Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సదరు ప్రవచనకర్తకు అస్సలు నచ్చని 2 వార్తలు..! అవేమిటంటే..?!

March 28, 2026 by M S R

.

గుడ్డూ, గాడిద గుడ్డూ… బడి పిల్లల్ని మరీ శోభనం పెళ్లికొడుకుల్ని చేస్తారా అని ఆ ప్రవచనకర్త ధుమధుమలాడి పోయాడు… కానీ, ప్చ్, తెలంగాణ ప్రభుత్వం ఆ ఆగ్రహాన్ని ఓ గరికపోచలా తీసేసి, ఇంకాస్త దూకుడుగా వెళ్తోంది… అఫ్‌కోర్స్, బడిపిల్లలకు భోజనం అనేది డ్రాపవుట్స్ కోణంలోనే కాదు, అది ఆకలి చావుల్లేని, పౌష్టిక జాతి నిర్మాణం… ప్రవచనకర్తలకు అన్నీ తెలియాలని ఏమీ లేదు, తమకు తెలిసిందే సర్వం అని మాత్రం తెలుసు…

విషయానికొస్తే… ప్రభుత్వం ఏకంగా పాఠశాల మధ్యాహ్న భోజనంలోకి చేపల కూరను ప్రవేశపెట్టబోతోంది… ప్రభుత్వం శాసనసభలోనే చెప్పింది… మరీ కొర్రమీను వంటి చేపలు కాదుగానీ… తిలాపీరకం చేపల్ని ప్రత్యేకంగా పెంచి బడిపిల్లల మెనూలోకి చేర్చాలని ఆలోచన… పెద్ద ఖర్చేమీ కాదు, ఈరకం చేపలు వేగంగా పెరుగుతాయి… చౌక… కాకపోతే హెల్త్ కోణంలో బెటర్ ఆప్షన్…

Ads

మధ్యాహ్న భోజనం అంటే ఇప్పటిదాకా పప్పు, సాంబార్, అప్పుడప్పుడు కోడిగుడ్డు… ఇదే కదా మనకు ఇప్పటివరకు మనకు తెలిసిన మెనూ… త్వరలో, అంటే బహుశా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల పళ్లెల్లోకి ‘తిలాపీ (తిలాపియా)’ చేపలు రాబోతున్నాయి… అసలు ఏమిటీ తిలాపీ స్పెషాలిటీ..? పిల్లల ఆరోగ్యానికి ఇది ఎంతవరకు మేలు చేస్తుంది..?

చేపలకూర

అది చేప కాదు.. ‘అక్వాటిక్ చికెన్’! చేపలంటే బోలెడన్ని ముళ్లు, నీచు వాసన… ఇవే పిల్లలు చేపలకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణాలు… కానీ తిలాపీ కథ వేరు… దీనికి నీచు వాసన చాలా తక్కువ, మాంసం మెత్తగా, తెల్లగా ఉంటుంది… అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో ముళ్లు తక్కువగా ఉండి, కేవలం వెన్నెముక మాత్రమే ఉండటం వల్ల పిల్లలకు వడ్డించడం, వారు తినడం చాలా సులభం… అందుకే దీనిని ముద్దుగా ‘అక్వాటిక్ చికెన్’ అని పిలుస్తారు…

మధ్యాహ్నభోజనం

 “అక్వాటిక్ కోడి” (Aquatic Chicken) అని ఎందుకంటారంటే..? 
వేగవంతమైన వృద్ధి…: కోడి పిల్లల్లాగే ఇవి చాలా తక్కువ సమయంలోనే పెరిగి అమ్మకానికి సిద్ధమవుతాయి…
తక్కువ ఖర్చు: ఇవి కేవలం మొక్కల సంబంధిత ఆహారం (Algae) తిని కూడా పెరగగలవు, కాబట్టి వీటి పెంపకానికి ఖర్చు తక్కువ…

అధిక సంతానోత్పత్తికితోడు సరసమైన ధర…: మార్కెట్లో చికెన్ లాగే సామాన్యులకు అందుబాటులో ఉండే ధరకు లభిస్తాయి… దీని మాంసం మెత్తగా, సులభంగా జీర్ణమయ్యేలా ఉండటంతో పాటు, చికెన్ లాగే అనేక రకాల వంటకాలకు (ఫ్రై, కర్రీ, గ్రిల్డ్) అనువుగా ఉంటుంది…. దీనినే తెలుగులో జలేబి చేప లేదా గురక చేప అని కూడా అంటారు…

తిలాపియా

ఎందుకీ ‘తిలాపీ’ క్రేజ్? మిగతా చేపలతో పోలిస్తే తిలాపీ పెంపకం రైతులకు, ప్రభుత్వానికి లాభసాటి… ఎందుకంటే…: ఇవి కేవలం 6 నుండి 7 నెలల్లోనే పూర్తిస్థాయిలో పెరిగి విక్రయానికి సిద్ధమవుతాయి… మొండి జాతి, నీటి నాణ్యత తక్కువగా ఉన్నా, ఆక్సిజన్ స్థాయిలు తగ్గినా ఇవి తట్టుకోగలవు… సాధారణ చేపలు చనిపోయే వాతావరణంలో కూడా ఇవి రాజీ పడవు… తక్కువ పెట్టుబడి, ఇవి సర్వభక్షకులు కావడంతో నాచు నుండి సాధారణ మేత వరకు ఏదైనా తిని పెరుగుతాయి… తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని ఇస్తాయి…

పోషకాల పుట్ట.. ఆరోగ్యానికి గట్టి చుట్ట! పిల్లల ఎదుగుదలకు అవసరమైన అత్యుత్తమ పోషకాలు తిలాపీలో పుష్కలంగా ఉన్నాయి… ప్రతి 100 గ్రాముల తిలాపీలో సుమారు 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది… ఇది పిల్లల కండరాల పుష్టికి, శారీరక ఎదుగుదలకు ఎంతో మేలు… బరువు పెరగకుండా కేవలం శక్తిని ఇచ్చే గుణం దీని సొంతం… సముద్రపు చేపలతో పోలిస్తే ఇందులో మెర్క్యురీ (పాదరసం) స్థాయిలు చాలా తక్కువ… కాబట్టి చిన్న పిల్లలు, గర్భిణీలు కూడా నిరభ్యంతరంగా తినవచ్చు… ఇందులో విటమిన్ B12, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి…

ఆచరణలో అసలైన సవాలు! ప్రభుత్వ సంకల్పం మంచిదే అయినా, క్షేత్రస్థాయిలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి… తిలాపీలు మురికి నీటిలో కూడా పెరుగుతాయి కాబట్టి, ప్రభుత్వం నాణ్యమైన సాగు నీటిలో పెంచిన చేపలను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది… అలాగే వీటిలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని వడ్డించడం కీలకం…

చివరగా… బహుశా పులుసు పెట్టేస్తారేమో… కానీ పిల్లలకన్నా బయటివాళ్లు ఎక్కువగా ఎగబడే అవకాశమూ ఉంది… ఎందుకంటే, మధ్యాహ్న భోజనానికీ సన్నబియ్యం సప్లయ్ చేయబోతున్నారు… ఒకవైపు ప్రవచనకర్త ఈ తిండి ఎందుకు పెట్టాలి అని గొణుగుతుంటే… చేపలకూర మాత్రమే కాదు, అన్ని పబ్లిక్ స్కూళ్లలోనూ బ్రేక్‌ఫాస్ట్ కూడా పెట్టేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది… అన్నట్టు ఆ బ్రేక్‌ఫాస్ట్ మెనూ తెలుసా..?

బ్రేక్ ఫాస్ట్

ఆరు రోజులు, అయిదు రకాల టిఫినీలు… అందులో మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీ, దోశ, బోండా… పాలు, రాగిజావ… శనివారం బిర్యానీ కూడా..!! అదిరిందయ్యా చంద్రం…! డ్రాపవుట్స్ కాదు, ప్రైవేటు స్కూళ్ల పిల్లలూ మళ్లుతారేమో… కాకపోతే మధ్యాహ్న భోజనం వండి పెట్టే ఏజెన్సీలకు కాస్త శిక్షణ, హైజీన్ మెయింటెనెన్స్ జాగ్రత్తలు అవసరం… గుడ్డు, చేపలు అన్నాక… ఉల్లిపాయలు కూడా వేయని అక్షయపాత్ర వంటివి ఎలాగూ తప్పుకుంటాయి కదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం కమలహాసన్..! త్యాగమో, వైరాగ్యమో, సన్యాసమో… హిట్ వికెట్..!
  • సదరు ప్రవచనకర్తకు అస్సలు నచ్చని 2 వార్తలు..! అవేమిటంటే..?!
  • సారా కొంటేనే రేషన్ పంపిణీ… వ్యభిచారానికి చట్టబద్ధత… ఇంకా..?
  • ఐటీ హబ్ మాత్రమే కాదు… ‘మంచి’రేవులకు భక్తి పర్యాటక వైభోగం…
  • జగదానంద కారకా… జయ జానకీ ప్రాణనాయకా… శుభ స్వాగతం…
  • ‘కొరుకుడుపడని’ రోత… మారితే మల్లెమాల కాదు… జబర్దస్త్ అసలే కాదు…
  • ప్లీజ్ సర్, కాదంటే మా మీదొట్టే… ఈ గౌరవ డాక్టరేట్ తీసుకొండి ప్లీజ్
  • ఎహె… ఈ రేవంతుడికి ఏమీ తెల్వదు, మొత్తుకోదు… ఏదీ సమజ్ కాదు…
  • పోటాపోటీగా తాయిలాలు… రాజకీయాల్లో మాత్రం వెకిలి కూతలు…
  • కాషాయం వదిలేసిన పులిబిడ్డ … తమిళ జాతీయవాదానికి సై…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions