.
అడవి ఖాళీ.. అగ్రనేతలు ‘అవుట్’… ఇక మిగిలింది ఆ ఒక్కడేనా? ఒకప్పుడు దండకారణ్యాన్ని శాసించిన తుపాకీ గొట్టం ఇప్పుడు మూగబోతోంది… ‘రాజ్యాధికారం తుపాకీ గొట్టం ద్వారానే’ అన్న నినాదం ఇప్పుడు కేవలం పుస్తకాలకే పరిమితం కాబోతోంది… అవును.. భారత దేశంలో మావోయిస్టు సాయుధ పోరాటం ఇప్పుడు తన ‘ఎగ్జిట్ రూట్’లో ఉంది…
కొన్నాళ్లు వరుస పరిణామాలు, ప్రస్తుత ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం విశ్లేషిస్తే… ఎర్రజెండా నీడన సాగిన సుదీర్ఘ పోరాటం ముగింపు దశకు చేరుకుందని స్పష్టమవుతోంది…
Ads
సిసి (CC) ఖాళీ.. నాయకత్వం నైరాశ్యం! ఒకప్పుడు మావోయిస్టు సెంట్రల్ కమిటీ అంటే 25 మందికి పైగా హేమాహేమీలు ఉండేవారు… కానీ ఇప్పుడు ఆ సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయికి పడిపోయింది…
-
దేవ్‌జీ, సంగ్రామ్ లొంగుబాట్లు..: పార్టీలో అత్యంత కీలకమైన, మిలిటరీ వ్యూహకర్తలుగా పేరున్న తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ వంటి వారు లొంగుబాటు బాట పట్టడం పార్టీ పునాదులను కదిలించింది… (ఈ ఇద్దరితోపాటు కీలక మావోయిస్టుల లొంగుబాటును ఈరోజు అధికారికంగా చూపించనున్నారు, తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు పేరు కూడా వినిపిస్తోంది…)
-
ఒక్కరే తెలంగాణ నేత..: ప్రస్తుతం సెంట్రల్ కమిటీలో తెలంగాణ నుంచి మిగిలింది పుసునూరి నరహరి అలియాస్ సంతోష్ ఒక్కడే అంటున్నారు… అయితే ఆయన కూడా ఇప్పుడు సొంత గడ్డపై లేడు, జార్ఖండ్ అడవుల్లో తన ఉనికి కోసం పోరాడుతున్నాడు…
-
పుసునూరి నరహరి … కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఉన్నట్లు లేదా మరణించినట్లు కొన్ని పత్రికా కథనాలు వచ్చాయి… ముఖ్యంగా 2024 ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఆయన మరణించినట్లు బలమైన ప్రచారం జరిగింది.., కానీ పార్టీ తరపున లేదా అధికారికంగా ఎటువంటి అధికారిక ధృవీకరణ (Confirmation) ఇంతవరకు వెలువడలేదు…
స్వస్థలం..: తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, ఓదెల మండలం, కనగర్తి గ్రామం. పార్టీ హోదా: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ (CC) సభ్యుడు…
గణపతి పరిస్థితి ఏంటి?…: పార్టీ మాజీ బాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు (77) వయసు పైబడటం, అనారోగ్య కారణాలతో పూర్తిగా ఇన్-యాక్టివ్… ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా క్లారిటీ లేని పరిస్థితి… నేపాల్‌లో తలదాచుకున్నాడని అంటారు… ఈ వయస్సులో తను చేయగలిగేది ఏమీ లేదు, తెలంగాణ పోలీసులకు లొంగిపోతే, ఎంచక్కా వైద్యం చేయించి, మానవతాదృక్పథంతో వ్యవహరిస్తారు… టుబి ఫ్రాంక్…
- జార్ఖండ్‌కే చెందిన మిసిర్ బెస్రా పొలిట్ బ్యూరో మెంబర్, సీసీ సభ్యుడిగా తను కూడా జార్ఖండ్‌లోనే పనిచేస్తున్నాడు… ప్రస్తుతం నక్సల్స్ ఫ్రీ మధ్యభారతం అనే లక్ష్యం పూర్తవుతున్న కారణంగా, ఇక యాంటీ నక్సల్ బలగాలు జార్ఖండ్, బీహార్ ప్రాంతాలకు వెళ్లి ‘‘మిగిలిన పని’’ పూర్తిచేస్తాయని ఓ అంచనా… ప్రస్తుతానికి మధ్యభారతంలో ఒక్క సీసీ సభ్యుడు కూడా లేడు… మిగతా ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ బలంగా కూడా ఏమీ లేదు…
ఇక్కడ విశేషం ఏంటంటే… తెలంగాణ పోలీసు బలగాలు తుపాకులతో కాకుండా, ఓ భిన్న వ్యూహంతో ఈ ఉద్యమాన్ని క్లోజ్ చేస్తున్నాయి… తెలంగాణ పోలీస్ బాస్ శివధర్ రెడ్డి టీమ్ ఇప్పుడు ‘ఆపరేషన్ ఆమ్నెస్టీ’ అనే మౌన యుద్ధం చేస్తోంది… స్ట్రాటజీ సింపుల్..: “రక్తపు చుక్క చిందించొద్దు… ఒక్క బుల్లెట్ పేలొద్దు… కానీ లక్ష్యం నెరవేరాలి”…
అడవిలో అనారోగ్యంతో బాధపడుతున్న నేతలను, వయసు మళ్లిన వారిని సానుభూతితో సంప్రదించడం, వారికి మెరుగైన వైద్యం, సురక్షితమైన జీవితంపై భరోసా కల్పించడం ద్వారా వారిని బయటకు తీసుకొస్తున్నారు… ఇది ఎన్‌కౌంటర్ల కంటే వేగంగా మావోయిస్టు కోటలను బద్ధలు కొడుతోంది…
2026 మార్చి 31: అమిత్ షా డెడ్ లైన్! కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని అంతం చేయాలనే టార్గెట్ పెట్టుకున్నాడు… ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ గడువు కంటే ముందే ‘క్లోజింగ్ రిపోర్ట్’ వచ్చేలా ఉంది… అబూజ్‌మడ్ వంటి కంచుకోటల్లో కూడా ఇప్పుడు భద్రతా బలగాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి..!!
చివరగా.... ఈరోజు జరిగే మావోయిస్టుల లొంగుబాట్లను సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చూపిస్తే బాగుండేది...
Share this Article