.
నయా రాజులు… కాదు రాజులను మించి… బహుశా రాజరికాల్లో కూడా ఈ దొరతనం లేదేమో… మన ప్రభుత్వ అధికారులు కొందరు అనుభవిస్తున్న పెత్తనాలు, వైభోగాలు, విలాసాలు… అన్నింటికీ మించి వ్యక్తిత్వ ప్రదర్శనలో అడుగడుగునా కనిపించే రోతతనం ముందు ఏ రాజరికమూ పనిచేయదేమో…
వివరాల్లోకి వెళ్దాం… అసలు బీఎస్ఎన్‌ఎల్ దురవస్థకు ప్రధాన కారణం ఆ సంస్థను ఉద్దరించే ఉన్నతాధికారులే… ఎవడికీ కాలంతో పోటీపడే ఆలోచనలు ఉండవు, సంస్థ మునిగిపోతున్నా చలనం ఉండదు… ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు దానికి వేలు, లక్షల కోట్లు ఇస్తూ, ఇంకా పోషిస్తూ ఉంటుంది…
Ads
బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ కథ ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది.., ఆయన పేరు వివేక్ బంజాల్… సారు గారికి హఠాత్తుగా ప్రయాగరాజ్‌లో మునిగి పుణ్యం తెచ్చుకోవాలని… కాదు, తను చేస్తున్న పాపాలన్నింటినీ కడగేసుకోవాలని అనిపించింది… మరి దొరవారి పర్యటన అంటే మామూలు విషయం కాదు కదా…
అన్నా బయలెల్లినాడే… అన్నట్టుగా ఆయన దీనికోసం తాజాగా జారీ చేసిన ఆర్డర్ కాపీ చూస్తుంటే… మనం 2026లో ఉన్నామా లేక 19వ శతాబ్దపు జమీందారీ వ్యవస్థలో ఉన్నామా అన్న సందేహం రాక మానదు… ఈ పర్యటనకు కనీసం 50 మంది సేవకగణం కావాలట… అంతేకాదు…
ఫిబ్రవరి 25, 26 తేదీల్లో జరగాల్సిన ఆయన గారి ‘వ్యక్తిగత’ తీర్థ యాత్ర కోసం ఏకంగా ఒక సైన్యాన్నే మోహరించాలని హుకుం జారీ చేశాడు… ఆ జాబితాలో పనులు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు…
ఏమిటా వింత పనులు?
రైలు దిగగానే రాచమర్యాదలు కావాలట… ఆయన గారు స్టేషన్‌లో కాలు పెట్టగానే ‘వెల్కమ్’ చెప్పడానికి ఒక బ్యాచ్ రెడీగా ఉండాలట… పుణ్యస్నానం చేసేటప్పుడు లోదుస్తులు పట్టుకోవడానికి ఒకరు కావాలట, సోపు అందించడానికి ఒకరు కావాలట, తువ్వాలు రెడీగా ఉంచడానికి ఇంకొకరు కావాలట.. ఇలా ప్రతి పనికీ ఒక మనిషి కావాలట!
అడుగు తీసి అడుగు వేస్తే చాలు… చేతికి చాక్లెట్లు, స్నాక్స్, వాటర్ బాటిళ్లు అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఆయన వెంట పరుగెత్తాలట… గంగలో విహరిస్తుంటే గొడుగు పట్టడానికో, లేక ముచ్చట్లు చెప్పడానికో మరికొందరు సిద్ధంగా ఉండాలట… ఇవన్నీ ఆయన ఆర్డర్ చేసినవే… నవ్వొచ్చిందా..? ఇలాంటోళ్లు కదా మన సంస్థల్ని ఉద్దరిస్తున్నారని విరక్తి కలుగుతోందా..?
మంత్రిగారి ఎంట్రీ… సీన్ రివర్స్!
ఈ ‘ఆర్డర్ కాపీ’ కాస్తా సోషల్ మీడియా పుణ్యమా అని వైరల్ అయి ఢిల్లీ దాకా పాకింది… కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కంట పడటంతో సీన్ ఒక్కసారిగా అడ్డం తిరిగింది… అంతటి రాజవంశీకుడే హాశ్చర్యపోయాడు… “ఇదేం పద్ధతి నాయనా!” అంటూ సదరు మంత్రి గారు మండిపడటంతో, బంజాల్ గారికి ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు అందింది… దీంతో భయపడిపోయిన మన డైరెక్టర్ గారు.. పుణ్యం సంగతి దేవుడెరుగు, ముందు పదవి కాపాడుకుంటే చాలని యాత్రను రద్దు చేసుకుని సర్దుకున్నారు…
ముక్తాయింపు… సంస్థ నష్టాల్లో ఉందని చెప్తూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి వెనకాముందు చూసే బిఎస్ఎన్ఎల్ లాంటి చోట… ఒక డైరెక్టర్ స్థాయి వ్యక్తి ఇలా 50 మందిని తన పర్సనల్ పనులకు వాడుకోవాలనుకోవడం సిగ్గుచేటు… వచ్చే సెప్టెంబర్‌లో రిటైర్ కాబోతున్న ఈయనకు, వెళ్లేలోపు ఇలాంటి ‘ఘనకార్యం’ చేసి వార్తల్లో నిలవాలని ఉందేమో..! అన్నట్టు అంతటి రాజ సింధియా కూడా షాక్ తిన్నాడంటే మరి మామూలు విషయమా..? మామూలు అట్టహాసమా మరి..!!
Share this Article