.
నెల్లూరు నుంచి వెలువడే ఓ హిస్టారికల్ పత్రిక జమీన్ రైతు… గతంలో కూడా చెప్పుకున్నాం… ఈసారి ఎడిషన్లో ఓ పచ్చి నిజాన్ని కుండబద్ధలు కొట్టేసినట్టు ప్రచురించింది… జగన్ చెబుతున్న మావిగన్ అనేది ప్రతిపాదన కాదు, సూచన కాదు, వెటకారం కాదు… అదొక హెచ్చరిక చంద్రబాబుకు… తన ఫస్ట్ పాలనకాలంలో అమరావతి స్టార్ట్ చేసి, అర్థంతరంగా వదిలేసిన చంద్రబాబు ఇప్పుడూ అదే చేస్తే, జగన్ గనుక మళ్లీ అధికారంలోకి వస్తే ఫస్ట్ తీసుకునే నిర్ణయం… మళ్లీ అమరావతిని బొందపెట్టడమే…
మరి చంద్రబాబు ఏం చేయాలి..? వేల ఎకరాల్ని కొత్తగా సమీకరిస్తూ, లక్షల కోట్లను ఖర్చుపెట్టడానికి పూనుకుంటున్న చంద్రబాబు కర్తవ్యం ఏమిటి..? నిజానికి ఏపీవ్యాప్తంగా ఇదే కీలకచర్చ… ఇప్పుడు కూడా రాజమౌళి బాపతు గ్రాఫిక్ నమూనాలు, హైపులతో కాలం గడిపితే… రేప్పొద్దున తేడా కొడితే అమరావతిని పునాదుల నుంచీ పెకిలిస్తాడు జగన్ అనేది ఆ పత్రిక అభిప్రాయం… పరోక్షంగా జగన్ చెబుతున్నదీ అదే…
Ads
సదరు పత్రిక అభిప్రాయాన్ని సంక్షిప్తంగా చెప్పాలంటే ఇలా…
– ఏ కారణం చేతనైనా జగన్కు అవకాశం చిక్కితే అమరావతిని నల్లిని నలిపినట్లు నలిపేయడం ఖాయం… ఆ ప్రమాదం తప్పాలంటే, పనులన్నీ పూర్తి కావాలి…
– రైతుల త్యాగంతో లాభం పొందాలనుకోవడం దేముడి సొత్తు తిన్నంత పాపం… జనం లేని అమరావతి భూత్ బంగళా నగరంగా మిగిలి పోతుందని గ్రహించలేకున్నారేమి? కలల్లో, భ్రమల్లో బ్రతకడం మాని నేలమీదకు రావడం చంద్రబాబు బాధ్యత…
మావిగన్ – ఒక ఎగతాళి ప్రతిపాదన. వెటకారంతో సమానం. జగన్ ఎందుకు అస్త్రం బయటకు తీశాడో తెలీదు. ముందుగా అనుకొని చెప్పాడో లేక ప్రెస్ కాన్ఫరెన్స్లో అప్పటికప్పుడు నోటికొచ్చిన మాట బయట పెట్టాడో తెలీదు. మెడ మీద తలకాయ వున్నవాడెవడూ, 180 కిలోమీటర్ల పొడవునా, రోడ్డు పక్కన ప్రభుత్వ భవనాలు కట్టుకుంటూ పోయి, దాన్ని రాజధానిగా చూడమని చెప్పడు.
ప్రభుత్వ వ్యవస్థ అంటే డాబా హోటళ్లు కట్టడం కాదు. సచివాలయాలలో, ఒకే సముదాయంలో ఒక భవనం నుంచి మరొక భవనానికి వెళ్లాలంటేనే ఎన్నో సమస్యలొస్తుంటాయి. సచివాలయం, శాసనసభల మధ్య దూరం పెరిగితే చాలా ఇబ్బందులు వుంటాయి. శాసన సభ్యులు అడిగే ప్రశ్నలకు అధికారులు అప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. దూరం ఎక్కువైతే చాలా సమస్య.
మంత్రిత్వ శాఖ అధికారులకు, దాని క్రింద పనిచేసే డిపార్ట్మెంట్ అధికారులకు మధ్య సమన్వయం కూడా మహా సమస్య. రెండూ వేరు వేరుగా వుంటే, పనులు కుంటినడక నడుస్తాయి. అటువంటిది 180 కిలోమీటర్ల పొడవులో, పది లేదా పాతిక మైళ్లకొక మంత్రి, ఒక అధికారి, ఒక శాఖ, ఒక విభాగం నెలకొల్పి, దాన్నే రాజధాని అని పిలిస్తే, పిచ్చి తుగ్లక్ కూడా సమాధి నుంచి లేచి, ఫక్కున నవ్వుతాడు.
కానీ జగన్ నోటి మహాత్యమేమో కానీ, మావిగన్ పలుకు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నది. ఇది ఆచరణ సాధ్యం కాదని తెలిసినా, వైసిపి అభిమానులు, కులాభిమానులు దీన్ని పెద్దఎత్తున చర్చలో పెడుతున్నారు. ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యమే అని మొండిగా వాదిస్తున్నారు. ఆ వాదనలను తిప్పికొట్టలేక ఆపసోపాలు పడుతున్నది తెలుగుదేశం పార్టీ.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట, దీన్ని తేలికగా తీసుకున్నాడు. నవ్వులాటగా భావించాడు. కానీ రోజులు గడిచే కొద్దీ, వైసిపి ఆ నినాదాన్ని ప్రజలలోకి తీసుకెళ్తున్న తీరు చూసి, ఉలిక్కి పడుతున్నాడాయన. అమరావతిని అడ్డుకోవడానికి ఒక పథకం ప్రకారమే ఈ ప్రతిపాదన చర్చలోకి తెచ్చారన్న అనుమానం బలపడుతున్నది.
నిజానికి జగన్ అధికారంలో వున్నప్పుడే, తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకుంటున్నట్లు హైకోర్టుకు తెలిపాడు. అప్పుడు కానీ, ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో కానీ, మూడు రాజధానులకు బదులుగా తన వద్ద ప్లాన్-బి వుందని చెప్పలేదు. అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ మొదలు పెట్టినప్పుడు అభ్యంతరం చెప్పలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై పార్లమెంటులో చట్టం చేయగానే, జగన్ ఆక్రోశం వెలికి వచ్చింది. అమరావతి వద్దు అనే తన పాత వాదనను మళ్లీ బయటకు తీశాడు.
అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ మీరు చట్టం చేస్తే, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేయలేనా అని ప్రశ్నించాడు జగన్. పార్లమెంటులో ఒకసారి ఒక చట్టం చేసిన తర్వాత ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర శాసనసభ దాన్ని మార్చలేదన్న నిజం అందరికీ తెలుసు. కానీ ఈ ప్రకటన చేయడం ద్వారా జగన్ తన అభిమతాన్ని బహిర్గతం చేశాడు. అమరావతి రాజధాని విషయంలో తన వ్యతిరేకతను కడుపులో దాచుకోకుండా వెళ్లగక్కాడు. వూరికే మాటలతో వదలి పెట్టకుండా, దానిపై తన పార్టీతో ఒక ఉద్యమమే నడిపిస్తున్నాడు.
గతంలో వలె, ఈ రెండేళ్ల వ్యవధిలో కూడా చంద్రబాబు అమరావతి నిర్మాణం విషయంలో చాలా ఆలస్యం చేశాడు. మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన అధికారులు, రెండేళ్ల తర్వాత వెనక్కు తిరిగి చూస్తే, పునాదులు కూడా పడని దుర్గతి. కారణాలు ఏవైనా కావచ్చు. జగన్ చేతికి చిక్కితే మాత్రం అమరావతి నలిగి నాశనమై పోవడం ఖాయం. అది భూములిచ్చిన రైతులకు ఆత్మహత్యతో సమానం. వారి భూములు ఎందుకూ పనికి రావు. తీసుకున్న ప్లాట్లు కూడా ఎవరూ కొనరు. రైతుల దుర్గతి ఊహించుకుంటేనే భయం వేస్తున్నది.
ఈ ప్రమాదానికి చంద్రబాబు వ్యక్తిగతంగా బాధ్యుడు అవుతాడు. ఆయన మాటలు నమ్మి భూములిచ్చారు రైతులు. వారి కొంపలు కొల్లేరు చేస్తే, చరిత్రలో ఆయనకు లభించే స్థానం అధమాధమంగా వుండబోతుంది. ఆ ప్రమాదం తప్పించుకోవాలంటే, యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులను పరుగులెత్తించాలి. అధికారులు చెప్పే కథలకు తల ఊపితే ప్రయోజనం లేదు. పనులు జరగాలి. వేరొక మాటకు తావు లేదు.
తాను చెప్పిన మావిగన్ ప్రతిపాదన, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ ఆచరణకు తెస్తాడని భావించలేము. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని అనాధ రాష్ట్రంగా మిగిల్చేందుకే ప్రయత్నం చేస్తాడు. జగన్ ధోరణి స్పష్టం. చంద్రబాబు సమర్ధతే ఇప్పుడు ప్రశ్నార్ధకం.
అసలు అమరావతి మీద చంద్రబాబుకు ఒక నిర్దుష్టమైన అభిప్రాయం వుందా అన్న అనుమానం కలుగుతున్నది. అమరావతి రాజధాని ప్రాంతంగా ఒక నిర్ణీత ప్రదేశాన్ని ఎప్పుడు గుర్తించారు. సరిహద్దులు నిర్ణయించారు. కానీ ఈ రోజు వరకు అధికారిక కార్యకలాపాలలో అమరావతి రాజధానిగా గుర్తించడం లేదు. ముఖ్యమంత్రి లెటర్ హెడ్ మీద కానీ, ఛీఫ్ సెక్రటరీ ఉత్తర్వులలో కానీ, వెలగపూడి సచివాలయం, గుంటూరు జిల్లా అని వుంటున్నదే తప్ప అమరావతి అనే పేరు లేదు. దాన్ని రాజధానిగా నిర్ణయించినప్పుడు ఎందుకు ఆ పేరు వాడకంలో పెట్టడం లేదన్నది ప్రశ్న.
కూకట్పల్లి నుంచి ఎల్బినగర్ వరకు, లింగంపల్లి నుంచి చాంద్రాయణగుట్ట వరకు, బొల్లారం నుంచి గచ్చిబౌలి వరకు హైదరాబాద్ అనే పిలుస్తారు తప్ప, విడివిడిగా పేర్లతో పేర్కొనరు. తెలంగాణా ప్రభుత్వ ఉత్తర్వులన్నీ హైదరాబాద్ పేరుతోనే వెలువడతాయి. మరి అది అమరావతిలో ఎందుకు జరగడం లేదు. ఎవరు చెప్పాలి ఈ ప్రశ్నకు సమాధానం?
అమరావతిలో అవినీతి రాజ్యమేలుతున్నది. నిర్మాణాల విషయంలో జగన్ చేసిన ఆరోపణలు నిజం. నిర్మాణ ఖర్చు విపరీతంగా పెంచారు. దీనిపై విమర్శ వస్తున్నప్పుడు, కనీసం ఆ పెంపుదలకు కారణమైనా చెప్పాలి. కానీ చంద్రబాబు వద్ద సమాధానం లేదు. అమరావతి భూములను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించడంలో కూడా పెద్దఎత్తున అవినీతి జరుగుతున్నదని, ప్రభుత్వానికి చెల్లించేది ఒక ధర అయితే, ప్రైవేట్ కంపెనీల నుంచి అనధికారికంగా వసూలు చేసేది వేరొక ధర అనే ఆరోపణ వుంది.
రైతుల త్యాగాన్ని తమ అవినీతి దాహం కోసం ఎవరు దుర్మార్గానికి పాల్పడినా, వారు పాపుల క్రింద లెక్క. చంద్రబాబు అమరావతిని దేవతల రాజధానిగా చూస్తున్నాడే తప్ప, అక్కడ నివాసం వుండేది ఎవరు అనే ఆలోచన చేయడం లేదు. మనుషులు లేని భవనాలు దెయ్యాలు నివసించే భూత్ బంగళాలుగా మారిపోవడం ఖాయం. అది జరగకుండా వుండాలంటే, పేద, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి, చిన్న చిన్న వృత్తులతో జీవనం గడిపేవారికి అమరావతిలో నివాస అవకాశం ఇవ్వాలి. అది ప్రభుత్వమే చేయాలి.
రైతుల వద్ద భూములు కొని మహా మహా సంపన్నులు కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఇతరులెవరూ అక్కడ నివసించలేరు. ప్రభుత్వమే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఇల్లు కట్టించడం లేదా ఇల్లు కట్టుకునే అవకాశం ఇస్తే తప్ప అమరావతిలో జనం సందడి ఏర్పడదు. ఎందువల్లనో ఈ సున్నితమైన అంశాన్ని విస్మరిస్తున్నాడు చంద్రబాబు. జనం లేని రాజధానిగా అమరావతిని భ్రష్టు పట్టించబోతున్నాడు. తక్షణమే ఈ తప్పు సవరణ జరగాలి….’’
Share this Article