Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తడి తడిమే ఓ ఆర్ద్రగీతం- కర్కశ హృదయుల కళ్లూ చెమర్చాల్సిందే

August 18, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. యన్టీఆర్ , సావిత్రి , సూర్యకాంతం నటించిన రక్తసంబంధం సినిమా చూసి కంట తడిపెట్టకుండా థియేటర్ లోనుంచి బయటకు రావటం అసాధ్యం . అలాంటి మరో సినిమా 1993 లో వచ్చిన సినిమా ఈ మాతృదేవో భవ . ఎంతటి కర్కశ హృదయుడుకయినా కళ్ళు చెమ్మగిల్లాల్సిందే .

మాధవి నట కిరీటంలో ఓ కలికితురాయి ఈ సినిమా . ఆమె అనేక హిట్ సినిమాలు చేసి ఉండవచ్చుగాక, ఇదీ నా సినిమా అని చెప్పుకునేది, కోట్లాది మంది జనానికి చేరువైంది ఈ పాత్రతోనే! మళయాళంలో వచ్చిన Akasadoothu సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . రెండు భాషల్లోనూ మాధవే హీరోయిన్ . అద్భుతంగా నటించింది . మళయాళంలో మాధవి , మురళి ప్రధాన పాత్రల్లో నటించారు .

Ads

మళయాళం సినిమాకు ఆధారం 1983 లో వచ్చిన Who will love my children . తెలుగులో సక్సస్ అయ్యాక తమిళంలోకి డబ్ చేసారు . హిందీలోకి తులసి అనే టైటిలుతో రీమేక్ అయింది . మనీషా కోయిరాలా , ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు .

మరాఠీ భాషలోకి చిమని పఖర్ టైటిలుతో రీమేక్ అయింది . ఇందులో పద్మిని కోల్హాపురి , సచిన్ లీడ్ రోల్సులో నటించారు . కన్నడంలోకి కరళిన కూగు టైటిలుతో రీమేక్ అయింది . వినయ ప్రసాద్ (లేడీ) , ప్రభాకర్ లీడ్ రోల్సులో నటించారు . అంత ఘన విజయాన్ని సాధించింది ఈ సినిమా కధ .

మద్యపానం వ్యతిరేక ప్రచార ఉద్యమకారులు ఊరూ వాడా ఈ సినిమాను వీధుల్లో తెర కట్టి చూపాలి . Of course . మద్యపానాన్ని నిజాయితీగా తరిమేయాలి అని అనుకునే ప్రభుత్వాలు . ఈ సినిమా కధంతా ఓ మంచివాడే అయినా తాగుబోతు కావటం వలన అతని భార్య ప్రతి కీచకుడికీ లోకువ అవుతుంది .

అలాంటి కీచకుడు ఒకడితో ఆ తాగుబోతు గొడవపడి చివరకు అతని చేతుల్లో చంపబడతాడు . అప్పటికే కేన్సర్ పేషంటుగా తెలియపరచబడిన మాతృమూర్తి తాను చనిపోయే లోపు తన నలుగురు బిడ్డల్ని దత్తతకు ఇస్తుంది . ఆ నలుగురిలో ఒకడు పోలియో బాధితుడు . అతను తప్ప మిగిలిన ముగ్గుర్ని దత్తత తీసుకుంటారు . ఈ సీన్లన్నీ గుండెల్ని పిండేస్తాయి .

ఆ మాతృమూర్తి చనిపోయాక పోలియో బాధితుడిని కూడా ఆ ముగ్గురిలో ఒకరిని దత్తత తీసుకున్న దంపతులే చివరకు దత్తత తీసుకుంటారు . చివరి అరగంటా గుండెల్ని పిండేస్తుంది సినిమా . అలాంటి బేక్ గ్రౌండ్ మ్యూజిక్కుని అందించిన కీరవాణికి హేట్సాఫ్ . నాలుగు పాటలు ఉంటే వాటిల్లో రెండు పాటలకు అవార్డులు కూడా వచ్చాయి .

అన్ని పాటల్నీ వేటూరి వారే వ్రాసారు . రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే పాటకు జాతీయ పురస్కారం లభించింది . శ్రీశ్రీ తర్వాత ఈ అవార్డుని గెలుచుకున్నది వేటూరే ఈ పాటకు . (తెలుగులో ఈ సినిమా హిట్ కావటానికి, గుండెలు పిండేసే మాధవి నటనకుతోడు పాటలు కూడా ఓ ప్రధాన కారణం)…

చిత్ర పాడిన అత్యంత శ్రావ్యమైన పాట వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి నంది అవార్డు వచ్చింది . ఈ పాట రిపీట్ అయినప్పుడు కళ్ళు చెమ్మగిల్లాల్సిందే . మిగిలిన రెండు పాటలు కూడా శ్రావ్యంగానే ఉంటాయి . కళ్ళల్లో చినుకులు కురుస్తూనే ఉంటాయి , రాగం అనురాగం సంసారం అంటూ సాగుతాయి . బాలసుబ్రమణ్యం , కీరవాణి , చిత్ర శ్రావ్యంగా పాడారు .

మాధవితో నాజర్ పోటీ పడి నటించాడు . విలన్ గా తనికెళ్ల భరణి , అనాధాశ్రమం నిర్వాహకులుగా చారంహాసన్ , సుబ్బయ్య శర్మ నటించారు . శర్మ గారికి మంచి పేరు వచ్చింది . ఇతర ప్రధాన పాత్రల్లో నారాయణరావు , సుధ , కోట శ్రీనివాసరావు , వై విజయ , అల్లు రామలింగయ్య , నిర్మలమ్మ , బ్రహ్మానందం , ధర్మవరపు సుబ్రమణ్యం , సారధిలు నటించారు . పిల్లలుగా బేబీ సీనా ఏంటొనీ , మాస్టర్ మార్టిన్ , మాస్టర్ తేజ నటించారు .

క్రియేటివ్ కమర్షియల్ బేనరుపై కె యస్ రామారావు నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు అజయ్ కుమార్ . చక్కని కధ , చిక్కని స్క్రీన్ ప్లే , అద్భుతమైన దర్శకత్వం , శ్రావ్యమైన సంగీతం , గొప్ప సాహిత్యం , మాధవి గొప్ప నటన , వెరశి an unmissable movie .

సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు తప్పక చూడండి . చూసినా మళ్ళా చూడతగ్గ సినిమాయే . మద్యపాన వ్యతిరేక ఉద్యమకారులు ఈ సినిమాను రోడ్ల మీద తెర కట్టి ఒక ఉద్యమంలాగా వేయించాలని నా అభ్యర్ధన . ప్రభుత్వాలు ఎలాగూ సహకరించవు . నిషేధించకుండా ఉంటే అదే పదివేలు ….

రాలిపోయే పువ్వా పాటపై ఓ నిశిత విశ్లేషణ… ఇదుగో లింక్…



‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’… తడి తడిమే వేటూరి ఆర్తగీతిక !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తడి తడిమే ఓ ఆర్ద్రగీతం- కర్కశ హృదయుల కళ్లూ చెమర్చాల్సిందే
  • మంత్రి క్షమాపణ ! ఇది స్వీయ అభిశంసన !! అయ్యో, పొంగులేటి !!
  • ధ్రువ… ఆ రీల్ అపరిచితుడి కొడుకేనా ఈ రియల్ అపరిచితుడు..?!
  • ఛిన్న మస్తాదేవి ! ఓ స్టేజ్ షో ప్రదర్శనపై రచ్చ ! అసలేం జరిగిందంటే !!
  • ఫాఫం తెలంగాణ బీజేపీ ! హైకమాండ్ గాలికి వదిలేసినట్టుగా ఉంది !!
  • ఏసేశాడు, రేవంత్ రెడ్డి మళ్లీ ఏసేశాడు..! సెటైర్ భలే పేలింది !!
  • సంస్కార దారిద్య్రం !! మీ దుంపతెగ- ఇదేం భాషరా బాబూ..!!
  • నా లైఫ్ నేను మాత్రమే మార్చుకోవాలి… ఇంకెవరో ఆ పని చేయరు…
  • మహేశ్ బాబూ – ఇక ఈ యాడ్స్ జోలికి వెళ్లకు – అవి శిక్షార్హమే !!
  • Flipkart – నీ దుంపతెగ- చావును కూడా అమ్ముకోవడం ఏమిట్రా ?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions