Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నక్సల్స్ ఘాతుకం..! నిజాన్ని, తప్పును ఆలస్యంగా అంగీకరించిన వైనం..!!

March 10, 2026 by M S R

.

Bhavanarayana Thota …. రిపోర్టర్ మాటకు విలువిచ్చి రిస్క్ తీసుకున్న ‘పొత్తూరి’….. పాత్రికేయ దిగ్గజం పొత్తూరి వెంకటేశ్వరరావు గారి ఆరో వర్ధంతి సందర్భంగా (నిన్న) జర్నలిస్టు మిత్రులు కొంతమంది ఆయనతో అనుబంధాన్ని, ఆయన పాటించిన విలువలను గుర్తు చేసుకున్నారు. నేను కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా…

అత్యంత సున్నితమైన సందర్భమైనా, అప్పటి వరకూ అలాంటి ఘటన జరగకపోయినా, ఫీల్డ్ లో ఉన్న రిపోర్టర్ చెప్పిన మాటకే విలువ ఇవ్వటం అసాధారణం. పత్రిక ప్రతిష్ఠకే సవాలుగా తయారయ్యే సందర్భంలోనూ ఆయన నిర్ణయం తీసుకున్న తీరు నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే.

Ads

*****
ఇది జరిగి 35 ఏళ్ళు దాటింది. కాకతీయ ఎక్స్ ప్రెస్ తగలబడినప్పుడు ఆ వార్త విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం గురించి చెప్పాలనుకుంటున్నా. 1990 అక్టోబర్ లో హైదరాబాద్ శివార్లలో చర్లపల్లి – ఘట్ కేసర్ మధ్య జరిగిన ఘటన ఇది. రిజర్వేషన్లు, యాంటీ రిజర్వేషన్ల ఉద్యమాలు పోటాపోటీగా జరుగుతున్న సందర్భమది.

రిజర్వేషన్లకు అనుకూలంగా పీపుల్స్ వార్ గ్రూప్ నక్సల్స్ బంద్ కు పిలుపునిచ్చారు. రేపు బంద్ జరగాల్సి ఉండగా ఆ రోజు సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో వరంగల్ వెళ్ళే కాకతీయ ఎక్స్ ప్రెస్ లో ఒక బోగీని తగలబెట్టారు.

హన్మంతరెడ్డి అనే మిత్రుడు హడావిడిగా వచ్చి నాకీ విషయం చెప్పాడు. దగ్గర్లోనే ఉండటంతో కె. ఎం సత్యనారాయణ అనే మిత్రుడి బండి మీద పావు గంటలోనే అక్కడికి వెళ్ళా. రెండే కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘట్కేసర్ నుంచి చాలామంది అక్కడికొచ్చారు. వాళ్ళలో ఫొటోగ్రాఫర్ జ్ఞాన్ కుమార్ ఉన్నారు. కలర్, బ్లాక్ అండ్ వైట్ రీల్స్ నాకే ఇమ్మని రిక్వెస్ట్ చేస్తే సరేనన్నారు.

కాస్త ఆలస్యంగా వచ్చిన ఫైరింజన్ సిబ్బంది చాలా కష్టపడి మంటలార్పవలసి వచ్చింది. అక్కడ కళ్ళముందే భయానక వాతావరణం. . రైలు నుంచి దూకి ప్రాణాలతో పరుగు తీసేవాళ్ళు కొంతమంది, ఏమైందో అర్థం కాని అయోమయంలో మిగతా బోగీల నుంచి దూకిన వాళ్ళు ఇంకొందరు. వాళ్ళలో దొరికిన వాళ్ళను పట్టుకొని అడిగితే వాళ్ళు చెప్పిందొక్కటే.

  • 20 ఏళ్ల లోపున్న ఐదుగురు కుర్రాళ్ళు మౌలాలి లో రైలెక్కారని, బోగీలో పెట్రోల్ చల్లారని, ఘట్ కేసర్ లో రైలు ఆగిన వెంటనే తగలబెడతామని, కంగారు పడవద్దని చెప్పారని. రిజర్వేషన్లకు అనుకూలంగా మరుసటి రోజు చేస్తున్న బంద్ గురించి కరపత్రాలు కూడా పంచారంటూ చెప్పి వాళ్ళ దగ్గరున్న కరపత్రాలిచ్చారు నాకు. అవి పీపుల్స్ వార్ పేరుతోనే ఉన్నాయి.

ఘటన తీవ్రత తెలిసిన వెంటనే నాకు తెలిసిన పాశం రాంరెడ్డి అనే కుర్రాణ్ణి ఉప్పల్ వెళ్ళి ఆంధ్రప్రభ ఆఫీసుకు ఫోన్ చేసి ఫస్ట్ పేజ్ కి మేజర్ న్యూస్ తో వస్తున్నట్టు చెప్పమన్నా. (అప్పట్లో ఉప్పల్ నుంచి మాత్రమే సిటీకి లోకల్ ఫోన్ అందుబాటులో ఉండేది). రాత్రి 10 కి ఆదిలాబాద్ వెళ్ళే ఫస్ట్ ఎడిషన్ ఆపటానికే ఈ ప్రయత్నం.

కాకతీయ ఎక్స్ ప్రెస్ రోజూ ఉదయం వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు సగం మంది ప్రయాణీకులు జంటనగరాల్లో పనిచేసే ఉద్యోగులే ఉంటారు. మళ్లీ సాయంత్రం తిరిగి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళే ఎక్కువమంది. దాదాపుగా ప్రతిరోజూ ప్రతి బోగీలో ఒకే మనుషులు. అందరూ అలా రైల్లో ప్రయాణిస్తూ పరిచయస్తులుగా మారినవాళ్లే.

అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా జరిగిన అనూహ్య ఘటన ఇది. ఘట్ కేసర్ లో రైలు ఆగినప్పుడు అందరూ దిగాక బోగీని కాలుస్తామని చెప్పిన యువకుల మాట నమ్మి అందరూ ఘట్ కేసర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ, పట్టాలమీద ఏదో మరమ్మతు జరుగుతూ ఉండటంతో కాస్త ముందే రైలు ఆగింది.

ఆగటాన్ని అపార్థం చేసుకున్న ఒకరు ఘట్ కేసర్ వచ్చినట్టు సిగ్నల్ ఇవ్వటం, ఇంకొకరు నిప్పంటించటం క్షణాల్లో జరిగిపోయాయి. వేగంగా మంటలు అంటుకోవటంతో కొద్ది మంది మాత్రమే దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. అందరూ డోర్స్ దాకా వెళ్ళినా, వెనక ఉన్నవాళ్ళు నెడుతూ ఉంటే డోర్ ను లోపలికి తీయలేక మంటలకు ఆహుతయ్యారు.

ఫైర్ సిబ్బంది మంటలార్పాక శవాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని, పుర్రెల సంఖ్యను బట్టి 50 మంది చనిపోయారని తేల్చారు. అక్కడ సేకరించాల్సిన సమాచారం పూర్తయ్యాక జ్ఞాన్ కుమార్ నుంచి ఫోటో రోల్స్ తీసుకొని దోమల గూడలోని ఆంధ్రప్రభ ఆఫీసుకు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తుంటే జ్ఞానేశ్వర్ (ఈ మధ్యనే చనిపోయాడు) అనే మరో ఘట్ కేసర్ మిత్రుడు నన్ను తీసుకెళ్ళటానికి బండితో రెడీ అయ్యాడు.

9 గంటలకల్లా దోమల్ గూడలోని ఆఫీసుకు వెళ్ళేసరికి న్యూస్ ఎడిటర్ రంగాచారి గారు నాకోసమే ఎదురు చూస్తున్నారు. వరుసగా రాసి ఇస్తుంటే ఒక్కో పేజ్ కంపోజింగ్ కి వెళ్ళిపోయింది. ఫస్ట్ పేజ్ లో ఫోటోలు, వార్త దాదాపుగా సిద్ధమైంది. కానీ నేను రాసిన హెడింగ్ మీదనే అభ్యంతరం.

కాకతీయ బోగీకి నిప్పు : 50 మంది సజీవ దహనం
అసుర సంధ్యలో అమానుషం – నక్సల్స్ ఘాతుకం

పక్కనే మరో డెస్క్ చూస్తున్న ఇన్ఛార్జ్ ‘నక్సల్స్’ అని వాడటం మీద అభ్యంతరం చెప్పారు. నక్సల్స్ అలా చేయరు అన్నారాయన. “మొదటిసారి అయి ఉండవచ్చు కదా” అనేది రంగాచారి గారి వాదన. ఇద్దరూ కలసి ఎడిటర్ పొత్తూరి గారికి ఫోన్ చేశారు. ఇద్దరి వాదనా విన్న తరువాత ఆయన ఫోన్ నాకు ఇమ్మన్నారు. “మీకేమనిపిస్తున్నది”? అని అడిగారు. “నక్సల్స్ అని” అన్నాను. “అయితే అలాగే ఉంచేయండి” అన్నారు. అదే శీర్షిక ఖరారైంది.

ఫోటోల విషయానికొస్తే, ఇంకో చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. నేను, కలర్, బ్లాక్ అండ్ వైట్ ఫోటో రీల్స్ తీసుకొచ్చా. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఆఫీసులోనే ప్రింట్స్ వేశారు. కానీ అప్పట్లో కలర్ ఫోటో లాబ్స్ రెండే ఉండేవి. ఇంకొకటి ఈనాడు వాళ్ళది. అప్పటికే ప్రైవేట్ లాబ్స్ మూతపడటం వల్ల చేయగలిగిందేమీ లేదు. బ్లాక్ అండ్ వైట్ మాత్రమే వాడుకోవాల్సి వచ్చింది.

అంతలోనే ఈనాడు నుంచి మా క్రైమ్ రిపోర్టర్ పృధ్వీరాజ్ సింగ్ కు ఫోన్. మా కలర్ ఫిల్మ్ ఇస్తే ప్రింట్స్ ఇద్దరం వాడుకోవచ్చునన్నది వాళ్ళ ప్రతిపాదన. కాసేపు ఈ విషయం మీద ఆఫీసులో తర్జనభర్జనలు. ఈనాడులో వస్తే ఈనాడుకు పేరొస్తుంది తప్ప ఆంధ్రప్రభలో వచ్చిందని గుర్తించరు. తగలబడుతున్న రైలు ఫోటోలు ఆంధ్రప్రభకే సొంతం కాబట్టి మరుసటి రోజు వేసినా ఎక్స్ క్లూజివ్ అవుతాయి. అందుకే ఈనాడుకు ఇవ్వదలచుకోలేదు.

  • నాకు నక్సల్స్ మీద వ్యతిరేకభావం ఎంతమాత్రమూ లేదు. కానీ వార్త విషయంలో రాజీ పడకుండా ఇవ్వాల్సి వచ్చింది. నా పేరుతో సహా వార్త పబ్లిష్ అయింది. ముప్పావు పేజీ ఈ వార్త ఫోటోలే. ఫస్ట్ ఎడిషన్ ప్రింటయ్యాక ఒక కాపీ కూడా తీసుకొని వెళ్ళా.

మరుసటి రోజు జర్నలిస్టు మిత్రులు చాలామంది ఫోన్ చేసి నేను అనవసరంగా రిస్క్ తీసుకున్నానన్నారు. నేరుగా నక్సల్స్ మీద నింద మోపి తొందరపడ్డానేమోనన్నారు. మరుసటి రోజు ఎనిమిదిన్నరకు అసెంబ్లీ మొదలవగానే ప్రతిపక్ష నాయకుడు ఎన్టీయార్ ఈ విషయం లేవనెత్తారు. ప్రశ్నోత్తరాలు పక్కనబెట్టి 12 గంటల దాకా ఇదే చర్చ. ఒక్కో పత్రిక ఒక్కో విధంగా రాసింది. విద్యాసాగర్ రావు ఆంధ్రప్రభ వార్తనే ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి సభలో ఒక ప్రకటన చేసేదాకా విపక్షాలు వదల్లేదు.

ముందు రోజు రాత్రి 2 గంటల దాకా ఈ ఘటన మీదనే ఆయన ఫాలో అప్ చేశారని, అందుకే సభకు రాలేకపోయారని అప్పటి రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కనుమూరు బాపిరాజు చెప్పినా, విపక్షాలు పట్టువదల్లేదు. మొత్తానికి చెన్నారెడ్డి వచ్చి ఒక ప్రకటన చేశాకే 12 గంటలకు సభ వాయిదా పడి మళ్ళీ 4 గంటలకు సమావేశమైంది.

అదే రోజు కాకతీయ ఘటన మీద బెంజమన్ పేరుతో నక్సల్స్ నుంచి ఖండన వచ్చింది. రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమకారులే నిందమోపే ప్రయత్నం చేశారని గద్దర్, వరవరరావు ఇంకోవైపు పత్రికా సమావేశంలో ఆరోపించారు. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఆంధ్రప్రభ వార్తను అనుమానంగా చూశారు.

కానీ, ఆరు నెలల తరువాత జనగామ ప్లీనరీలో నక్సల్స్ క్షమాపణ చెప్పారు. పొరపాటున జరిగిన ఈ ఘటనమీద పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఖాళీ బోగీ తగులబెట్టాలంటూ ఆర్ఎస్‌యుకు అప్పగించిన బాధ్యత అమలు చేయటంలో జరిగిన తప్పిదం ఈ దుర్ఘటనకు కారణమైందని చెప్పారు.

రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎల్ఎన్ రెడ్డి కమిషన్ కూడా ఆ యువకుల తొందరపాటు చర్య వల్ల 50 మంది చనిపోయారని చెప్పింది. మొత్తం మీద నేను, నన్ను నమ్మిన ఎడిటర్ పొత్తూరి గారు బైటపడ్డాం. అలాంటి పెద్ద వార్త విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం, చెప్పిన తీర్పు ఎప్పటికీ మరచిపోలేను.
– తోట భావనారాయణ   (ముఖచిత్రం కోసం వాడిన ఫోటో కేవలం సింబాలిక్)... 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శివాజీ ఆ గరుడ పురాణ ప్రవచనాలు మళ్లీ మొదలెట్టాడురా బాబోయ్..!!
  • నక్సల్స్ ఘాతుకం..! నిజాన్ని, తప్పును ఆలస్యంగా అంగీకరించిన వైనం..!!
  • వైఎస్ నిజవారసత్వ పంథాలో రేవంత్… మచ్చుకు కొన్ని మెచ్చు తునకలు ఇవీ…
  • టీ20 వరల్డ్ కప్ హీరో కేరళ సంజూ శాంసన్ కథ తెలుసా మీకు..?
  • ముత్యం పూర్తిగా కడగబడలేదు… ఇంకా శుభం కార్డు పడలేదు…
  • ఓ చిన్న తెలుగు పత్రిక క్లిప్పింగ్ నిన్నంతా వైరల్… ఎందుకు..?
  • ఏది పనికిరాని ముచ్చట..? మన పెళ్లా..? నేనా..? త్రిషతో బంధమా..?
  • ‘‘బ్రదర్ కొంత కరెంటు సర్దుతావా..? వచ్చే నెలలో తిరిగి ఇచ్చేస్తా…’’
  • రెడ్ బుక్ సరే… పింక్ బుక్ సరే… అసలు ఈ బ్లూ బుక్ ఏమిటో తెలుసా..?
  • ట్రోలర్‌కు చెప్పుతో కొట్టినట్టు కౌంటర్… మీకు బూమ్రా-సంజనా కథ తెలుసా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions