.
అనుకోకుండా రీల్స్‌లో… కపిల్ శర్మ- కమల్ హాసన్ వీడియో బిట్ కనిపించింది… ఒకే సినిమాలో పది పాత్రలు వేయాలని ఎందుకు అనిపించింది అనడిగాడు కపిల్… పెద్ద కన్విన్సింగ్ జవాబు ఏమీ లేదు కమల్ వైపు నుంచి… కానీ ఓ నిజం మాత్రం చెప్పాడు… శివాజీ గణేషన్ ఆల్రెడీ 9 పాత్రలు చేశాడు, నేను ఒకటి యాడ్ చేశాను అని…
ఎస్, పది పాత్రలతో రికార్డు అనేది మాత్రమే ఈ సినిమాకు సంబంధించి కమల్ హాసన్ టార్గెట్… కాకపోతే కొన్ని నిజాలు చెప్పుకోవాలి… కమల్ హాసన్ నటనా ప్రతిభ గురించి ఎవరికీ వీసమెత్తు సందేహం లేదు… అపూర్వ నటుడు… డౌట్ లేదు… కాకపోతే ఈ దశావతారం వెనుక తన లక్ష్యంకన్నా గత శివాజీ గణేషన్, అక్కినేని చాలా బెటర్… పాపం శమించుగాక…
Ads
శివాజీ గణేషన్ (తమిళం – 1964)…: ఇది ఆయన నటించిన 100వ సినిమా... ఇందులో మనిషిలోని తొమ్మిది రకాల భావాలను (నవరసాలు – అద్భుతం, భయం, కరుణ, కోపం, శాంతం, అసహ్యం, శృంగారం, వీరం, ఆనందం) ప్రతిబింబించేలా తొమ్మిది విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు… (దశావతారం సినిమాలో ఉద్వేగాలవారీ పాత్రల్లేవు…)
అక్కినేని నాగేశ్వరరావు (తెలుగు – 1966)…: తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో (‘నవరాత్రి’) తెలుగులో రీమేక్ చేశారు… అక్కినేని కూడా ఈ సినిమాలో తొమ్మిది పాత్రలను పోషించి తన నటనా కౌశలాన్ని ప్రదర్శించాడు… కాకపోతే అన్నీ ఒకే పాయింట్ దగ్గర కలవవు…
ఆ తొమ్మిది పాత్రలు నవరసాలను ప్రతిబింబించేలా వేర్వేరు వృత్తులు, స్వభావాలు కలిగిన పురుష పాత్రలే… కమల్ దశావతారంలో అదనంగా ఓ మహిళా పాత్ర యాడ్ చేశాడు, కానీ మిగతా తొమ్మిది నవరసాల ప్రతీకలు ఏమీ కావు… నవరాత్రి పాత్రలు ఏమిటంటే…
-
అద్భుతం: విద్యావంతుడు (శివ / వేణు)
-
భయం: అమాయకపు పల్లెటూరి వాడు
-
కరుణ: డాక్టర్
-
కోపం: తుపాకీ పట్టుకున్న వ్యక్తి (వేటగాడు/రౌడీ)
-
శాంతం: భక్తుడు లేదా పూజారి
-
అసహ్యం: తాగుబోతు
-
శృంగారం: నాట్య కళాకారుడు
-
వీరం: పోలీస్ ఆఫీసర్
-
ఆనందం: ఒక ముసలి తాత
ఈ రెండు భాషల్లోనూ కథానాయికగా సావిత్రి నటించడం విశేషం…. ఆమె పోషించిన పాత్ర ద్వారానే ఈ తొమ్మిది పాత్రలు కథలో పరిచయమవుతాయి… ఆ తర్వాత ఇదే సినిమాను హిందీలో ‘నయా దిన్ నయీ రాత్’ పేరుతో సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలో రీమేక్ చేశారు…
ఇక దశావతారం విషయానికి వద్దాం… పాన్ వరల్డ్ పాత్రలు కమల్ టార్గెట్… ఓ అమెరికన్, ఓ ఇండియన్, ఓ చైనీస్… ఓ లేడీ బామ్మ… ఓ సిక్కు సింగర్, ఓ సైంటిస్ట్, ఓ ముస్లిం పొడుగు మనిషి… ఇలా అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు… ఆల్ జెండర్స్… ఆల్ ఏజెస్… పది దేశాలు, పది సంస్కృతులు, పది మైండ్‌సెట్‌లతో చెప్పడం…
అసలు సినిమా ఉద్దేశమే దశావతారాలు… దానికి ఓ కార్యకారణ సంబంధం అనే సూత్రం… శైవ, వైష్ణవ వైరుధ్యాలు… ఓ వైరస్ ప్రయోగం వికటించడం (వుహాన్, చైనా, కోవిడ్)… వైరస్‌కు ప్రకృతి విరుగుడు ఉప్పు… స్వదేశంలో వర్ణవివక్ష… సునామీ వెనుక కారణం… ఇలా చాలా అంశాలు కలిపేశారు కన్వీనియెంటుగా…
ఒక్క ముక్కలో చెప్పాలంటే… ఇది ఒక గ్లోబల్ నేరేటివ్ ఎక్స్‌పెరిమెంట్… అయితే సినిమా కథ చుట్టూ గాకుండా, కమల్ పోషించిన పాత్రల్ని బలంగా ప్రజెంట్ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వడం చిరాకు కలిగిస్తుంది అనేకచోట్ల… సరే, ఆ పాత్రల్లోకి వెళ్దాం ఓసారి… (ఓ తుపాకీ తూటా అనుకోకుండా సిక్ సింగర్ గొంతు తాకుతూ వెళ్లి, ప్రాణాంతక అనారోగ్యం ఆటోమేటిక్‌గా నయం కావడం సినిమాటిక్…)
నవరాత్రి సినిమా అచ్చంగా మన సమాజంలోని పాత్రలు, నవరసాల ప్రతీకలు… కానీ దశావతారం ప్రోస్థటిక్ మేకప్పులతో కృత్రిమంగా అనిపిస్తాయి…
🔹 గోవింద్ రామస్వామి …. – సైన్స్, లాజిక్, రేషనాలిటీకి ప్రతీక, – అమెరికాలో పనిచేసే శాస్త్రవేత్త
🔹 క్రిస్టియన్ ఫ్లెచర్ …. – గ్లోబల్ టెర్రరిజం, క్రూరత్వం… – మానవత్వం లేని హింస
🔹 జార్జ్ బుష్ (సటైరికల్ వెర్షన్) … – ప్రపంచ రాజకీయాల ప్రతిబింబం – పవర్ & పాలసీ
🔹 శింగెన్ నరహషి (జపాన్) … – క్రమశిక్షణ, యోధ సంస్కృతి
🔹 అవతార్ సింగ్ (సిక్కు గాయకుడు) …. – కళ, భావోద్వేగం, హ్యూమన్ కనెక్ట్
🔹 విన్సెంట్ పూవరఘన్ …. – పర్యావరణం, సామాజిక బాధ్యత
🔹 బలరామ్ నాయుడు …. – స్థానిక హాస్యం + విచారణ
🔹 కృష్ణవేణి బామ్మ …. – సంప్రదాయం, భక్తి, అమాయకత్వం
🔹 రంగరాజ నంబి (12వ శతాబ్దం) … – భక్తి, త్యాగం, విధి
పదో పాత్ర…: ఖలిఫుల్లా ఖాన్ (Khalifulla Khan)… మత సామరస్యం, మానవత్వం
…. కథ కంటే “కనెక్షన్స్” ముఖ్యం… ఈ సినిమాలో అసలు మేజిక్ ఏమిటంటే… ఈ పాత్రలకి ఒకదానికొకటి సంబంధం లేదు, కానీ అన్ని పాత్రలు ఒకే వైరస్ బాక్స్ కోసం తిరుగుతాయి, చివరికి అందరూ ఒకే ప్రదేశంలో కలుస్తారు… ఇదే “Chaos Theory” ఫీల్…. చిన్న సంఘటనలు → పెద్ద పరిణామాలు… చివరగా చెప్పేది ఏమిటంటే… కథకు తగిన పది పాత్రల క్రియేషన్ కాదు, పది పాత్రల కోసం అల్లిన ఓ కథ… అదే దశావతారం..!!
సినిమాలో బాగా నచ్చిన డైలాగ్.... దేవుడు లేడని నేననడం లేదు... ఉంటే బాగుండు అంటున్నాను... ఇది కమల్ హాసన్ వ్యక్తిగత నమ్మకం, దాన్నే సినిమాలో పెట్టాడు...
Share this Article