.
ఐజేయూ సభలో అనుకుంటా… చంద్రబాబు ఓ మాటన్నాడు… రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉండటం సమాజానికి చేటు అట…! ఎందుకట..? ఏ పార్టీ వాడు వాడి వాయిస్ వినిపించుకుంటాడు… తప్పేముంది..? అసలు పక్షపాతం, పక్షవాతం లేని మీడియా ఏముంది ఇప్పుడు దేశంలో..?!
ఆయన బాధ అది కాదు… ఇంతకుముందు తన సామాజికవర్గం, తన పార్టీ, తనకు కొమ్ముకాసే, వత్తాసు పలికే, క్యాంపెయిన్ చేసే మీడియా మాత్రమే ప్రబలంగా ఉండేది… తన ఎజెండా ప్రకారం అవి కథనాలు వడ్డించేవి… ఆ వాయిసే జాతి వాయిస్‌గా చెలామణీ అయ్యేది… ఇప్పుడు ఆల్టర్నేట్ వాయిస్ కూడా వినిపిస్తోంది… కౌంటర్లు పడుతున్నాయి, అదీ తన బాధ…
Ads
ఏదో ఓ పార్టీకి కొమ్ము కాయడం ఏనాటి నుంచో ఉంది, తెలుగు మీడియాలో కూడా..! కారణాలు, ప్రభావాలు ఏమైనా గానీ, న్యూట్రల్ స్టాండ్ గాకుండా వన్ సైడ్ పొలిటికల్ లైన్ తీసుకోవడం కొత్తేమీ కాదు… కాకపోతే ఇప్పుడు మీడియా అంటే అక్రమ సంపాదనల్ని దారిమళ్లించడానికి ఓ చాయిస్… అక్రమ సంపాదనలకు ఓ రక్షణ… అక్రమాలకు ఓ షీల్డ్…

అందుకే పార్టీల అధినేతలే స్వయంగా మీడియా హౌజులు పెట్టేసుకుంటున్నారు… తమిళనాడు స్టాలిన్ దగ్గర నుంచి అస్సాం హిమంత విశ్వ శర్మ దాకా బోలెడు మంది నాయకులకు సొంత మీడియా హౌజులున్నాయి… పత్రికలు కావచ్చు, టీవీలు కావచ్చు… అంతెందుకు… చిన్నాచితకా లీడర్లకు కూడా ఈరోజు సొంత సోషల్ మీడయా టీమ్స్ మెయింటెయిన్ చేస్తున్నారు… ప్రజెంట్ కాలం సోషల్ మీడియాది కాబట్టి…
ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ అనబడే సోకాల్డ్ పక్షపాత పత్రికలను, ఆ రిపోర్టర్లను కవరేజ్ కోసం బతిమిలాడాల్సి వచ్చేది… ఇప్పుడదేమీ లేదు… ఫేస్బుక్, ఎక్స్, వాట్సప్ వేదికలే శరణ్యం… కాకెపోతే చంద్రబాబు అభిమాన పత్రికలు, టీవీలు ముసుగు కప్పుకుని, కాస్త తలుపుచాటు నుంచి సైగ చేసే బాపతు… సాక్షి, నమస్తే తెలంగాణ వంటివి బజారులోనే నిలబడి కన్నుకొట్టే బాపతు… అదొక్కటే తేడా… నాణ్యమైన జర్నలిజం, నాసిరకం జర్నలిజం నడుమ పెద్ద తేడా కూడా ఏమీ లేదిప్పుడు…

నిజమే… రేవంత్ రెడ్డి చెప్పినట్టే చంద్రబాబు కూడా చెబుతున్నాడు… సోషల్ మీడియా ఓ ముప్పుగా మారిందని..! అవును, డర్టీ క్యాంపెయిన్స్, ఫేక్ వార్తలు, ప్రాపగాండా వీడియోలు, అబద్ధాలు, మార్ఫ్డ్ ఫోటోలు, ఎఐ వీడియాలతో వేల టన్నుల ప్రచార బురదను జనం బుర్రలపైకి వెదజల్లుతున్నాయి పార్టీల సోషల్ టీమ్స్… వందల కోట్ల ఖర్చు… చివరకు ఇళ్లు దాటని నాయకుల కుటుంబాలను కూడా బజారుకు లాగుతూ డర్టీ క్యాంపెయిన్ సాగుతోంది…
ఒకటీ అరా కేసులు పెడుతున్నా నిలవడం లేదు… భావప్రకటన స్వేచ్ఛ ఖచ్చితంగా దుర్వినియోగం అవుతోంది… దీన్ని అడ్డుకోవడానికి ‘స్వీయ నియంత్రణ’ పాటించండి అని ధర్మబోధ చేస్తే, పిలుపునిస్తే అదేమీ పనిచేయదు… ఉద్దేశపూర్వకంగా సాగే ‘మడ్ స్లింగ్’ ఫేక్ జర్నలిజం ఆగదు… ఏదో ఒక చట్టం చేసి కట్టడి చేయడమే ఓ మార్గం… అదెలాగో ప్రభుత్వాలకే అర్థం కావడం లేదు…!!
Share this Article