.
ఒక సినిమా విషయంలో ఏదైనా ప్రయోగం చేస్తున్నారూ అంటే… ప్రేక్షకుడికి కొత్తదనం అనిపించాలి లేదా సినిమా చూడటంలో అదనపు ప్రభావం కనిపించాలి… Enhancing the movie watching experience … లేకపోతే ఆ ప్రయోగాలకు అర్థం లేదు… నేను ప్రయోగం చేయగలను అని చెప్పుకోవడానికి ప్రయోగాలు చేయడం అనవసర ప్రయాస అనిపిస్తుంది…
ఇదంతా ఎందుకు అంటే..? గాంధీ టాక్స్ అని ఓ సినిమా వచ్చింది… మాటల్లేని సినిమా… అంటే సైలెంట్ సినిమా ఏమీ కాదు, నేపథ్య సంగీతం వినిపిస్తూనే ఉంటుంది… పాత్రల నడుమ మాటలుండవ్, అంతే… ఐతే గతంలో సింగీతం శ్రీనివాసరావు కమలహాసన్‌తో పుష్పక విమానం తీసినప్పుడు అదొక కొత్తదనం, ఓ ప్రయోగం…
Ads
ఇప్పుడు గాంధీ టాక్స్ చూస్తుంటే ఆ సినిమా గుర్తొస్తూ ఉంటుంది, కొత్తదనం ఫీల్ కాలేం… పోనీ, కథ అలా మాటల్లేనితనాన్ని డిమాండ్ చేసిందా, నిశ్శబ్దం ఆర్గానిక్‌గా ఉందా అంటే అదీ లేదు… మామూలు కథ, కథనమే… ప్రయోగం కోసం ప్రయోగమే తప్ప అవసరం కోసం ప్రయోగం కాదు…
కానీ సినిమా బాగానే తీశాడు దర్శకుడు… ప్రయోగం చేస్తున్నాను అనే పేరిట ఏదో నాసిరకం సినిమాను ఏమీ ప్రేక్షకుల మీదకు వదల్లేదు… నిజం చెప్పాలంటే మాటలు ఉంటేనే సినిమా ఇంకా బాగుండేదేమో…
పైగా విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరిలకు మంచి చాన్స్ వచ్చింది… మాటల్లేకుండా, చూపులతో మొహాల్లో ఉద్వేగాలు పలికించడానికి ఓ సఫల ప్రయత్నం… వాళ్లే సినిమాకు ఆకర్షణ… అంతేగాకుండా జరీనా వాహెబ్, రోహిణి హట్టంగడి, మహేష్ మంజ్రేకర్… దిగ్గజ నటులను ఎంచుకుని, వాళ్ల నుంచి తనకు అవసరమైనంత నటనను పొందాడు దర్శకుడు కిషోర్ పాండురంగ్ … పొందికగా అమిరాయి పాత్రలు కథలో…

మోడరన్ సౌండ్స్ థియేటర్లను హోరెత్తిస్తున్న రోజుల్లో ఈ మూకీలో ఆ తేడా కనిపించకుండా… రెహమాన్ తన నేపథ్య సంగీతంతో భర్తీ చేశాడు… బాగుంది కూడా… మీరా చోప్రా కూడా నిర్మాణ భాగస్వామి, చాన్నాళ్ల క్రితమే ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో సందడి చేసింది… థియేటర్లకు రావడానికి ఎందుకో గానీ చాలా జాప్యం జరిగింది…
అసలు కథేమిటంటే… ఈ కథ ముంబై నగర నేపథ్యంలోని ఇద్దరు భిన్నమైన వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది… మహదేవ్ (విజయ్ సేతుపతి) ఒక నిరుద్యోగి… మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు కానీ లంచం ఇవ్వలేక ఇబ్బంది పడతాడు… అనారోగ్యంతో ఉన్న తల్లి, తన ప్రేమించిన అమ్మాయి గాయత్రి (అదితి రావు హైదరీ)తో పెళ్లి…. ఇలా తన కలలన్నీ కేవలం ‘డబ్బు’ లేక ఆగిపోతుంటాయి…
మోహన్ బోస్మన్ (అరవింద్ స్వామి) ఒకప్పటి కుబేరుడు… విమాన ప్రమాదంలో భార్యను, పిల్లల్ని కోల్పోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఒంటరివాడైపోతాడు… డబ్బు కోసం మహదేవ్, కష్టాల నుంచి గట్టెక్కడానికి మోహన్… వీళ్లిద్దరూ తీసుకున్న అనూహ్య నిర్ణయాలు ఏమిటి..? వీరు ఎలా తారసపడ్డారు..? అనేదే ఈ చిత్ర ఇతివృత్తం…

రెహమాన్ మ్యూజికల్ మ్యాజిక్ ఈ సినిమాకు బలం… మతం కారణంగా నాకు అవకాశాలు రావడం లేదనే ఫేక్ విక్టిమ్ మాటలు మాట్లాడి ఈమధ్య అల్లరిపాలయ్యాడు గానీ… ఈ సినిమాకు సరైన బీజీఎం అందించి తనలో ఇంకా ప్రతిభావంతుడైన మ్యూజిషియన్ ఉన్నాడని నిరూపించుకున్నాడు…
కథలోని భావోద్వేగాలను ప్రేక్షకుడికి నేరుగా చేరవేశాయి రెహమాన్ స్వరాలు… నేటి తరానికి గాంధీ అంటే కేవలం ‘కరెన్సీ నోటు’ మీద బొమ్మ మాత్రమే అనే చేదు నిజాన్ని ఈ సినిమా ప్రతీకాత్మకంగా చూపిస్తుంది… అందుకే ఈ సినిమాకు ‘గాంధీ టాక్స్’ అనే పేరు పెట్టడం చాలా యాప్ట్ గా ఉంది…
ముగింపు… సౌండ్ బాక్సులు బద్దలయ్యే, ప్రేక్షకుల చెవులు చిల్లులు పడే ఢమ ఢమ ట్యూన్లు, బీజీఎం కాలం ఇది… ఎంత భీకరమైన సౌండ్స్ ఇస్తే అంత గొప్పదనం అన్నట్టు ఫీలయ్యే మ్యూజిషియన్లున్న కాలం ఇది… మామూలు డైలాగుల్ని కూడా హైపిచ్‌లో పలికిస్తేనే పంచ్ అని ఫీలయ్యే దర్శకనటుల కాలం ఇది… ఆ రొటీన్ కర్ణభీకర స్టఫ్ నడుమ ఈ సినిమా ఓ సైలెంట్ కథాగమనం..!!
Share this Article