.
అంతులేని కథ… నిన్నటికి ఆ సినిమా విడుదలై 50 ఏళ్లు… అప్పట్లో అదొక సూపర్ హిట్ సినిమా… తమిళంలో మొదట సక్సెసైన అవల్ ఒరు తొడర్ కధై సినిమా అది… సుజాత కథానాయిక… తరువాత తెలుగులోకి రీమేక్… జయప్రద కథానాయిక… 1997 లో బెంగాలీలో కబిత అనే టైటిల్ తో రీమేక్… కథానాయిక మాలా సిన్హా… 1983 లో కన్నడంలోకి రీమేక్… కథానాయిక సుహాసిని… 1982 లో జీవన్ ధారా అనే టైటిల్ తో హిందీ రీమేక్… కథానాయిక రేఖ నటించింది …
అందరికీ తెలిసిన కథే… కొన్ని వేల వ్యాసాలు, విశ్లేషణలు వచ్చి ఉంటాయి ఈ యాభై ఏళ్లలో… వాటి గురించి కాదు గానీ… అది బాలచందర్ సినిమా… ఆత్రేయ రచయిత… సందర్భాన్ని బట్టి, పాత్రల తత్వాలను బట్టి పాటలు రాసే రోజులు అవి… కథానాయిక పైకి రాక్షసిలాగా కనిపించినా… అది క్రమశిక్షణ, పొదుపు కోసం అనుసరించే కఠినత్వం… కానీ ఉదాత్త పాత్ర… కుటుంబం కోసం తపన పడుతుంది, ఎవరినీ వదిలేసి తన దారి చూసుకోదు… రాళ్లలో ఉన్నదేదో కళ్లకెలా తెలుసు అని అదే ఆత్రేయ రాసినట్టు… ఆమె కడుపులో మథనం, కడుపులోనే కనిపించకుండా రగిలే కన్నీళ్లు మామూలు కళ్లకెలా తెలుస్తాయి..?
Ads
పైగా సోదరుడు రజినీకాంత్ ఓ తాగుబోతు, బాధ్యతారహితంగా బతికే బాపతు… తన దృష్టిలో చెల్లెలు ఓ రాక్షసి… తన స్వార్థం చూసుకునే పిచ్చిది… అందుకే ఓ సందర్భంలో పాడతాడు… దేవుడే ఇచ్చాడు వీథి ఒకటి అంటూ… ఎప్పుడు విన్నా సరే ఆ ట్యూన్, యేసుదాస్ గొంతు కాసేపు అలాగే చెవుల్లో గింగురుమంటూనే ఉంటుంది… పైగా ఎంఎస్ స్వామినాథన్ స్వరరచన కదా…
వోకే, ఆత్రేయ రచనను విశ్లేషించేంత సీన్ మనకు లేదో, లేక ఆయన ఫిలాసఫీయే మనకు అర్థం కాలేకపోవడమో గానీ… ఆ పాట సరిగ్గా ఆ తాగుబోతుకు తన రాక్షస చెల్లెలి మీద ఉన్న భావనకు, కథానాయిక కేరక్టర్‌కు కూడా నప్పినట్టు అనిపించదు…
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి… ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా…
- ఊరిలో భాగం కాదా వీథి..? వీథిలో భాగం కాదా ఇల్లు..?
ఏల ఈ స్వార్ధం, ఏది పరమార్ధం..?
- కథానాయిక స్వార్థమేముంది..? తను సొంతంగా బావుకున్నది ఏముంది..?
నన్నడిగి తలిదండ్రి కన్నారా.. నా పిల్లలే నన్నడిగి పుట్టారా…
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
- తల్లిదండ్రి అడిగి పిల్లల్ని కంటారా..? పోనీ, నీ పిల్లలు నిన్నడిగి పుట్టలేదు సరే, నీ ప్రమేయం, నీ ఆలోచన, నీ దైహికావసరం కారణంగా పుట్టినవారు కాదా, అందులో అడిగి పుట్టడం ఏమిటి..?
- (ఇదే స్వామినాథన్ పాట, ఆకలిరాజ్యంలో… సాపాటు ఎటూ లేదు అనే పాట… ఇదే ఆత్రేయ రచయిత… ఇదే బాలచందర్ దర్శకుడు… ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా అని రాశాడు ఓచోట… అప్పట్లో దానిపై వివాదం నడిచింది…)
శిలలేని గుడికేల నైవేద్యం, ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు చిట్టమ్మా
కళ్ళులేని కబోది చేతి దీపం నీవమ్మా
- చదవడానికి, వినడానికి బాగున్నా… గుడిలో శిల అంటే శివుడో, దేవుడి విగ్రహమే లేకపోతే నైవేద్యం దేనికి..? ఎవరికి..? కలలో మాత్రమే ఉండే సిరి అంటే సంపదకు ఎందుకు సంబరం..? నిజం కాదు కదా..? ముళ్ల చెట్టుకు కంచె దేనికి, దానికదే ముళ్లు కదా… కళ్లే లేని కబోదికి చేతిదీపం ఇచ్చినా వేస్ట్ కదా… కానీ కథానాయిక కేరక్టర్ వేరు… ఆమె మూర్ఖురాలు కాదు, కలల్లో బతికేది కాదు, తెలివైంది, కుటుంబం పట్ల బాధ్యత ఫీలయ్యే ప్రేమమయి… పైగా ఆ తాగుబోతు దృష్టిలో కూడా ఆమె మూర్ఖురాలు కాదు, తన కోసం ఏదో సంపాదించి దాచిపెట్టుకుంటోంది అనీ అనుకోడు… మరి ఈ వేదాంతం, ఈ ఫిలాసఫీ ఎలా నప్పినట్టు..?
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత
- సేమ్, పైన చెప్పుకున్న విశ్లేషణే ఇక్కడ కూడా…
తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం
అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
- తెలిసేట్టు చెప్పేది సిద్ధాంతం సరే, తెలియకపోతేనే వేదాంతం ఎలా అవుతుంది..? మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రి కేరక్టర్ కాదు తన చెల్లెలిది… తన గురించి తనకు తెలియని అజ్ఞాని కూడా కాదు… ఆ అన్న దృష్టిలో కూడా ఆమె అలాంటి స్వార్థపరురాలు కాదు… మరి ఈ ఫిలాసఫీ ఆ పాత్రలకు గానీ, ఆ సందర్భానికి గానీ ఎలా నప్పుతాయి..?
ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
- ఇక్కడా అంతే… ఆమెది అహంకారం అని అన్న అనుకుంటాడు గానీ మమకారం అనుకోడు… ఆమెది కూడా మమకారమే తప్ప అహంకారం కాదు… ఈ పదాలు, ఈ పాదాలు కూడా సరిగ్గా వర్తించినట్టు అనిపించవు…
సరే, రాసింది ఆత్రేయ... ఆయన రాసినదానికే వంకలు పెడతారా అని కోపగించకండి...!!
Share this Article