగూ ఇక్కడ కాంగ్రెస్‌తో పొత్తు లేదు కదా, ఓ పాచిక విసురుదాం అనుకున్న కేటీయార్ ‘కలిసి రండి, మీకు మా మద్దతు ఇస్తాం’ అని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు… గతంలో ఇదే సీపీఐ పట్ల బీఆర్ఎస్ వైఖరి తెలిసిందే కదా… పైగా రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తున్నప్పుడు ఒక్క కొత్తగూడెంలో బీఆర్ఎస్ మద్దతు తీసుకోవడం అనైతికం అవుతుంది… అందుకే ఇక్కడ కూడా సాంబశివరావు చక్రం తిప్పాడు…
కెటిఆర్ మద్దతు ఇస్తానన్నా సుతారంగా తిరస్కరించాడు… ఏం చేద్దామో మీరే చెప్పండంటూ బాల్ రేవంత్ రెడ్డి కోర్టులోకి విసిరేశాడు… రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి, మొదటి రెండున్నరేళ్లు మీకు మేయర్, తరువాత రెండున్నరేళ్లు మాకు అనేశాడు… డన్, డీల్ వోకే… సీపీఐ మద్దతు లేకపోతే కాంగ్రెస్ కూడా మేయర్ సీటు గెలుచుకోలేదు కదా… సో, ఇలా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌పై ఎర్రజెండా రెపరెపలాడింది… ఓ ఆటో డ్రైవర్ మేయర్ కుర్చీలో ఆసీనుడయ్యాడు… శుభం…
నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి... అన్నగారి రూటు వాడ్ని, న్యాయమైన రేటు వాడ్ని, ఎదురులేని ఆటగాడ్ని, మచ్చలేని మనసు వాణ్ణిరా... నేను అందరికీ సొంత వాణ్ణిరా....... ఇది రాస్తున్నంతసేపూ 1995 లో విడుదలైన హిట్ సినిమా రజినీకాంత్ బాషాలోని ఈ పాట మెదడులో గిర్రున తిరుగుతూనే ఉంది...
Share this Article