.
నడినెత్తిన సుడి ఉండాలే గానీ అలా అనుకోకుండా అన్ని పరిణామాలూ కలిసొస్తాయి అన్నట్టు… రేవంత్ రెడ్డికి అన్నీ అలా కలిసొస్తున్నాయి… చివరకు తనకు ఏమాత్రం సంబంధం లేని కవిత మద్యం స్కామ్ కేసులో తాజా తీర్పు కూడా తనకే ప్రయోజనకరం… ఎహె, రేవంత్ రెడ్డికీ, ఈ కేసు తీర్పుకూ లింక్ ఏమిటీ అంటారా..? అదే, అదే… కాస్త తాపీగా చదవండి…
కవితను నిందితురాలిగా చేర్చిన ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌లో ఆమె కూడా నిందితురాలు… జైలులో చాన్నాళ్లు గడిపింది… ఓ బాపు, ఓ జాతిపిత పెంపకం, మరీ మద్యం వ్యాపారంలో ఓ తెలంగాణ బతుకమ్మ అనే నెగెటివిటీ బాగా స్ప్రెడయింది…
Ads

ఈలోపు ఎక్కడ తేడా కొట్టిందో గానీ… నాన్- నెత్తుటి వారసులు సంతోష్, హరీష్ రావు తదితరులు ప్లస్ వాళ్ల అనుచర ముఖ్యులు ఆమె మీద నెగెటివ్ వ్యాఖ్యలు చేశారు, సొంత నియంత బిడ్డే అయినా సరే, సపోర్ట్ చేస్తే పార్టీకే నష్టం అనుకున్నారు… ఆమె మౌనంగా భరించింది… చివరకు బయటికి వచ్చింది, ఇప్పుడు ఆ కేసు నుంచే విముక్తమైంది…

(సరే, ఏ పొలిటికల్ కేసైనా సరే బెయిల్ మీద విడుదలయ్యే వరకే… తరువాత ఆ కేసులన్నీ శంకరగిరి మాన్యాలే… పైగా వర్తమాన భారతంలో రాజకీయ అవినీతిని అసలు ఎవరూ పట్టించుకోవడమే లేదు)… నిన్నటిదాకా ఆమెకు పొగబెట్టారు, కుటుంబం నుంచి, పార్టీ నుంచి వెళ్లగొట్టారు… ఆమె మాటలకు కూడా విశ్వసనీయత కనిపించేది కాదు, కారణం… కేటీయార్ సోషల్ మీడియా టీమ్…

కానీ ఇప్పుడేమైంది..? ఆమెకు క్లీన్ చిట్… దీంతో ఆమె మాటకు క్రెడిబులిటీ, విలువ… ఆమె సంతోష్, హరీష్ రావు ఎట్సెట్రా కేరక్టర్లపై చేసే విమర్శలకు విలువ ఏర్పడింది… ఆమె అయ్య సహా, అన్న, బావ, అనుచర గ్యాంగులపై మండిపోతోంది… ఆగదు, రేపు రేపు తన మాటలకు పదును పెడుతుంది… సహజంగానే ఆమె దోష ఆరోపణల నుంచి బయటపడింది కాబట్టి, ఎంతోకొంత ప్రజల్లో ఆమె మాటలకు విలువ… తేలికగా తీసిపారేయలేరు…

ఎస్, ఇది బీఆర్ఎస్‌కు నష్టం… అంటే, రేవంత్ రెడ్డికి లాభం… అరెరె, ఇదేదో మనను ఇంకా దిగజారుస్తోంది, అసలే అన్ని ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు తింటున్నాం, జనం ఎవడూ మనల్ని నమ్మిచావడం లేదనే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న కేటీయార్ టీమ్ ఎప్పటిలాగే తొందరపడింది… దారుణంగా భంగపడింది… ఎలాగంటే..?

ఆ పొలిటికల్ ఉద్దేశపూర్వక కేసు వల్లే మేం ఓడిపోయాం అన్నాడు కేటీయార్… పాపం, ఈమధ్య అన్నీ ఇలాంటి భంగపాట్లే… వెంటనే కవిత రిటార్ట్… అసెంబ్లీ ఎన్నికల తరువాత కదా నేను అరెస్టయింది, మరెందుకు ఓడిపోయావ్..? మీ అహంకారం, మీరు దుర్మార్గులకు టికెట్లు ఇవ్వడం వల్ల… నీ పరాజయాన్ని, నీ వైఫల్యాన్ని నా మెడలో ఎందుకేస్తావ్ అని…

పర్‌ఫెక్ట్ పాయింట్… దీనికి వందల కోట్ల కేటీయార్ సోషల్ మీడియా దగ్గర కౌంటర్ లేదు, జవాబు లేదు… సో, కేటీయార్ అనాలోచితంగా చేసే ట్వీట్లు, స్పందనలు అన్నీ కౌంటర్ ప్రొడక్టులే అవుతున్నాయి… సొంత బుర్ర అప్లయ్ చేయలేని అసమర్థత… ఇక్కడే కేటీయార్‌కన్నా హరీష్ రావు నయం అనిపించేది…

ఆమె పదే పదే హరీష్ రావు, సంతోష్ రావులనే టార్గెట్ చేస్తోంది, తండ్రి దేవుడి చుట్టూ చేరిన దెయ్యాలు అంటోంది… ఆ భూతాల ముట్టడిలో నాన్న బందీ అయిపోయాడు అంటోంది… గతం వేరు, ఇప్పుడు ఆమె ఎప్పుడైతే మద్యం స్కామ్ నుంచి బయటపడిందో… అరె, ఆమె చెబుతున్నది కరెక్టేగా, అనవసరంగా సొంత పార్టీ నేతలు, అదీ అధినేత బిడ్డపైనే అవాకులూ చెవాకులూ పేలారు కదా, పాపం, ఆమె చెప్పేదే కరెక్టు కదా అనే భావనను జనంలోకి వెళ్లేలా చేసింది ఆ కోర్టు తీర్పు…

అంతిమంగా ఇదంతా ఎవరికి నెగెటివ్..? బిడ్డ అని చూడకుండా ఇంటి నుంచి తరిమేశాడు అని కేసీయార్ మీద నెగెటివిటీ పెంచుతుంది…? అది కేటీయార్ మీద, అది హరీష్ రావు మీద ప్రభావం చూపిస్తుంది… ఓహో, జాతిపిత, బాపు అసలు మనస్తత్వం ఇదా అనే భావన స్ప్పెడ్ అవుతుంది… ఇప్పటికే అది ప్రభావం చూపిస్తోంది…

(ఇదుగో ఇది అర్థమైన రాజకీయ విజ్ఙానం, విజ్ఞత, వివేచన హరీష్ రావులో ఉన్నాయి కాబట్టే తను కవిత కేసు మీద ఇప్పటికీ సైలెంటు… పైగా తను ఏదైనా తప్పుదోవన ఓ మాట తూలితే, ఆమె పది మాటలతో తలంటే ప్రమాదం ఉంది, కేటీయార్‌కు ఆల్రెడీ అనుభవమైంది కాబట్టి …. నిశ్శబ్దం… ఇక్కడ కేటీయార్ సోషల్ మీడియా, కోర్ టీమ్‌కన్నా హరీష్ టీమ్ ఫార్ ఫార్ ఫార్ బెటర్…)

ఆమె అవినీతిపరురాలు సరే, మరి మిగతావాళ్లంతా శుద్ధపూసలా..? కేసీయార్ నెత్తిన మోసిన సిట్టింగుల అరాచకాలు, వరుసగా బయటపడుతున్న కేసీయార్ పాలన బాపతు భారీ భారీ స్కాముల మాటేమిటి అనే ఫీలింగ్ ప్లస్ ఆమెకు తాజాగా లభించిన క్లీన్ చిట్ ఆమెకు లాభం, సొంత రాజకీయ పార్టీ దిశలో అడుగులు వేస్తున్న ఆమెకు ఓ మోరల్ బూస్టప్…

ఇప్పుడు ఆమె ఇక ఆగదు… రాష్ట్రమంతా పర్యటిస్తుంది… ఆల్రెడీ కంటోన్మెంట్, జుబ్లీ హిల్స్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో నేలకరిచిన పార్టీకి మరింత నష్టం… అదెవరికి లాభం..? కేసీయార్ అండ్ కో మీద పగతో, ప్రతీకారంతో రగిలిపోతున్న రేవంత్ రెడ్డికి, అంటే కాంగ్రెస్ పార్టీకి లాభం… అందుకే ముందే చెప్పింది… అన్నీ రేవంత్ రెడ్డికి అలా కలిసొస్తున్నాయి అని..!! అర్థమైందా రాజా..!!

ఇప్పటికైనా ఆమెకు వచ్చేదేముంది అంటారా..? పోరాడితే పోయేదేమీ లేదు… ఈ హరీష్ రావు, ఈ కేటీయార్ మగ పెత్తనాల కింద అణిగి మణిగి, ఆత్మను చంపేసుకుని ఆ సొంత పార్టీలో బతకడంకన్నా… తనకంటూ ఓ ప్రెషర్ గ్రూపు… తలెత్తి బతకడానికి…!!

ఈమె మరో షర్మిల కావడం లేదు, కేవలం ఆస్తి తగాదాలతో అన్నను కౌంటర్ చేయటానికి… కాంగ్రెస్ ఆమెకు కిరీటం పెట్టినా ఉద్దరించింది ఏముంది..? ఆమె పోరాటంలో నిజాయితీ లేదు కాబట్టి..! జగన్ ఒక లక్ష్మిపార్వతిని ఎంకరేజ్ చేశాడు, చంద్రబాబును తిట్టడానికి, ఏం జరిగింది… జీరో, డబుల్ జీరో, ట్రిపుల్ జీరో… కానీ కవిత అలా కనిపించడం లేదు… మంచి క్లారిటీతోనే వెళ్తోంది..!! గుడ్ లక్ రేవంత్ రెడ్డి సాబ్..!! అన్నీ మంచి శకునములే..!!

నిజంగానే బీఆర్ఎస్‌లో ఓ పేద్ద డైలమా ఇప్పుడు..? కేసు పెట్టిన కొత్తలో, అరెస్టు కొత్తలో అవాకులూ చెవాకులూ పేలారు కొందరు… అది జనంలోకి ఫుల్లు నెగెటివ్‌గా పోయింది… ఇప్పుడేం చేయాలో తెలియదు, బాపు నోట మాట లేదు… స్పందన లేదు… నీ బిడ్డ మీద కేసు కొట్టేస్తే, గతంలో రాజకీయ కుట్ర అన్నవాడివి, ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు సోకాల్డ్ జాతి పితా… పోనీ, కవిత పితా..!!

Share this Article