.
మొన్న ఓ కథనం చెప్పుకున్నాం… లండన్‌లో ఉండే ఓ బ్రిటిషర్ తన ముత్తాత తండ్రి సమాధి భారతదేశంలో ఎక్కడుందో ఏళ్లుగా వెతికి, వెతికి… చివరకు మన హైదరాబాదులో దాన్ని కనిపెట్టి… భార్యతోసహా వచ్చి ప్రార్థనలు చేసి, నివాళ్లు అర్పించాడని..!
తన ముత్తాత తండ్రి సమాధి కోసం ఇంత వ్యయప్రయాసలతో అన్వేషణ దేనికి..? వర్తమానంలో చాలామందికి అనిపించే ప్రశ్న ఇది..! సహజం… ఈ మెటీరియలిస్ట్ ప్రపంచంలో అంతే… కానీ కొన్ని ఎమోషన్లు లెక్కలకు, ఈ సమీకరణాలకు, ఏ లాజిక్కులకూ అందవు… ప్రతి ఉద్వేగం వెనుక లాభనష్టాల ప్రణాళికలుండవ్…
Ads
అందుకే కదా… వందల మంది, వేల మంది… ఈ దేశం నుంచి శిశువులుగా, అనాథలుగా ఏయే దేశాల్లోకో దత్తత పోయినవాళ్లు… పెరిగి, తమ రూట్స్ వెతుక్కుంటూ వస్తున్నారు… తిరుగుతున్నారు… నన్ను కన్నవాళ్లు ఎవరు అనే ప్రశ్నలతో… తన పుట్టుక మూలాల్ని అన్వేషిస్తున్నారు.., అది ఉద్వేగం, దీని ముందు ఖర్చులు, ప్రయాస, లాజిక్కులు వంటివి నిలబడవు… ‘ఏది నా మట్టి’ అనే భావన నిలబడనివ్వదు…
అలాంటి ఉద్వేగ కథే… కాదు వాస్తవమే… మరొకటి చదువుదాం…
మనుషుల మధ్య ఉన్న అనుబంధం కేవలం ప్రాణం ఉన్నంత వరకే కాదు, అది మరణం తర్వాత కూడా అలాగే ఉంటుందని కేరళకు చెందిన శిబు కురియకోస్ నిరూపించాడు… 37 ఏళ్ల నిరీక్షణ తర్వాత తన తండ్రిని తల్లి పక్కకు చేర్చి, తన ప్రేమను చాటుకున్నాడు… ఆ హృదయాన్ని కదిలించే కథ ఇదీ…
శిబు తండ్రి అలెగ్జాండ్రియోస్ ఉద్యోగరీత్యా తన సొంతూరైన కొట్టాయం నుంచి 430 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసరగోడ్ వెళ్లాడు… అక్కడ మతబోధకుడిగా ఉంటూ 1989లో మరణించాడు… అప్పట్లో ఉన్న పరిస్థితుల రీత్యా ఆయనను అక్కడే ఖననం చేశారు…
కాలం గడిచింది… 2021లో శిబు తల్లి థంకమ్మ మరణించింది… ఆమె అంత్యక్రియలను కొట్టాయంలో నిర్వహించారు… అయితే, తన తల్లిదండ్రులు ఇద్దరూ ఒకే చోట లేకపోవడం, ఒకరికొకరు వందల కిలోమీటర్ల దూరంలో సమాధి కావడం శిబును తీవ్రంగా కలిచివేసింది… వారిద్దరినీ ఒకే చోటికి చేర్చాలని ఆయన గట్టిగా నిశ్చయించుకున్నాడు…
ఒక చోట ఖననం చేసిన శవపేటికను మరో చోటికి తరలించడం అంటే మాటలు కాదు… దీనికోసం శిబు ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది…
-
అనుమతులు…: కాసరగోడ్, కొట్టాయం జిల్లాల కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవడం…
-
చర్చిల అంగీకారం…: రెండు ప్రాంతాల్లోని చర్చి అధికారులను ఒప్పించడం…
-
బంధువుల సహకారం…: కుటుంబ సభ్యులందరి నుంచి సమ్మతి పత్రాలు సేకరించడం…
దాదాపు ఏడాది కాలం పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, చర్చిల చుట్టూ తిరుగుతూ శిబు పట్టువదలని పోరాటం చేశాడు…
చివరికి… ఎట్టకేలకు శిబు పట్టుదల ఫలించింది… 37 ఏళ్ల క్రితం కాసరగోడ్ మట్టిలో కలిసిపోయిన తండ్రి శవపేటికను కొట్టాయంకు తీసుకొచ్చారు… గత గురువారం, కొట్టాయంలోని కొల్లాడ్ శ్మశానవాటికలో తన తల్లి సమాధి పక్కనే తండ్రిని కూడా ఖననం చేయించాడు…
“ఎన్నో ఏళ్ల నా కోరిక నెరవేరింది. అమ్మ పక్కనే నాన్నను చేర్చగలిగాను” అని శిబు ఉద్వేగంగా చెప్పాడు…
- “నేటి ఉరుకుల పరుగుల జీవితంలో… బతికున్నప్పుడే తల్లిదండ్రులను పట్టించుకోని వారున్న ఈ సమాజంలో, మరణించిన 37 ఏళ్ల తర్వాత కూడా వారిని ఒక్కటి చేయాలని తపించిన శిబు కురియకోస్ సంకల్పం నిజంగా అభినందనీయం… ఇది కేవలం ఒక రీ-బరియల్ (తిరిగి ఖననం చేయడం) మాత్రమే కాదు… ఒక కొడుకు తన తల్లిదండ్రులకు ఇచ్చిన అత్యున్నతమైన గౌరవం…”
Share this Article