.
శనివారం సాన్ ఫ్రాన్సిస్కోలో “మార్చ్ ఫర్ బిలియనీర్స్” ర్యాలీని నిర్వహించిన బిలియనీర్ వర్గాన్ని నేను అభినందిస్తున్నాను, మనస్పూర్తిగా…
నిజం, బిలియనీర్లు ఎదుర్కొంటున్న బాధలు, కష్టాలను ప్రపంచానికి చూపించడానికి ఇదే సరైన సమయం… సాధారణ ప్రజలకు అవి అర్థం కావు… అర్థమయ్యేలా చెప్పాలి…
Ads
ఉదాహరణకు, మీ దగ్గర $200 బిలియన్ సంపద ఉండటం సులభం అనుకుంటున్నారా? అసలే కాదు, అసలు సులభం కాదు… మల్టీబిలియనీర్లు ఎదుర్కొంటున్న చిక్కు సమస్యలలో కొన్ని చెప్పగలను…
ఉదాహరణకు, పాపం, జెఫ్ బెజోస్ కష్టాల్ని ఊహించండి ఓసారి…. ప్రపంచవ్యాప్తంగా కనీసం డజను ప్యాలెసులు, విల్లాలు, భవనాలు, పెంట్‌హౌస్ అపార్ట్‌మెంట్లు ఉన్నాయి… ఆ ఇళ్లన్నింటికి నమ్మకమైన సిబ్బందిని కనుగొనడం ఎంత కష్టమో మీకు తెలుసా..? ఇంటి పనివాళ్లు, వంటవాళ్లు, తోటమాలీలు, స్విమ్మింగ్ పూల్ నిర్వహణ సిబ్బంది, ఇలా ఇంకా చాలా మంది అవసరం… మంచి సిబ్బంది ఇప్పుడు అంత సులభంగా దొరకరు… జెఫ్‌ను అడగండి… అంతేకాక, 30% సిబ్బందిని తొలగించిన తర్వాత తన పత్రిక ‘వాషింగ్టన్ పోస్ట్’ను నడపడానికి మళ్లీ ఎవరో ఒకరిని కనుగొనాలి… ప్రజలారా, జెఫ్ పట్ల కొంచెం సానుభూతి చూపండి… కఠినమైన కాలం తనది, కష్టాల్లో ఉన్నాడు…
మరి మార్క్ జుకర్‌బర్గ్ సంగతి..? అతనికి 387 అడుగుల పొడవైన సూపర్ ఓడ ఉంది, దాన్ని నిర్మించడానికి $300 మిలియన్ ఖర్చయింది, అలాగే ప్రతి సంవత్సరం దాన్ని నిర్వహించడానికి మరో $30 మిలియన్ ఖర్చవుతుంది… ఇప్పుడు చెప్పండి, 387 అడుగుల ఓడను నౌకాశ్రయం నుంచి బయటకు నడిపించగలిగే వారెంతమంది మీకు తెలుసు..? లేదా అందులోని హెలికాప్టర్‌ను నడపగలవారు..? అలాంటి నైపుణ్యం ఉన్నవారిని కనుగొనడం అంత సులభం కాదు…
అంతేకాక, పాలొ ఆల్టోలో 11 ఇళ్లను కొనుగోలు చేసి కుటుంబ సముదాయం ఏర్పరచడానికి జోనింగ్ లాయర్లెంతమందిని జుకర్‌బర్గ్ పెట్టుకున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా..? లాయర్‌తో వ్యవహరించడం ఎప్పుడైనా మీకు జరిగిందా..? మార్క్‌కు అసలు రిలాక్స్ అనేది ఉందా..?
ఇక లారీ ఎలిసన్..? వినండి… ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఒరాకిల్ షేర్ ధర 5% పడిపోవడంతో అతని నికర సంపదలో సుమారు $49 బిలియన్ తగ్గింది… అవును, అక్షరాలా $49 బిలియన్! పాపం… ఐదు వారాల్లో $49 బిలియన్ కోల్పోవడం ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా..? ముఖ్యంగా, అతని సంపద ఇప్పుడు $200 బిలియన్ కంటే తక్కువగా ఉన్నప్పుడు…
$200 బిలియన్ కంటే తక్కువ సంపదతో కంట్రీ క్లబ్‌లోకి ఎలా నడుచుకుంటూ వెళ్తాడు …? అంతేకాక, CBS, TikTok, Paramount, MTV, BET, CMT, Nickelodeon, Pluto TV మరెన్నో మీడియా సంస్థలను ఎలా నడపాలో, ఎంత కష్టమో కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి… లారీ చాలా పనులు ఒకేసారి నిర్వహిస్తున్నాడు కనాకష్టంగా…!
మీకు తెలిసిందే కదా… ఎలాన్ మస్క్ టెక్సాస్‌లో తనకు ఓ సొంత నగరాన్నే కొనుగోలు చేశాడు, అది మే 2025లో అధికారికంగా చేర్చబడింది… టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్, బోరింగ్ కంపెనీని కలిగి ఉండటం ఒక విషయం… సుమారు $845 బిలియన్ సంపదతో, అమెరికాలోని దిగువ 53% కుటుంబాల మొత్తం సంపదకంటే ఎక్కువ సంపద కలిగి ఉండటం మరో విషయం… కానీ ఏకంగా మీ సొంత నగరాన్ని కలిగి ఉండటం చిన్న విషయమా..? వావ్! అది చాలా పెద్ద పని… పాఠశాలలు, పోలీస్, అగ్నిమాపక విభాగాలు, చెత్త ట్రక్కులు, శబ్ద నియమాలు — ఎలాన్‌కు సానుభూతి చూపండి… మస్క్ కష్టాలు మస్క్‌వి…
అంతేకాక, ఈ వన్ పర్సెంట్ అగ్రశ్రేణి తాము చట్టపరంగా చెల్లించాల్సిన $163 బిలియన్ ఫెడరల్ ఆదాయ పన్నును తప్పించుకోవడానికి ఎంత శ్రమపడుతున్నారో మీకు తెలుసా..? లేదా బిలియనీర్లు సగటు ట్రక్ డ్రైవర్, ఉపాధ్యాయుడు లేదా నర్సు కంటే తక్కువ పన్ను రేటు చెల్లించేలా చూసుకోవడం ఎంత కష్టం..?
వారు టర్బో టాక్స్ ఉపయోగిస్తారని అనుకుంటున్నారా? కాదు. పన్ను చట్టాలను తమకు అనుకూలంగా మలచడానికి, IRS తనిఖీలను అడ్డుకోవడానికి, వందల బిలియన్లను విదేశీ పన్ను స్వర్గాల్లో దాచడానికి, స్విట్జర్లాండ్ వంటి ప్రదేశాల్లో రహస్య బ్యాంక్ ఖాతాలు తెరవడానికి వారు ఎంతమంది అకౌంటెంట్లు, లాయర్లు, లాబీయిస్టులను నియమించుకోవాలో ఆలోచించండి… అది అంత సులభమైన టాస్క్ మాత్రం కాదు. కొంచెం సానుభూతి చూపండి…
అగ్ర శ్రేణి వన్ పర్సెంట్ వారు దిగువ 93% కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్న ఈ పరిస్థితిలో, శనివారం ర్యాలీ నిర్వహించిన బిలియనీర్లకు నేను సానుభూతితో కూడిన ధన్యవాదాలు తెలుపుతున్నాను… ట్రంప్ పదవీ స్వీకారం చేసిన తర్వాత బిలియనీర్ వర్గం $1.5 ట్రిలియన్ సంపదను పెంచుకున్న ఈ కాలంలో, పోరాడుతున్న బిలియనీర్ వర్గానికి జీవితం ఎంత కష్టంగా మారిందో ప్రపంచం అర్థం చేసుకోవాలి… సానుభూతి కూడా చెప్పాలి…
ఇది బెర్నీ సాండర్స్ @berniesanders సెటైరికల్ పోస్టుకు తెలుగు అనువాదం... అంబానీలు, ఆదానీలు వంటి ఇండియన్ ధనికుల కష్టాల గురించి మరోసారి చెప్పుకుందాం, సరేనా..?
Share this Article