.
ఎంపీటీసీ, జెడ్పీటీసీల వ్యవస్థనే రద్దు చేసిపారేస్తే..?! రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే ఆలోచనతో ఉందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది… నిజంగా అది సాధ్యమేనా..? పొలిటికల్ సర్కిళ్లలో ఒకింత చర్చనీయాంశమే… సర్పంచుల ద్వారా ఎంపీపీ, ఎంపీపీల ద్వారా జిల్లా పరిషత్ అధ్యక్షుడికీ పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా ఆల్రెడీ పంచాయత్‌రాజ్ శాఖను ఆదేశించారనీ ఆ వార్త చెబుతోంది…
నిజం… ఈ చర్చ ఇప్పటిది కాదు… ఈ వ్యవస్థ ఏర్పడిన దగ్గర నుంచీ ఉన్నదే… MPTC… Mandal Parishad Territorial Constituency (మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం)…. ZPTC…: Zilla Parishad Territorial Constituency (జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం)… సర్పంచులు వేరు, వాళ్ల పంచాయతీల పాలకవర్గాలకు బాసులు… కానీ ఎంపీటీసీలు వేరు, ప్రతి మండలాన్ని కొన్ని ఎంపీటీసీ స్థానాలుగా విభజించి, దానికి ఎన్నికలు నిర్వహిస్తారు…
Ads
సేమ్, ఒక మండలాధ్యక్షుడు అంటే ఆ మండలానికి అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి బాసు… అదే మండలానికి సమాంతరంగా జెడ్పీటీసీ ఉంటాడు… మరి ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏం చేస్తారయ్యా అంటే..?
ఎంపీటీసీలు ఎంపీపీకి వోటేస్తారు… జెడ్పీటీసీలు జెడ్పీ అధ్యక్ష ఎన్నికలో వోటేస్తారు… మండల, జిల్లా సమావేశాల్లో పాల్గొని తమ ప్రాంతానికి తగిన నిధులు, పనుల గురించి గళమెత్తడానికి, రకరకాల శాఖల విధుల్ని, పనితీరును సమీక్షించే అధికారం ఉంది.., స్టాండింగ్ కమిటీల్లో సభ్యులుగా ఉండొచ్చు… కానీ పంచాయతీలకే నేరుగా నిధులొస్తున్నాయి… ఎంపీపీ, జెడ్పీలకు నిధుల ప్రవాహం తగ్గిపోయి… ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ నామమాత్రమై పోయింది…
వార్డు సభ్యుడు, సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీ… ఇది చాలదా..? మళ్లీ ఈ సమాంతర వ్యవస్థ దేనికి అనేది చాన్నాళ్లుగా ఉన్న చర్చే… కానీ స్థానిక సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పిస్తూ 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ వ్యవస్థను… ఇది ఏప్రిల్ 24, 1993 నుండి అమల్లోకి వచ్చింది… ఈ చట్టం ద్వారానే దేశవ్యాప్తంగా మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ (గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్) చట్టబద్ధమైంది…
కేంద్రం ఈ చట్టాన్ని రద్దు చేయగలదా? 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థ రాజ్యాంగంలో భాగమైంది (Article 243)… కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక సాధారణ ఆర్డర్ లేదా చట్టం ద్వారా దీన్ని రద్దు చేయలేదు… రాజ్యాంగ సవరణను మార్చాలంటే మళ్లీ రాజ్యాంగ సవరణే మార్గం... దీనికి పార్లమెంటులో రెండింట మూడొంతుల మెజారిటీతో పాటు, కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా అవసరం…
ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నా సరే, ఈ సంక్లిష్టమైన ప్రక్రియను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపడుతుందా..? డౌటే..!! కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా వెళ్లడానికి కాంగ్రెస్ హైకమాండ్ వోకే అంటుందా..? డబుల్ డౌటే..!!
రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకోగలదా? రాష్ట్రాలకు ఈ విషయంలో పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయి…
-
వ్యవస్థను రద్దు చేయలేవు…: రాజ్యాంగం ప్రకారం జనాభా 20 లక్షల కంటే ఎక్కువ ఉన్న ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా మూడంచెల వ్యవస్థ ఉండాలి… కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం MPTC/ZPTC వ్యవస్థను పూర్తిగా రద్దు చేయలేదు…
-
నిర్వహణలో మార్పులు…: ఎన్నికలు ఎప్పుడు జరపాలి, రిజర్వేషన్లు ఎలా ఉండాలి అనే అంశాలపై రాష్ట్రాలు చట్టాలు చేసుకోవచ్చు… కానీ వ్యవస్థను తొలగించే అధికారం రాష్ట్రాలకు లేదు…
గతంలో ఏవైనా రాష్ట్రాలు ఇలాంటి ప్రయత్నం చేశాయా? స్థానిక సంస్థల అధికారాలను తగ్గించడానికి లేదా ఎన్నికలను వాయిదా వేయడానికి కొన్ని రాష్ట్రాలు ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి…
-
హర్యానా & రాజస్థాన్…: స్థానిక సంస్థల అభ్యర్థులకు కనీస విద్యా అర్హత ఉండాలని గతంలో నిబంధనలు పెట్టాయి… ఇది వ్యవస్థను రద్దు చేయడం కాకపోయినా, ప్రాతినిధ్యాన్ని ప్రభావితం చేసే ప్రయత్నంగా విమర్శలు వచ్చాయి…
-
ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం)…: 1980వ దశకంలో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాత సమితి వ్యవస్థను రద్దు చేసి, మండల వ్యవస్థను ప్రవేశపెట్టాడు… అయితే అది 73వ రాజ్యాంగ సవరణ కంటే ముందు జరిగిన మార్పు…
-
చాలా రాష్ట్రాలు (తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటివి) వివిధ కారణాలతో స్థానిక ఎన్నికలను ఏళ్ల తరబడి వాయిదా వేస్తూ వచ్చాయి, కానీ సుప్రీంకోర్టు జోక్యంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది… కేసీయార్ పీరియడ్‌లో కూడా ఈ వ్యవస్థ రద్దు ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలొచ్చాయి…
ముఖ్య గమనిక…: రాజ్యాంగం ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి… దీన్ని అతిక్రమించడం ఏ ప్రభుత్వానికైనా చట్టరీత్యా కష్టతరమైన పని… సో, రేవంత్ రెడ్డి త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, అదీ మున్సిపల్ తరహాలోనే పార్టీ గుర్తులతోనే నిర్వహించక తప్పదు..!!
Share this Article