.
Subramanyam Dogiparthi ….. మైనర్ రాజాలు , మైనర్ బాబులు ఉంటారు గానీ మేజర్ రాజాలు , మేజర్ బాబులు ఉండరు . మేజర్లు అయ్యేటప్పటికి జుట్టు నెరిశి , వయసుడిగి , అనుభవాలు మూట కట్టుకుని బుధ్ధులు బాగుపడతాయి . ఇవన్నీ జరిగినా బుధ్ధులు మారని బడుధ్ధాయిలు , ముదుర్లు ఉంటారనుకోండి . అయితే సంఖ్య తక్కువ .
మంగమ్మ శపధం సినిమాలో రాజు గారిలాగా ఈ మైనర్ రాజా కూడా రోడ్ మీదకొస్తే సంసారులు దాక్కుంటారు . వయ్యారులు ఎదురు చూస్తుంటారు , ఎగబడుతుంటారు . అనుకోకుండా ఓ గడుగ్గాయి అమ్మాయి శోభన ఎదురుపడి సవాల్ విసురుతుంది .
Ads
ఆ ఊరికే టీచరమ్మ ఉద్యోగానికి వచ్చిన రేఖ (Sumithra Josephine అనే పేరు కూడా ఉంది) మైనర్ బాబు వీరోయిజానికి ముగ్ధురాలై ప్రేమలో పడుతుంది . పెళ్లి చూపులకని వచ్చిన మైనర్ బాబు పెళ్ళి చూపుల్లో డాన్స్ చేయటంతో ఆ ఉరి పాతికేళ్ళ ప్రెసిడెంట్ విలన్ ఫిట్టింగ్ పెట్టి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేలా కారణం అవుతాడు .
(రేఖ జోసెఫెన్ అలియాస్ సుమిత్ర జోసెఫెన్… తెలుగులో చాలా తక్కువ ఈ నటి కెరీర్… తమిళం, మలయాళం సినిమాలు ప్లస్ టీవీ…)
అప్పటికే కాస్త కాస్త మనసు పారేసుకుంటున్న శోభన డిజప్పాయింట్ అవుతుంది . మైనర్ బాబుని రెచ్చగొట్టి అతను తనను ఎత్తుకుపోయాక పంచాయతీ పెడుతుంది . ధర్మపత్ని రేఖ శోభనను ఇంట్లోకి తెచ్చుకుంటుంది . కానీ మైనర్ రాజా భార్య స్థానాన్ని ఇవ్వడు .
శోభన కోసం కాచుకు కూర్చున్న ప్రెసిడెంట్ విలన్ కోట శ్రీనివాసరావు మైనర్ రాజా కొడుకుని కిడ్నాప్ చేస్తాడు . క్లైమాక్స్ ఫైటింగులో శోభన కోట శ్రీనివాసరావును చంపటంతో సినిమా ముగుస్తుంది . ఇదండీ టూకీగా కధ . అరవ వాసన బాగానే కనిపిస్తుంది . తమిళంలో బాగా ఆడిన Malluvetti Minor సినిమాను మన తెలుగులో మైనర్ బాబుగా రీమేక్ చేసారు . తమిళంలో సత్యరాజ్ , శోభన , సీత లీడ్ పాత్రల్లో నటించారు . తెలుగులో ఓ మాదిరిగా ఆడినట్లుంది . (ఏమో, ఈ సినిమా ఒకటి వచ్చినట్టు కూడా ఎవరికీ గుర్తులేదు)…
రాజోలు , ఆ చుట్టుపక్కల షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో గోదావరమ్మ అందాలను , స్థానిక గ్రామీణ వాతావరణాన్ని బాగా ఉపయోగించుకున్నారు . మైనర్ రాజాగా రాజేంద్రప్రసాద్ బాగానే నటించాడు . గడుగ్గాయిగా శోభన , టీచరమ్మగా రేఖ గ్లామర్ స్పేసుని ఫిల్ చేసారు . విలన్లుగా కోట శ్రీనివాసరావు , నర్రా చెప్పేదేముంది ! పండిపోయారు కదా ! శోభన అన్నలుగా మల్లిఖార్జున రావు , సంజీవి , వదినలుగా అనిత , ఫణి నటించారు .
- ఓ పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి . సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లి రాజు పాత్ర లాంటి పాత్ర 1991 లో వచ్చిన ఈ సినిమాలోనే కనిపిస్తుంది . మైనర్ రాజా కొడుకుగా మైనర్ చక్రవర్తిని అని చెప్పుకుంటూ ఉంటాడు ఈ బుడ్డోడు .
గోదావరి జిల్లాలు అనగానే పిఠాపురం , పెద్దాపురం , రాజమండ్రి గుర్తుకు రావాలి కదా . మరి ఇప్పుడు ఆ ఆనవాయితీ , సాంప్రదాయం ఉన్నాయో లేవో కానీ ఒకప్పుడు ఇంటి అల్లుడుకి చేసిన మర్యాదలన్నీ చేసేవారట . ఆ పాత్రలో వయ్యారాల వై విజయ ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా అదరగొట్టేస్తుంది .
ఈ ఊళ్ళ నుండి దండెత్తినట్లు ఓ గుంపు గుంపు వచ్చి మైనరయ్యతో తోట పాట , బృంద నృత్యం కూడా ఉంటాయి . బాపు గోరంత దీపం సినిమాలో బృంద నృత్యంలాగా బాగుంటుంది . జయమాలిని , వై విజయ , మమత ముందు వరుసలో ఉంటే రిటైర్డ్ బామ్మలు వెనుక వరుసలో ఉంటారు .
ఓ మదనా సుందరా అంటూ పాటను లంకించుకుంటారు . సినిమా చూసినా చూడకపోయినా ఈ పాట వీడియోని ఎంజాయ్ చేయండి . ఇంకా సినిమాలో బ్రహ్మానందం , హనుమంతరావు , సుబ్బరాయ శర్మ తదితరులు నటించారు .
మైనర్
విద్యాసాగర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు థియేటర్లో పర్లేదు, బాగానే ఉంటాయి . ఏందమ్మో మగసిరి అంటూ సాగే పాట శోభన , ఆమె స్నేహితురాళ్ళ మీద అందంగా చిత్రీకరించబడింది . అలాగే చెలియా అనే పాట శోభన , రాజేంద్రప్రసాదు మీద బాగుంటుంది .
1+2 పాట కూడా ఒకటి ఉంది . వెన్నెల వేడిక్కించే నీ చూపులు అంటూ సాగే పాటలో శోభన , రేఖ ఇద్దరూ మైనర్ రాజాతో ఊహల్లో విహరిస్తారు . ముగ్గురి మీద ఓ బరువైన విషాద గీతం నడివీధిలో అమ్మ అంటూ సాగుతుంది . వేటూరి , జాలాది పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , రామకృష్ణ , జిక్కి , చిత్ర , శైలజ శ్రావ్యంగా పాడారు .
డాన్సుల్ని శ్రీను , దుర్గ , రీటా కంపోజ్ చేసారు . ముఖ్యంగా తోట పాట వయ్యారుల గుంపుతో బాగుంటుంది .
డైలాగుల్ని వెటరన్ జంధ్యాల వారు వ్రాసారు . కాట్రగడ్డ రవితేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనట్లయితే ట్రై చేయండి . చేయొచ్చు ….
Share this Article