.
( రమణ కొంటికర్ల ) …. ఓపెన్ హైమర్ నుంచి ఆహ్వానం! ఎవరా భారతీయ మహిళా శాస్త్రవేత్త..? టీ.కే. రాధ.. ఈ పేరెప్పుడైనా విన్నారా..? అణుబాంబు పితామహుడైన ఓపెన్ హైమరే స్వయంగా ఆహ్వానిస్తూ లేఖ రాసిన ఈ మహిళ.. కాస్త తెలుసుకోవాల్సిన ఓ ప్రఖ్యాత శాస్త్రవేత్త!
అది 1960ల మధ్య కాలం. మద్రాస్ కు వచ్చిన ఓ లేఖ శాస్త్రీయవర్గాల్ని అమితాశ్చర్యానికి గురిచేసింది. అదేం సాధారణ లేఖ కాదు. అణుబాంబు పితామహుడైన ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త జే. రాబర్ట్ ఓపెన్ హైమర్ నుంచి అందిన ఆహ్వాన లేఖ.
ఆ సమయంలో ఓపెన్ హైమర్ అమెరికా ప్రిన్స్టన్ లో ఉన్న ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ డైరెక్టర్. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ తన జీవితాన్నెక్కువగా గడిపిన ప్రదేశం. సృజనాత్మకంగా ఆలోచించే వారికి నిలయంగా ప్రసిద్ధి చెందిన ఇనిస్టిట్యూషన్.
Ads
అణుశక్తిని నియంత్రించిన ఓపెన్ హైమర్.. భారతదేశానికి చెందిన ఓ అసాధారణ మేధావిని వెతుక్కుంటూ ఆహ్వానం పంపడం ఆరోజుల్లో పెద్ద వార్త. అణు ప్రపంచ రహస్యాలను విప్పే పనిలో నిమగ్నమైన భారతీయ శాస్త్రవేత్త టీ.కే. రాధ… ఓపెన్ హైమర్ నుంచి ఆ ఆహ్వానమందుకుంది.
అసలు తయ్యూర్. కే. రాధ ఎవరు..?
టీ.కే. రాధ కేరళవాసి. ఓ కుగ్రామానికి చెందిన ఈ మహిళ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకున్నారు. భౌతికశాస్త్రంలో అసాధారణ ప్రతిభావంతురాలు. ఆమె ప్రతిభకు గోల్డ్ మెడల్ దక్కింది. ఇండియన్ సైన్స్ లో ఓ లెజెండరీ ఫిగర్ గా అప్పటికే పేరుగాంచిన అల్లాడి రామకృష్ణనే పరిశోధనా బృందంలో సభ్యురాలు.
మహిళలంటే ఇంటిపట్టున ఉండి వంటలు వండే పనిలో నిమగ్నమైన నాటి కాలంలో… రాధ పరిశోధనా పత్రాలు మాత్రం అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యేవి. ప్రపంచవ్యాప్తంగా సైన్స్ లో పరిశోధనలు చేస్తున్న అత్యుత్తమ మేధావులను.. ఓపెన్ హైమర్ ప్రిన్స్టన్ కు ఆహ్వానించాలనుకుంటున్న సమయంలో.. ఆమె ప్రతిభ జర్నల్స్ ద్వారా తెలుసుకున్నాడు. ఓపెన్ హైమర్ దృష్టిని ఆకర్షించాయి రాధ పరిశోధనలు. దాంతో ఓపెన్ హైమర్ నుంచి రాధకు ఆహ్వానమందింది.

ఇంతకీ రాధ.. ఓపెన్ హైమర్ తో ఏ శాస్త్రంపై చర్చించింది..?
పార్టికల్ ఫిజిక్స్ లో రాధ ప్రత్యేకంగా పరిశోధనలు చేశారు. విశ్వ నిర్మాణంలో కీలకమైన అతి సూక్ష్మ కణాలను అర్థం చేసుకునే ఆ శాస్త్రంపై టీ.కే. రాధ పరిశోధనలు చేశారు. కణాల పరస్పర చర్యలపై 14 పరిశోధనా పత్రాలు రాశారు.
అధిక శక్తిని విడుదల చేసే సమయంలో కణాలు ఒకటికొకటి పరస్పరం ఎలా ఢీకొంటాయనే రెగ్గే పోల్స్ అనే సిద్ధాంతంపై రాధ ప్రత్యేక పరిశోధన చేశారు. కణాల మధ్యనుంచే సిమ్మెట్రీని ఆమె లోతుగా విశ్లేషించారు. ఆ తర్వాత ఆమె పార్టికల్ ఫిజిక్స్ లో ప్రయోగాలు చేసేవారికి, పరిశోధనలు చేసేవారికీ మార్గదర్శిగా నిల్చారు.
మహిళా శాస్త్రవేత్తల లోకానికే ఓ లెజెండ్ రాధ!
ఓపెన్ హైమర్ ఆహ్వానంతో 1965లో రాధ ప్రిన్స్టన్ చేరుకున్నారు. ఓపెన్ హైమర్ తో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ఆ సమయంలో భగవద్గీతపైనా ఓపెన్ హైమర్ మాట్లాడిన మాటలనూ, ఆయనకున్న లోతైన అవగాహన గురించి కూడా ఆ తర్వాత ఆమె షేర్ చేసుకున్నారు. భారత్ నుంచి అమెరికాకు పయనమైన రాధ విమాన ఖర్చులకు కూడా ఓపెన్ హైమరే చెక్ రాసి చెల్లించారు.
వీక్ ఇంటరాక్షన్ అనే మౌలిక శక్తిపైన కూడా ఆమె పరిశోధనలు చేశారు. అందువల్లే సూర్యుడు ప్రకాశిస్తాడని వెల్లడించారు. అబ్స్ట్రాక్ట్ మేథమేటిక్స్.. వాస్తవ ప్రపంచంలో ఒక పదార్థం ఎలా నిర్మితమవుతుందో తెలియజెప్పే భౌతిక వాదనల మధ్యనున్న ఖాళీని ఆమె పరిశోధనలు పూరించాయి.
గణితానికి మించి ఎదిగిన మహిళ రాధ!
అప్పటికి తెల్లవాళ్ల ఆధిపత్యం.. పురుషాధిపత్యంలో ఉన్న శాస్త్ర ప్రపంచంలో ఓ కుగ్రామం నుంచి శాస్త్ర విజ్ఞానంలో ఎదిగి రాధ ఔరా అనిపించారు. ఆ తర్వాత కొంతకాలం కెనడాలోనూ ఉన్నారు. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దనే ఫిలాసఫీ టీ. కే. రాధది.
మేథస్సుకు వయస్సేమాత్రం అడ్డంకి కాదనీ నిరూపించిన మహిళ. ఈరోజుకూ భారతదేశ శాస్త్ర విజ్ఞానుల్లో తయ్యూర్. కే. రాధది ప్రత్యేక స్థానం. కానీ, అదే సమయంలో తక్కువ గుర్తింపు దక్కిన మహిళా శాస్త్రవేత్తగానూ మిగిలిపోవడం విచారకరం…
Share this Article